
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల వాతావరణంలో ఆరంభమైన జాతీయ మాన్‌సూన్ రెగట్టా చాంపియన్‌షిప్ మొదటి రోజు హైదరాబాద్ సెయిలర్స్ సత్తా చాటారు. సోమవారం జరిగిన మెయిన్ ఫ్లీట్ ఈవెంట్‌లో మాజీ జాతీయ చాంపియన్ విజయ్ కుమార్, ప్రీతి కొంగర, లక్ష్మీ నూకరత్నం మెరిశారు. బెంగుళూరు ఆర్మీ త్రిష్ణ సెయిలింగ్ క్లబ్ తరపున బరిలో దిగిన లోకల్ హీరో విజయ్ కుమార్ మొదటి రేస్‌లో తడబడ్డా... తరువాతి రేస్‌లలో 2వ, 3వ స్థానాల్లో నిలిచాడు. మొత్తం మీద 14 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ చౌను కుమారుకు మొదటి రోజు ఏమాత్రం కలసి రాలేదు. అతను 13వ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో హైదరాబాద్ యాట్ క్లబ్ తరపున బరిలో దిగిన ప్రీతి కొంగర రెండో రేస్‌లో విజేతగా నిలిచింది. రేస్ ఆరంభం నుంచి ముగింపు వరకు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అదే క్లబ్‌కు చెందిన లక్ష్మీ నూకరత్నం బాలికల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్‌గా బరిలో దిగిన ఉమా చౌహాన్ (ఎన్‌ఎస్‌ఎస్ భోపాల్) నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
గ్రీన్ ఫ్లీట్‌లో హైదరాబాద్ యాట్ క్లబ్ హవా..
అనంతరం జరిగిన గ్రీన్ ఫ్లీట్ సెయిలింగ్ పోటీల్లో హైదరాబాద్ యాట్ క్లబ్ హవా కనబరిచింది. బాలుర విభాగంలో సునీల్ ముదావత్ (మడ్‌ఫోర్ట్ స్కూల్) మొదటి స్థానంలో నిలవగా.. మల్లేష్ గడ్డం (ఎమ్‌జేపీటీ స్కూల్) రెండో స్థానంలో, ప్రవీణ్ రమావత్ మూడో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో సుప్రియ పీరంపల్లి, శ్రీ హర్షిత, వైష్ణవి తాలపల్లి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. హైదరాబాద్ మారియోట్ హోటల్స్ సమర్పణలో ప్రారంభమైన రెగెట్టా సెయిలింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఈనెల 28 వరకు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment