సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీలో గత ఏడాది ఘోర ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ ఈ సారైనా మెరుగైన ఆటతీరును కనబర్చాలని భావిస్తోంది. 2013-14 సీజన్‌లో భాగంగా నేటినుంచి జరిగే తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్, ఆంధ్ర జట్టుతో తలపడుతుంది. గత ఏడాది గ్రూప్ ‘ఎ’లో ఉన్న హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి గ్రూప్ ‘సి’కి పడిపోయింది. మరో వైపు ఆంధ్ర మాత్రం గ్రూప్ ‘సి’లోనే కొనసాగుతోంది. ఈ గ్రూప్‌లో అగ్ర స్థానంలో నిలిచే రెండు జట్లు మళ్లీ పై గ్రూప్‌కు వెళ్లేందుకు అర్హత సాధిస్తాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి అవకాశాలు మెరుగు పర్చుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
యువ ఆటగాళ్లదే భారం...
గత ఏడాది ఆడిన జట్టునుంచి కొందరు ఆటగాళ్లను తప్పించి కొత్త సీజన్ కోసం హైదరాబాద్ సెలక్టర్లు టీమ్‌ను ఎంపిక చేశారు. సీనియర్లలో రవితేజ, అహ్మద్ ఖాద్రీ మాత్రం తమ స్థానాలు నిలబెట్టుకోగలిగారు. గత మూడు సీజన్లు నిలకడగా రాణిస్తున్న కెప్టెన్ అక్షత్ రెడ్డి మరో సారి బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఇటీవల చాలెంజర్ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలో ఆడిన అక్షత్ పరిమిత అవకాశాల్లో కూడా ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్‌గా తిరుమలశెట్టి సుమన్ పునరాగమం చేశాడు. మిడిలార్డర్‌లో విహారి, సందీప్ కీలకం కానున్నారు.
దూకుడైన బ్యాటింగ్‌తో గత ఏడాది అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ఆశిష్ రెడ్డి మరో సారి ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. బౌలింగ్‌లో సీవీ మిలింద్, ఖాదర్ రూపంలో ఇద్దరు లెఫ్టార్మ్ పేసర్లు ఉన్నారు. ముఖ్యంగా యువ కెరటం మిలింద్ ఇటీవల భారత అండర్-19 జట్టు సభ్యుడిగా ఆస్ట్రేలియా, శ్రీలంకలలో చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఇప్పటి వరకు దేశవాళీ వన్డేలు, టి20 మ్యాచ్‌లు ఆడిన మిలింద్, తొలి సారి రంజీ ట్రోఫీ బరిలోకి దిగనున్నాడు. జట్టులో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడని ఆటగాడు అతనొక్కడే. భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుండటం జట్టు బౌలింగ్‌ను పటిష్టం చేసింది.
భుయ్ అవుట్...
మరో వైపు ఆంధ్ర జట్టులో ఎక్కువ మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఉన్న అమోల్ మజుందార్ ఆ జట్టు బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. షాబుద్దీన్, విజయ్ కుమార్, ప్రదీప్, బోడ సుమంత్‌లు జట్టులోని ఇతర సీనియర్లు. ఇటీవలే భారత యువ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన కుర్రాడు రికీ భుయ్ గాయంతో మ్యాచ్‌కు దూరం కావడం ఆంధ్ర బ్యాటింగ్‌ను బలహీనం చేసింది. ప్రశాంత్ కుమార్, బాషా బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు.
జట్ల వివరాలు
హైదరాబాద్: అక్షత్ రెడ్డి (కెప్టెన్), ప్రజ్ఞాన్ ఓజా, సుమన్, విహారి, సందీప్, సందీప్ రాజన్, రవితేజ, అహ్మద్ ఖాద్రీ, ఆశిష్ రెడ్డి, అమోల్ షిండే, హబీబ్ అహ్మద్ (వికెట్ కీపర్), సీవీ మిలింద్, రవికిరణ్, ఎంఏ ఖాదర్, ఆకాశ్ భండారి.
ఆంధ్ర: ఏజీ ప్రదీప్ (కెప్టెన్), ప్రశాంత్ కుమార్ (వైస్ కెప్టెన్), మురుముళ్ల శ్రీరామ్, శ్రీకార్ భరత్ (వికెట్ కీపర్), కాకాని హరీశ్, సయ్యద్ షాబుద్దీన్, దువ్వారపు శివకుమార్, బోడపాటి సుమంత్, పైడికాల్వ విజయ్ కుమార్, షేక్ బాషా, అమోల్ మజుందార్, శంకరరావు, చీపురుపల్లి స్టీఫెన్, మర్రిపురి సురేశ్.
తొలి పోరుకు రంగం సిద్ధం
Published Sun, Oct 27 2013 12:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement