హైదరాబాదీలతో బిర్యానీ గురించే...
♦ సచిన్ సరదా కబుర్లు
♦ నగరంలో మాస్టర్ సందడి
సాక్షి, హైదరాబాద్ : మాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు నగరంతో ఎంతో అనుబంధం ఉంది. తన కెరీర్‌లో పలు అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇక్కడ ఆడిన సచిన్‌కు... వ్యక్తిగతంగా కూడా అనేక మంది స్నేహితులు ఉన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో దానిని అతను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ‘ఒకసారి అంబటి రాయుడుతో నేను 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడాను. ఆ తర్వాత సహచరుడు ఒకరు ఇంత సేపు క్రికెట్ గురించి మాట్లాడి ఉండకపోవచ్చని అన్నాడు. అతను అన్నది నిజమే. నేను అంతసేపు హైదరాబాదీ బిర్యానీ గురించి, దాని విశేషాల గురించే మాట్లాడాను.
ఇది రాయుడు ఒక్కడితోనేకాదు. ఓజాతో కూడా ఈ విషయంపై తరచూ చర్చిస్తూనే ఉంటా. ఎప్పటికైనా హైదరాబాదీ బిర్యానీ ప్రత్యేకమే. అన్నట్లు నేను ఎప్పుడు నగరానికి వచ్చినా ప్రియమిత్రుడు లక్ష్మణ్ నా కోసం బిర్యానీ సిద్ధం చేయిస్తాడు‘ అని సచిన్ చెప్పాడు. కొన్నాళ్ల క్రితం తాజ్ ఫలక్‌నుమాను కుటుంబసమేతంగా సందర్శించిన విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు. ఆ కట్టడం నిర్మాణ శైలి, గొప్పతనం తనను ఆకట్టుకున్నాయన్నాడు.
సచిన్ స్మాష్: హైదరాబాద్‌లో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన గేమింగ్ జోన్ స్మాష్‌ను సచిన్ సందర్శించాడు. దేశంలో ముంబై, ఢిల్లీల తర్వాత మూడోది ఇక్కడ ఏర్పాటైంది. శ్రీపాల్ మొరాఖియా అనే వ్యాపారవేత్తకు చెందిన ఈ స్మాష్ కంపెనీకి సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. వాస్తవంలో లేకున్నా ఉన్నట్లుగా భ్రమింపజేసే అనేక వర్చువల్ గేమ్‌లు ఇక్కడే ఆడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. తన పిల్లలతో కలిసి ఇలాంటి గేమ్‌లు తరచూ ఆడుతుంటానని, ఈ సమయంలో తాము స్నేహితుల్లా వ్యవహరిస్తామన్నాడు.
ఈ గేమ్ జోన్‌లో భాగంగా ఉన్న క్రికెట్‌లో మనకు నేరుగా మలింగ, మెక్‌గ్రాత్‌లాంటి బౌలర్లు బౌలింగ్ చేసిన అనుభూతి కలుగుతుంది. సచిన్ బౌలింగ్ చేసినప్పుడు కూడా చాలా వేగంగా బంతి వస్తుంది. దీనిపై మాస్టర్ మాట్లాడుతూ... ‘నేనూ 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయాలని ఒకప్పుడు కలగనేవాన్ని. స్మాష్ బౌలింగ్ మెషీన్ దానిని నిజం చేసింది’ అని సరదాగా వ్యాఖ్యానించాడు.