last test match
-
క్రాలీ సూపర్ సెంచరీ
సౌతాంప్టన్: పాకిస్తాన్‌తో శుక్రవారం ప్రారంభమైన మూడో టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. జాక్ క్రాలీ (269 బంతుల్లో 171 బ్యాటింగ్; 19 ఫోర్లు) కెరీర్లో తొలి టెస్టు సెంచరీతో అదరగొట్టగా... అతనికి వికెట్ కీపర్ జాస్ బట్లర్ (148 బంతుల్లో 87; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తన దూకుడైన బ్యాటింగ్‌తో సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా ఇప్పటికే 205 పరుగులు జోడించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలో పాక్ బౌలర్లు దెబ్బ తీశారు. బర్న్స్ (6), సిబ్లీ (22), రూట్ (29), పోప్ (3) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. 127 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ దశలో పట్టు బిగించేందుకు వచ్చిన అవకాశాన్ని పాకిస్తాన్ చేజార్చుకుంది. టెస్టుల్లో 500 వికెట్లు మైలురాయిని దాటిన ఏడో బౌలర్‌గా నిలిచిన స్టువర్ట్ బ్రాడ్‌ను ఈసీబీ సన్మానించింది. మూడో టెస్టు ఆరంభానికి ముందు ఈసీబీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ‘సిల్వర్ స్టాంప్’ జ్ఞాపికను బ్రాడ్‌కు అందజేశారు. -
సిరీస్‌పై ఇంగ్లండ్ కన్ను
సౌతాంప్టన్: కరోనా విరామం అనంతరం సొంత గడ్డపై వరుసగా రెండో టెస్టు సిరీస్‌పై గెలవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్... నేటి నుంచి పాకిస్తాన్‌తో ఆరంభమయ్యే చివరిదైన మూడో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలో దిగనుంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 1–0తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో విజయం దక్కకపోయినా... కనీసం ‘డ్రా’ చేసుకున్నా సిరీస్ ఇంగ్లండ్ వశం కానుంది. మరో పక్క సిరీస్ తొలి టెస్టులో గెలుపు దారి నుంచి ఓటమి ఒడి చేరిన పాకిస్తాన్... ఈ మ్యాచ్‌లోనైనా సమిష్టిగా రాణించి సిరీస్‌ను ‘డ్రా’ చేయలానే పట్టుదలతో ఉంది. వర్షం, వెలుతురు లేమి సమస్యలతో రెండో టెస్టు 134.3 ఓవర్లు మాత్రమే సాగింది. వెలుతురు సమస్యకు చెక్ పెట్టే పనిలో ఈ మ్యాచ్ షెడ్యూల్ కంటే అరగంట ముందుగానే ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో రెండో స్థానానికి ఎగబాకుతుంది. వ్యక్తిగత కారణాలతో స్టార్ ఆల్‌రౌండ్ బెన్ స్టోక్స్ సిరీస్‌లోని దూరమైనా... ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పాకిస్తాన్ కంటే బలంగా కనిపిస్తోంది. రూట్ సారథ్యం ఆ జట్టుకు అదనపు బలం. గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతోన్న జేమ్స్ ఆండర్సన్ రెండో టెస్టులో లయ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు. -
సరైన ఆరంభం లభించింది
దాదాపు 18 సంవత్సరాల తర్వాత భారత టెస్టు క్రికెట్ జట్టులో అచ్చ తెలుగు కుర్రాడు కనిపించాడు... దేశవాళీలో నిలకడైన ఆటతో సెలక్టర్ల మనసులు గెలుచుకున్న ఆ అబ్బాయి గాదె హనుమ విహారి. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో చోటు దక్కించుకున్న విహారి తన తొలి ఇన్నింగ్స్‌లోనే అర్ధసెంచరీతో మెరిసి ఈ ఘనత సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగించి రెగ్యులర్ సభ్యుడిగా జట్టులో చోటు నిలబెట్టు కోవాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఓవల్ టెస్టు ముగిశాక స్వస్థలం చేరుకున్న విహారి తన తొలి టెస్టు అనుభవం గురించి ‘సాక్షి’తో మాట్లాడాడు. విశేషాలు అతని మాటల్లోనే... ఓవల్ టెస్టు అరంగేట్రంపై... గొప్ప అనుభూతి. ఎప్పటికైనా దేశం తరఫున ఆడాలని నేను పెట్టుకున్న లక్ష్యం ఆ రోజు పూర్తయింది. టెస్టు ఆరంభానికి రెండు రోజుల ముందే నేను అరంగేట్రం చేయబోతున్నట్లుగా చెప్పారు. నిజానికి నేను జట్టులోకి ఎంపికైనా ఫైనల్ ఎలెవన్‌లో చోటుపై నాకూ సందేహముంది. అవకాశం వస్తుందని ఊహించలేదు. అది తెలిసిన తర్వాత చాలా ఉద్వేగానికి లోనయ్యాను. అయితే అదే అనుభూతితో ఎక్కువ సేపు ఉండిపోలేం కదా. వెంటనే బాధ్యత కూడా గుర్తుకొచ్చింది. నా స్థానం ఖరారైందని తెలిసిపోయింది కాబట్టి ఇక వేరే ఆలోచనలను పక్కన పెట్టి... తొలి మ్యాచ్‌లో బాగా ఆడాలని పట్టుదలగా నిర్ణయించుకున్నా. మ్యాచ్ ప్రదర్శనపై... సంతృప్తిగా ఉంది. తొలి టెస్టు కాబట్టి సహజంగానే ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా. కానీ ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. హాఫ్ సెంచరీతో కెరీర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక సమయంలో మరో మంచి ఇన్నింగ్స్ ఆడాలని భావించినా అది సాధ్యం కాలేదు. అనూహ్యంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఆటలో ఇలాంటివి సహజమే. మన ప్రయత్న లోపం లేకుండా శ్రమించాలి. సరైన సమయంలో నాకు అవకాశం దక్కిందని భావిస్తున్నా. మరీ కుర్రాడిగా ఉన్నప్పుడు కాకుండా కాస్త మెచ్యురిటీ వచ్చిన తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లో అడుగు పెట్టడం మానసికంగా ఎంతో మేలు చేస్తుంది. ఆంధ్రకు మారడంపై... నిజాయితీగా చెప్పాలంటే ఆ నిర్ణయం నాకు ఉపకారం చేసింది. జట్టు మారే సమయంలో కొంత రిస్క్ అవుతుందని అనిపించినా చివరకు ఆంధ్ర తరఫున ఆడాలనే నిర్ణయించుకున్నా. ఈ రెండేళ్లు బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ఎంతో పరిణతి సాధించాను. మంచి అవకాశాలు దక్కడంతో పాటు దాదాపు ప్రతీ జట్టుపై భారీగా పరుగులు సాధించగలిగాను. ఇప్పుడు టీమ్‌లోకి వచ్చాను కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం సరైందిగానే భావిస్తున్నా. నన్ను తీర్చిదిద్దడంలో హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ పాత్ర కీలకం కాగా... కొన్నాళ్లుగా ఇక్బాల్ అకాడమీ కూడా ప్రాక్టీస్ చేసేందుకు నాకు అండగా నిలిచింది. నా కెరీర్లో తొలి కోచ్‌లాంటి ఆర్. శ్రీధర్ నేను జట్టులోకి వచ్చినప్పుడు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఉండటం నాకు మానసికంగా అదనపు బలాన్ని ఇచ్చింది. బౌలింగ్‌లో వికెట్లు తీయడంపై... బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీతో పాటు ఇది బోనస్‌లాంటిది. కొత్తగా భిన్నంగా ప్రయత్నించకుండా నా సహజమైన శైలిలో ఆఫ్‌స్పిన్ బౌలింగ్ చేశాను. వరుసగా రెండు బంతుల్లో అదీ జో రూట్, కుక్ వికెట్లు తీయడం చాలా గొప్పగా అనిపించింది. కొంత అదృష్టం కూడా కలిసొచ్చిందని చెప్పగలను. రెండో ఇన్నింగ్స్‌లో తీసిన 3 వికెట్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 2013 ఐపీఎల్లో గేల్‌ను నేను ఔట్ చేసిన తరహాలోనే సరిగ్గా కుక్ కూడా ఔటైనట్లు (కట్ చేయబోయి కీపర్‌కు క్యాచ్) చాలా మంది గుర్తు చేసుకున్నారు. దేశవాళీ ఆటపై... 2012 అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా మొదటిసారి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆరేళ్లుగా నేను కఠోర సాధన చేశాను. ఏకాగ్రత చెదరకుండా, కెరీర్లో మరింత ఎదగాలనే ఏకైక లక్ష్యంతో పట్టుదలగా ఆడుతూ పోయాను. భారీగా పరుగులు సాధించడంపై తప్ప మరే అంశంపై దృష్టి పెట్టలేదు. అది ఇప్పుడు ఫలితాన్ని అందించింది. దేశవాళీ క్రికెట్లో బాగా ఆడితే కచ్చితంగా అవకాశం లభిస్తుందని నేను నమ్మాను కాబట్టి దానినే పాటించాను. ఆస్ట్రేలియా సిరీస్ అవకాశాలపై... ఇప్పుడే అంత దూరం ఆలోచించడం లేదు. అలా చేస్తే ఏకాగ్రత కోల్పోతాను. ప్రస్తుతానికి నా ఆట ఏమిటో అంతా చూశారు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో సిరీస్ ఉంది. అందులో కూడా ఎంపికై సత్తా చాటాలని భావిస్తున్నా. ఆసీస్ టూర్‌కు ఎంపికైతే మరో గొప్ప అవకాశం దక్కినట్లే. ఇప్పుడైతే విజయ్ హజారే వన్డే టోర్నీకి సిద్ధమవుతున్నాను. –సాక్షి, హైదరాబాద్ -
'ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తా'
కొలంబో: తన చివరి టెస్టులో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తానని శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర వెల్లడించాడు. భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో తమ టీమ్ ను గెలిపించేందుకు తనవంతు పాత్ర పోషించడంపైనే దృష్టి పెట్టానని వెల్లడించాడు. అయితే ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోలేదన్నాడు. చివరి టెస్టులో సెంచరీ చేయాలకుని తనకు తానుగా ఒత్తిడికి గురికాబోనని చెప్పాడు. టీమిండియాను సమర్థవంతంగా ఎదుర్కొవడంపైనే దృష్టి నిలిపానన్నాడు. గాలెలో జరిగిన మొదటి టెస్టులో కోహ్లి సేన అనూహ్యంగా ఓటమిపాలైందని, టెస్టు క్రికెట్ సవాల్ తో కూడుకున్నదనడానికి ఇదే నిదర్శమని చెప్పాడు. క్రికెట్ కు వీడ్కోలు చెప్పడం తనకు కష్టంగానే ఉందని అన్నాడు. చివరి టెస్టు తనకు భావోద్వేగంతో కూడుకున్నదేనన్నాడు. తన టీమ్ మేనేజ్ మెంట్ తో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ పూర్తి చేశానన్నాడు. రిటైర్ తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని వెల్లడించాడు. తనకు ఇచ్చిన అవకాశాలకు శ్రీలంకకు కృతజ్ఞుడినై ఉంటానని సంగక్కర ప్రకటించాడు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. -
సచిన్ చివరి టెస్టుకు వేదిక ముంబై వాంఖడే స్టేడియం
-
సచిన్ చివరి టెస్టుకు వేదిక ముంబై వాంఖడే స్టేడియం
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆడబోయే చిట్ట చివరి, 200వ టెస్టుమ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే జరగబోతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఖరారు చేసింది. ముంబైలో బీసీసీఐ పాలకవర్గం మంగళవారం సమావేశమై, సచిన్ కోరిక మేరకు అతడి చిట్టచివరి టెస్టును అతడి హోం గ్రౌండ్ అయిన ముంబై వాంఖడే స్టేడియంలో్నే ఆడించాలని నిర్ణయించింది. వాస్తవానికి సచిన్ టెండూల్కర్ 24 సంవత్సరాల కెరీర్లో అతడి తల్లి రజనీ ఒక్క మ్యాచ్ కూడా మైదానానికి వచ్చి ప్రత్యక్షంగా చూడలేదు. కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. అందుకే చివరిసారి తాను ఆడబోయే టెస్టు (200వ మ్యాచ్)ను తన తల్లి ప్రత్యక్షంగా చూడాలని మాస్టర్ కోరాడు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా లేరు. ఒకవేళ మైదానానికి వచ్చినా వీల్‌చెయిర్‌లోనే రావాలి. అటు గురువు రమాకాంత్ ఆచ్రేకర్ కూడా సచిన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు. మాస్టర్ ఇప్పటికే వాంఖడేలో తన చివరి మ్యాచ్ ఆడతానని బోర్డును కోరాడు. దీనికి బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది.