
నడియాడ్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా ఆంధ్రతో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 2/0తో రెండో రోజైన గురువారం ఆట కొనసాగించిన గుజరాత్... ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 94 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 354 పరుగులు చేసింది. దాంతో 177 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అక్షర్ పటేల్ (89; 8 ఫోర్లు, సిక్స్), చిరాగ్ గాంధీ (80 బ్యాటింగ్; 8 ఫోర్లు, సిక్స్), పార్థివ్ పటేల్ (57; 7 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర బౌలర్ షోయబ్ మొహమ్మద్ ఖాన్ (3/78) ధాటికి గుజరాత్ ఒక దశలో 144 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే చిరాగ్ గాంధీ జట్టును ఆదుకున్నాడు. అతను అక్షర్ పటేల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 141 పరుగులు... అనంతరం యశ్ గర్ధారియా (37 బ్యాటింగ్)తో కలిసి అభేద్యమైన ఏడో వికెట్‌కు 69 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
హైదరాబాద్ 272 ఆలౌట్
హైదరాబాద్ వేదికగా విదర్భతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 94.5 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 239/7తో రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ మరో 33 పరుగులు జోడించి చివరి 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విదర్భ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 4 వికెట్లకు 242 పరుగులు చేసింది. ఓపెనర్ ఫజల్ అజేయ శతకం (126 బ్యాటింగ్; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కదంతొక్కాడు. అతనికి గణేశ్ సతీశ్ (65; 9 ఫోర్లు, సిక్స్) చక్కటి సహకారం అందించాడు. హైదరాబాద్ బౌలర్ రవి కిరణ్ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం విదర్భ 30 పరుగులు వెనుకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment