'ఇక కెప్టెన్గా చేసే ఉద్దేశం లేదు'
రియో డీ జనీరో:ఒలింపిక్స్ ఫుట్ బాల్ చరిత్రలో బ్రెజిల్కు తొలి స్వర్ణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్ నేమార్ ఇక సారథిగా చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ఇప్పటికే తమ జాతీయ కోచ్ కు తెలిపినట్లు నేమార్ వెల్లడించాడు.
తాజా విజయంపై చెప్పడానికి మాటలు రావడం లేదంటూ ఆనందంతో ఉబ్బితబ్బైన నేమార్.. తాము కొత్త చరిత్రను సృష్టించామనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇది తన జీవితంలోనే మరపురాని జ్ఞాపకమని నేమార్ అభివర్ణించాడు ఇక బ్రెజిల్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగే ఉద్దేశం లేదని నేమార్ తెలిపాడు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్లో బ్రెజిల్ 5-4 తేడాతో జర్మనీపై గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
నిర్ణీత సమయానికి ఇరు జట్లు తలో గోల్ తో సమంగా ఉండటంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో తొలి నాలుగు కిక్లను గోల్ గా మలచడంలో సఫలమైన జర్మనీ.. తన ఐదో కిక్ ను గోల్ గా మలచలేకపోయింది. అయితే బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమార్ మాత్రం తమ చివరి కిక్ ను గోల్ గా మలచడంతో బ్రెజిల్ ఖాతాలో స్వర్ణం చేరింది. దీంతో మ్యాచ్ జరిగిన మారకనా మైదానం హోరెత్తిపోయింది. ఒకవైపు బాణాసంచా వెలుగులతో స్టేడియం మెరిసిపోగా, మరోవైపు కారు హారన్లతో దద్దరిల్లింది.