ఆంటిగ్వా: తనకు మళ్లీ వెస్టిండీస్ జట్టుకు ఆడాలని ఉందంటూ ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రేవో స్పష్టం చేశాడు. విండీస్ వన్డే, టీ20 జట్లకు కీరన్ పొలార్డ్‌ను కెప్టెన్‌గా నియమించిన నేపథ్యంలో బ్రేవో స్పందిస్తూ.. ‘ నా ఫ్రెండ్ పొలార్డ్‌కు కంగ్రాట్స్. నీలో విండీస్ కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. విండీస్ జట్టును ముందుండి నడిపించి ఒక అత్తుత్తమ నాయకుడిగా ఎదుగుతావని ఆశిస్తున్నా. మళ్లీ నన్ను నేను విండీస్ జెర్సీలో చూసుకోవాలనుకుంటున్నా. విండీస్ తరఫున ఆడాలనుకుంటున్నా’ అని బ్రేవో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పేర్కొన్నాడు. దీనికి హాస్యపూరితమైన కొన్ని ఎమోజీలను జత చేశాడు. దీనికి పొలార్డ్ థాంక్స్ సోల్జర్ అని రిప్లై ఇచ్చాడు. 2018 అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేవో వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.
ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో నిలవగా, భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో కూడా ఘోరంగా వైఫల్యం చెందింది. దాంతో మార్పులకు శ్రీకారం చుట్టింది విండీస్ క్రికెట్ బోర్డు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న కార్లోస్ బ్రాత్‌వైట్‌ను ఆ పదవి నుంచి తప్పించి పొలార్డ్‌కు పగ్గాలు అప్పచెప్పింది. 2020 టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని డిఫెండింగ్ చాంపియన్ ఇప్పట్నుంచే మార్పులు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment