సరైన ఆరంభం లభించింది | My job was to do well when given the opportunity | Sakshi
Sakshi News home page

సరైన ఆరంభం లభించింది

Published Sat, Sep 15 2018 4:38 AM | Last Updated on Sat, Sep 15 2018 4:38 AM

My job was to do well when given the opportunity - Sakshi

ఓవల్‌ టెస్టులో విహారికి కెప్టెన్‌ కోహ్లి అభినందన

దాదాపు 18 సంవత్సరాల తర్వాత భారత టెస్టు క్రికెట్‌ జట్టులో అచ్చ తెలుగు కుర్రాడు కనిపించాడు... దేశవాళీలో నిలకడైన ఆటతో సెలక్టర్ల మనసులు గెలుచుకున్న ఆ అబ్బాయి గాదె హనుమ విహారి. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో చోటు దక్కించుకున్న విహారి తన తొలి ఇన్నింగ్స్‌లోనే అర్ధసెంచరీతో మెరిసి ఈ ఘనత సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగించి రెగ్యులర్‌ సభ్యుడిగా జట్టులో చోటు నిలబెట్టు  కోవాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఓవల్‌ టెస్టు ముగిశాక స్వస్థలం చేరుకున్న విహారి తన తొలి టెస్టు అనుభవం గురించి ‘సాక్షి’తో మాట్లాడాడు. విశేషాలు అతని మాటల్లోనే...

ఓవల్‌ టెస్టు అరంగేట్రంపై...
గొప్ప అనుభూతి. ఎప్పటికైనా దేశం తరఫున ఆడాలని నేను పెట్టుకున్న లక్ష్యం ఆ రోజు పూర్తయింది. టెస్టు ఆరంభానికి రెండు రోజుల ముందే నేను అరంగేట్రం చేయబోతున్నట్లుగా చెప్పారు. నిజానికి నేను జట్టులోకి ఎంపికైనా ఫైనల్‌ ఎలెవన్‌లో చోటుపై నాకూ సందేహముంది. అవకాశం వస్తుందని ఊహించలేదు. అది తెలిసిన తర్వాత చాలా ఉద్వేగానికి లోనయ్యాను. అయితే అదే అనుభూతితో ఎక్కువ సేపు ఉండిపోలేం కదా. వెంటనే బాధ్యత కూడా గుర్తుకొచ్చింది. నా స్థానం ఖరారైందని తెలిసిపోయింది కాబట్టి ఇక వేరే ఆలోచనలను పక్కన పెట్టి... తొలి మ్యాచ్‌లో బాగా ఆడాలని పట్టుదలగా నిర్ణయించుకున్నా.  

మ్యాచ్‌ ప్రదర్శనపై...
సంతృప్తిగా ఉంది. తొలి టెస్టు కాబట్టి సహజంగానే ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా. కానీ ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. హాఫ్‌ సెంచరీతో కెరీర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక సమయంలో మరో మంచి ఇన్నింగ్స్‌ ఆడాలని భావించినా అది సాధ్యం కాలేదు. అనూహ్యంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఆటలో ఇలాంటివి సహజమే. మన ప్రయత్న లోపం లేకుండా శ్రమించాలి. సరైన సమయంలో నాకు అవకాశం దక్కిందని భావిస్తున్నా. మరీ కుర్రాడిగా ఉన్నప్పుడు కాకుండా కాస్త మెచ్యురిటీ వచ్చిన తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లో అడుగు పెట్టడం మానసికంగా ఎంతో మేలు చేస్తుంది.  

ఆంధ్రకు మారడంపై...
నిజాయితీగా చెప్పాలంటే ఆ నిర్ణయం నాకు ఉపకారం చేసింది. జట్టు మారే సమయంలో కొంత రిస్క్‌ అవుతుందని అనిపించినా చివరకు ఆంధ్ర తరఫున ఆడాలనే నిర్ణయించుకున్నా. ఈ రెండేళ్లు బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ఎంతో పరిణతి సాధించాను. మంచి అవకాశాలు దక్కడంతో పాటు దాదాపు ప్రతీ జట్టుపై భారీగా పరుగులు సాధించగలిగాను. ఇప్పుడు టీమ్‌లోకి వచ్చాను కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం సరైందిగానే భావిస్తున్నా. నన్ను తీర్చిదిద్దడంలో హైదరాబాద్‌లోని సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీ పాత్ర కీలకం కాగా... కొన్నాళ్లుగా ఇక్బాల్‌ అకాడమీ కూడా ప్రాక్టీస్‌ చేసేందుకు నాకు అండగా నిలిచింది. నా కెరీర్‌లో తొలి కోచ్‌లాంటి ఆర్‌. శ్రీధర్‌ నేను జట్టులోకి వచ్చినప్పుడు భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఉండటం నాకు మానసికంగా అదనపు బలాన్ని ఇచ్చింది.  

బౌలింగ్‌లో వికెట్లు తీయడంపై...
బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీతో పాటు ఇది బోనస్‌లాంటిది. కొత్తగా భిన్నంగా ప్రయత్నించకుండా నా సహజమైన శైలిలో ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌ చేశాను. వరుసగా రెండు బంతుల్లో అదీ జో రూట్, కుక్‌ వికెట్లు తీయడం చాలా గొప్పగా అనిపించింది. కొంత అదృష్టం కూడా కలిసొచ్చిందని చెప్పగలను. రెండో ఇన్నింగ్స్‌లో తీసిన 3 వికెట్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 2013 ఐపీఎల్‌లో గేల్‌ను నేను ఔట్‌ చేసిన తరహాలోనే సరిగ్గా కుక్‌ కూడా ఔటైనట్లు (కట్‌ చేయబోయి కీపర్‌కు క్యాచ్‌) చాలా మంది గుర్తు చేసుకున్నారు.  

దేశవాళీ ఆటపై...
2012 అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా మొదటిసారి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆరేళ్లుగా నేను కఠోర సాధన చేశాను. ఏకాగ్రత చెదరకుండా, కెరీర్‌లో మరింత ఎదగాలనే ఏకైక లక్ష్యంతో పట్టుదలగా ఆడుతూ పోయాను. భారీగా పరుగులు సాధించడంపై తప్ప మరే అంశంపై దృష్టి పెట్టలేదు. అది ఇప్పుడు ఫలితాన్ని అందించింది. దేశవాళీ క్రికెట్‌లో బాగా ఆడితే కచ్చితంగా అవకాశం లభిస్తుందని నేను నమ్మాను కాబట్టి దానినే పాటించాను.  

ఆస్ట్రేలియా సిరీస్‌ అవకాశాలపై...
ఇప్పుడే అంత దూరం ఆలోచించడం లేదు. అలా చేస్తే ఏకాగ్రత కోల్పోతాను. ప్రస్తుతానికి నా ఆట ఏమిటో అంతా చూశారు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో సిరీస్‌ ఉంది. అందులో కూడా ఎంపికై సత్తా చాటాలని భావిస్తున్నా. ఆసీస్‌ టూర్‌కు ఎంపికైతే మరో గొప్ప అవకాశం దక్కినట్లే. ఇప్పుడైతే విజయ్‌ హజారే వన్డే టోర్నీకి సిద్ధమవుతున్నాను.  

–సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement