సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్-25 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు విజయం చేజారింది. విదర్భతో ఇక్కడి ఎన్‌ఎఫ్‌సీ మైదానంలో గురువారం ముగిసిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంలో హైదరాబాద్ విఫలమైంది. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆఖరి రోజు 420 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేయగలిగింది.
తుషార్ కడు (118 బంతుల్లో 79; 10 ఫోర్లు, 1 సిక్స్), ఏవీ వాంఖడే (54 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో విదర్భను ఆదుకున్నారు. ఏపీ ఛోరే (36), ఏసీ శర్మ (27), ఏఏ సార్వతే (25) కూడా ప్రత్యర్థి గెలుపును అడ్డుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో కనిష్క్ నాయుడు 3, మెహదీ హసన్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు 172/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ 8 వికెట్లకు 306 పరుగులకు డిక్లేర్ చేసింది. బెంజమిన్ థామస్ (75 బంతుల్లో 59; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ సింగ్ (47 బంతుల్లో 61; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు.
హైదరాబాద్ చేజారిన విజయం
Published Fri, Nov 1 2013 12:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement