'ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తా'
కొలంబో: తన చివరి టెస్టులో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తానని శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర వెల్లడించాడు. భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో తమ టీమ్ ను గెలిపించేందుకు తనవంతు పాత్ర పోషించడంపైనే దృష్టి పెట్టానని వెల్లడించాడు. అయితే ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోలేదన్నాడు. చివరి టెస్టులో సెంచరీ చేయాలకుని తనకు తానుగా ఒత్తిడికి గురికాబోనని చెప్పాడు.
టీమిండియాను సమర్థవంతంగా ఎదుర్కొవడంపైనే దృష్టి నిలిపానన్నాడు. గాలెలో జరిగిన మొదటి టెస్టులో కోహ్లి సేన అనూహ్యంగా ఓటమిపాలైందని, టెస్టు క్రికెట్ సవాల్ తో కూడుకున్నదనడానికి ఇదే నిదర్శమని చెప్పాడు. క్రికెట్ కు వీడ్కోలు చెప్పడం తనకు కష్టంగానే ఉందని అన్నాడు. చివరి టెస్టు తనకు భావోద్వేగంతో కూడుకున్నదేనన్నాడు.
తన టీమ్ మేనేజ్ మెంట్ తో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ పూర్తి చేశానన్నాడు. రిటైర్ తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని వెల్లడించాడు. తనకు ఇచ్చిన అవకాశాలకు శ్రీలంకకు కృతజ్ఞుడినై ఉంటానని సంగక్కర ప్రకటించాడు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.