హైదరాబాద్ x ఆంధ్ర | Hyderabad x Andhra | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ x ఆంధ్ర

Published Sun, Dec 7 2014 12:40 AM | Last Updated on Tue, May 29 2018 6:13 PM

హైదరాబాద్  x ఆంధ్ర - Sakshi

హైదరాబాద్ x ఆంధ్ర

తొలి పోరులో ‘ఢీ’
 నేటి నుంచి రంజీ ట్రోఫీ షురూ
 మొదటి రౌండ్‌లో 12 మ్యాచ్‌లు
 
 సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 2014-15 సీజన్ మ్యాచ్‌లు ఆదివారం ప్రారం భం కానున్నాయి. తొలి రౌండ్‌లో భాగంగా వివిధ మైదానాల్లో నేటి నుంచి 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ వైఎస్‌ఆర్ స్టేడియంలో నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు హైదరాబాద్, ఆంధ్ర జట్లు తలపడబోతున్నాయి. గత ఏడాది ఫార్మాట్‌నే కొనసాగిస్తూ మొత్తం 27 జట్లను మూడు గ్రూప్‌లుగా విభజించారు.
 
 సాధారణంగా ప్రతి ఏటా వన్డే టోర్నీలకు ముందే రంజీ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. అయితే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్‌లో ముందుగా వన్డేలు జరిపారు. దాంతో కాస్త ఆలస్యంగా రంజీ ట్రోఫీ మొదలవుతోంది. ఫిబ్రవరి 8నుంచి 12 వరకు జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది.
 
 ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు సభ్యులు మినహా ఇతర ఆటగాళ్లంతా ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. పలువురు వెటరన్, సీనియర్ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తులో టీమిండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు కూడా ఈ నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
 
 రాత మారుతుందా...
 రంజీ ట్రోఫీలో చాన్నాళ్లుగా హైదరాబాద్, ఆంధ్ర జట్లది ఒకే రకమైన కథ, వ్యథ. ఇరు జట్లు ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వేస్తున్నాయి. ఎప్పుడో ఒక మెరుపు తప్ప దేశవాళీలో నిలకడగా, చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. గత సీజన్‌లో గ్రూప్ ‘సి’ నుంచి బరిలోకి దిగిన హైదరాబాద్, ఆంధ్ర మెరుగ్గా రాణించలేక అక్కడే చతికిలపడ్డాయి. ఫలితంగా ఈసారీ గ్రూప్‌‘సి’ బరిలో దిగాల్సి వస్తోంది. రంజీ నిబంధనల ప్రకారం ‘సి’ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’కి ప్రమోట్ అవుతాయి.
 
 గత ఏడాది అక్షత్ రెడ్డి సారథ్యంలో బరిలోకి దిగిన హైదరాబాద్ ఇప్పుడు రవితేజను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన కైఫ్‌కు ఆంధ్ర జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇరు జట్లలోనూ స్వల్ప మార్పులు మినహా ఎక్కువ మంది పాతవారే ఉన్నారు. ఈ రెండు జట్లలో ఏదైనా ముందుకు వెళుతుందో చూడాలి.
 
 రంజీ ట్రోఫీ గ్రూప్‌ల వివరాలు
 గ్రూప్ ‘ఎ’: కర్ణాటక, బెంగాల్, ముంబై, రైల్వేస్, యూపీ, బరోడా, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్.
 గ్రూప్ ‘బి’: మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, సౌరాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, విదర్భ, హర్యానా, ఒడిషా.
 గ్రూప్ ‘సి’: హైదరాబాద్, ఆంధ్ర, గోవా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, అస్సాం, త్రిపుర, జార్ఖండ్, సర్వీసెస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement