సచిన్ చివరి టెస్టుకు వేదిక ముంబై వాంఖడే స్టేడియం
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆడబోయే చిట్ట చివరి, 200వ టెస్టుమ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే జరగబోతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఖరారు చేసింది. ముంబైలో బీసీసీఐ పాలకవర్గం మంగళవారం సమావేశమై, సచిన్ కోరిక మేరకు అతడి చిట్టచివరి టెస్టును అతడి హోం గ్రౌండ్ అయిన ముంబై వాంఖడే స్టేడియంలో్నే ఆడించాలని నిర్ణయించింది.
వాస్తవానికి సచిన్ టెండూల్కర్ 24 సంవత్సరాల కెరీర్‌లో అతడి తల్లి రజనీ ఒక్క మ్యాచ్ కూడా మైదానానికి వచ్చి ప్రత్యక్షంగా చూడలేదు. కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. అందుకే చివరిసారి తాను ఆడబోయే టెస్టు (200వ మ్యాచ్)ను తన తల్లి ప్రత్యక్షంగా చూడాలని మాస్టర్ కోరాడు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా లేరు. ఒకవేళ మైదానానికి వచ్చినా వీల్‌చెయిర్‌లోనే రావాలి. అటు గురువు రమాకాంత్ ఆచ్రేకర్ కూడా సచిన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు. మాస్టర్ ఇప్పటికే వాంఖడేలో తన చివరి మ్యాచ్ ఆడతానని బోర్డును కోరాడు. దీనికి బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది.