
0-4-8-6-0-9-5-4-0-0-0
హిమాచల్ ప్రదేశ్ స్కోరు 36 పరుగులు
బెంబేలెత్తించిన హైదరాబాద్ బౌలర్లు
భండారి 3-3-0-4
హైదరాబాద్ 99/7
గువహటి: పైనున్న అంకెలను చూసి ఏదో ఫ్యాన్సీ ఫోన్ నంబర్ అనుకుంటున్నారా..? కానీ ఇవన్నీ హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ బ్యాట్స్‌మెన్ చేసిన స్కోర్లు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌తో పాటు చివరకు ఎక్స్‌ట్రాలు కూడా సున్నా చుట్టేశారుు! ఇదంతా హైదరాబాద్ బౌలర్ల ఘనత. ఒకరితో మరొకరు పోటీ పడుతూ నలుగురు సభ్యుల బౌలింగ్ బృందం చెలరేగడంతో హిమాచల్ ప్రదేశ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. చివరకు జట్టు మొత్తం 25 ఓవర్లలో 36 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత హైదరాబాద్ కూడా 7 వికెట్లు కోల్పోరుుంది. బాలచందర్ అనిరుధ్ (111 బంతుల్లో 44 బ్యాటింగ్; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. రెండో రోజు ఆటలో మొత్తం 15 వికెట్లు పడినట్లరుుంది.
టపటపా...
తొలి రోజు వర్షం కారణంగా 4.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా...8/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు శుక్రవారం ఆట ప్రారంభించిన హిమాచల్ ప్రదేశ్ 20.5 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ముందుగా నిఖిల్ గంగ్తా (8)ను బౌల్ట్ చేసి రవికిరణ్ ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. తర్వాతి ఓవర్లోనే డోగ్రా (6)ను మిలింద్ అవుట్ చేశాడు. ఆ తర్వాత బిస్త్ (0), రిషి ధావన్ (9) కూడా వెనుదిరిగారు. ఈ దశలో లెగ్ స్పిన్నర్ ఆకాశ్ భండారి హిమాచల్‌ను ఆటాడుకున్నాడు. 3 ఓవర్లు మాత్రమే వేసిన అతను ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మిగిలిన 4 వికెట్లకు పడగొట్టాడు. రవికిరణ్ (3/12), మిలింద్ (2/15), సిరాజ్ (1/9) ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.
ఆదుకున్న అనిరుధ్...
హిమాచల్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఆనందం హైదరాబాద్‌కు ఎంతో సేపు నిలవలేదు. 41 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేసిన జట్టు 7 వికెట్లు కోల్పోయింది. బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తున్న పిచ్‌పై రిషి ధావన్ (6/35) చెలరేగిపోయాడు. 5 పరుగుల వద్ద జట్టు బెంజమిన్ థామస్ (4) వికెట్ కోల్పోయింది. ఈ దశలో బి.అనిరుధ్, అక్షత్ (59 బంతుల్లో 23; 2 ఫోర్లు) రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించి జట్టుకు ఆధిక్యం అందించారు. సందీప్ (0), బద్రీనాథ్ (0), భండారి (4), హసన్ (4) విఫలమయ్యారు. ప్రస్తుతం అనిరుధ్‌తో పాటు మిలింద్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. పిచ్ కొంత ఇబ్బందికరంగా ఉన్నా... బ్యాట్స్‌మెన్ చేతగానితనం వల్లే ఇన్ని వికెట్లు పడ్డాయని ఇరు జట్ల ఆటగాళ్లు బద్రీనాథ్, డోగ్రా, బిస్త్ అంగీకరించారు. ఇలాంటి వికెట్‌పైనా గట్టిగా నిలబడిన అనిరుధ్ ప్రతిభను వారు ప్రశంసించారు.