రెండేళ్ల క్రితం రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ డివిజన్‌లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుని హైదరాబాద్ జట్టు భవిష్యత్తుపై ఆశలు రేపింది. క్వార్టర్ ఫైనల్ చేరుకొని మంచి సంకేతాలిచ్చింది.
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల క్రితం రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ డివిజన్‌లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుని హైదరాబాద్ జట్టు భవిష్యత్తుపై ఆశలు రేపింది. క్వార్టర్ ఫైనల్ చేరుకొని మంచి సంకేతాలిచ్చింది. అయితే గత సీజన్‌లో పటిష్ట జట్లతో తలపడి గ్రూప్ ‘ఎ’లో చిట్టచివరన నిలవడంతో మళ్లీ వెనక్కి పడిపోయింది.
ఈ సారైనా కాస్త మెరుగ్గా ఆడి ముందుకు వెళతారనుకుంటే ఎక్కడ వేసిన...అన్న చందంగా జట్టు పరిస్థితి తయారైంది. తాజాగా ముగిసిన 2013-14 సీజన్‌లో 9 జట్లు ఉన్న గ్రూప్ ‘సి’లో ఆరో స్థానంతో సరి పెట్టుకుంది. దేశవాళీ క్రికెట్‌లో గతమెంతో ఘనంగా ఉన్న హైదరాబాద్...సోదిలో కూడా లేని త్రిపురను కూడా ఓడించలేక ఆపసోపాలు పడింది. కనీసం సొంతగడ్డపై ఆడిన అనుకూలతను కూడా నాలుగు మ్యాచుల్లో ఉపయోగించుకోలేకపోయింది. ఫలితంగా వచ్చే సీజన్ కోసం కూడా గ్రూప్ ‘సి’కే పరిమితమై పెద్ద జట్లతో ఆడే అవకాశాన్ని కోల్పోయింది. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడమే కాస్త కంటితుడుపుగా చెప్పవచ్చు.
దక్కింది ఒక్కటే...
ఈ సీజన్‌లో హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌లను సొంత మైదానం ఉప్పల్‌లో, మరో నాలుగు మ్యాచ్‌లను ప్రత్యర్థి గడ్డపై ఆడింది. ఇందులో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 185 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది జట్టుకు లభించిన ఏకైక విజయమిదే. గువహటిలో జరిగిన మ్యాచ్‌లో బలహీనమైన అసోంకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయింది. గోవా, జమ్మూ కాశ్మీర్‌లతో జరిగిన మ్యాచుల్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినా...ఏ దశలోనూ విజయానికి చేరువ కాలేదు.
ఇక ఉప్పల్ స్టేడియంలో సహజంగా ఉండే అనుకూలతను ఏ మాత్రం ఉపయోగించుకోలేకపోయింది. ఇక్కడ కనీసం రెండు మ్యాచ్‌లు నెగ్గినా ఫలితం మరోలా ఉండేది. ఆంధ్రపై మాత్రమే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కగా...కేరళతో ఆధిక్యమూ కోల్పోయింది. జీవం లేని పిచ్‌పై జరిగిన మరో రెండు మ్యాచుల్లో కనీసం ఒక్కో ఇన్నింగ్స్ కూడా పూర్తి కాలేదు. ఈ గ్రూప్‌లో మహారాష్ట్రను బలమైనా జట్టుగా భావించినా...చివరకు త్రిపుర కూడా హైదరాబాద్‌కు తలవంచలేదు. ఫలితంగా ఈ రెండు మ్యాచుల్లో ఒక్కో పాయింట్‌తోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది.
వ్యక్తిగత ప్రదర్శనలతో సరి...
మరో వైపు ఈ సీజన్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు కొంత వరకు హైదరాబాద్‌కు సంతృప్తినిచ్చాయి. ముఖ్యంగా అండర్-19తో గుర్తింపు తెచ్చుకున్న హనుమ విహారి (11 ఇన్నింగ్స్‌లలో 841 పరుగులు) ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే సత్తా తనలో ఉందని నిరూపించాడు. ఎనిమిది మ్యాచుల్లో అతను ‘డబుల్’ సహా 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. అయితే గణాంకాలపరంగా గొప్పగా ఉన్నా ఇవన్నీ చిన్న జట్లపై చేసినవి కావడంతో కెరీర్‌లో ఇవి విహారిలాంటి ఆటగాడికి పెద్దగా మేలు చేయకపోవచ్చు. ఇతర ఆటగాళ్లలో సీనియర్ రవితేజ (694) నిలకడగా ఆడగా... ఆరంభంలో విఫలమైనా... కెప్టెన్ అక్షత్ రెడ్డి (536) ఆ తర్వాత తన గత రెండు సీజన్ల ఫామ్‌ను కొనసాగించాడు.
ఖాద్రీ (355), సుమన్ (356) ఓకే అనిపించారే తప్ప చెప్పుకోదగ్గ విధంగా రాణించలేదు. ఈ సీజన్‌లో జట్టు వైఫల్యానికి బౌలింగే ప్రధాన కారణమని చెప్పవచ్చు. సీజన్‌లో వెలుగులోకి వచ్చిన ఆటగాడిగా పేసర్ రవికిరణ్ (25.26 సగటుతో 30 వికెట్లు) గురించి ప్రత్యేకంగా చెప్పవచ్చు. అతనికి మరే బౌలర్‌నుంచి సహకారం దక్కకపోవడంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చెలరేగారు.
కేరళతో ఆఖరి మ్యాచ్ డ్రా
ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, కేరళ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ గురువారం డ్రాగా ముగిసింది. 367 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ ఆట ముగిసే సరికి 47 ఓవర్లలో 2 వికెట్లకు 146 పరుగులు చేసింది. జగదీశ్ (57 నాటౌట్), సురేంద్రన్ (57) రాణించారు. అంతకు ముందు హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌటైంది. షిండే (91), ఆశిష్ రెడ్డి (50) అర్ధ సెంచరీలు చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కేరళకు 3 పాయింట్లు, హైదరాబాద్‌కు 1 పాయింట్ దక్కింది.
భవిష్యత్ ఏమిటి...
ఈ యేడు ప్రదర్శనతో జట్టులో చాలా మంది ఆటగాళ్లు వచ్చే సీజన్ కోసం తమ స్థానాలు నిలబెట్టుకున్నట్లే! కాబట్టి పెద్దగా మార్పులు లేకుండా ఇదే జట్టు కొనసాగవచ్చు. ఇలాంటి టీమ్‌ను గెలిచే విధంగా తయారు చేయడం హెచ్‌సీఏ బాధ్యత. కేవలం బీసీసీఐ నుంచి నిర్వహణపరమైన ప్రశంసలతో మనుగడ సాగిస్తున్న హైదరాబాద్ ఆటలో మాత్రం వెనుకబడిపోతోంది. ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఫలితాలు మాత్రం దక్కడం లేదు. భారత మాజీ క్రికెటర్ సునీల్ జోషి 2011-12 సీజన్‌లో జట్టుకు కోచ్‌గా రాగానే టీమ్ క్వార్టర్స్‌కు వెళ్లడంతో అతనిపై ప్రశంసలు కురిశాయి. ఆ తర్వాతి రెండు సీజన్ల పరాభవంతో ఇకపై జోషిని కొనసాగించకపోవచ్చు. కొత్త కోచ్, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళితేనే హైదరాబాద్ భవిష్యత్తులో దేశవాళీలో మళ్లీ గుర్తింపు తెచ్చుకోగలుగుతుంది.