టీమిండియా ఓటమి నిరాశ పరిచింది..కానీ
కోల్ కతా:దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను టీమిండియా కోల్పోవడం నిరాశ పరిచినా.. ఇది రాబోవు ట్వంటీ 20 వరల్డ్ కప్ కు ఒక గుణపాఠంగా ఉపయోగపడుతుందని జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి తెలిపాడు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో టీమిండియా ఓటమి చెంది సిరీస్ ను దక్షిణాఫ్రికాకు అప్పగించగా.. మూడో ట్వంటీ 20 వర్షం వల్ల రద్దయ్యింది. దీనిపై చివరి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి.. ట్వంటీ 20 సిరీస్ లో జట్టు పోరాటపటిమ నిరాశ పరిచినా.. వన్డే సిరీస్ లో దక్షిణాఫ్రికాకు గట్టిపోటీ ఇస్తామన్నాడు.
ఈ సిరీస్ లో గెలవడానికి అహర్నిశలు కృషి చేసినా ఓటమి పాలు కావడం కాస్త బాధ కల్గించదన్నాడు. తొలి మ్యాచ్ లో పోరాట పటిమ కనబరిచినా, రెండో మ్యాచ్ లో జట్టులో సమిష్టితత్వం లోపించదన్నాడు. ఈ తాజా ఓటమిపై ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం అయితే లేదని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.