
న్యూఢిల్లీ: మోచేతి గాయం కారణంగా దాదాపు పది నెలలుగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్ సాహా.. మళ్లీ తన పునరాగమనంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం తిరిగి కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన సాహా, తనకు రిషభ్ పంత్‌తో ఎటువంటి పోటీ లేదని అంటున్నాడు. ‘గాయం తర్వాత ఆటగాళ్లతో కలవడం గొప్పగా అనిపిస్తోంది. ఒక ఆటగాడిగా తిరిగి జట్టులోకి అడుగుపెట్టడం కన్నా ఆనందం ఏముంటుంది. చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్నట్టు నేను భావించలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌కు సాయం చేయడంపైనే దృష్టి పెడుతున్నా.
నేను జట్టుకు దూరమైనప్పుడు రిషబ్ పంత్ అవకాశం అందుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని ఎవరైనా అందిపుచ్చుకోవాలనే ప్రయత్నిస్తారు. రిషబ్ పంత్ కూడా అలాగే చేశాడు. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు. అతడిని నాకు పోటీదారుగా భావించను. నిజానికి పంత్ ఎన్‌సీఏకు వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి చాలా సమయం గడిపాం’ అని సాహా తెలిపాడు. గతేడాది ఐపీఎల్‌లో గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్ సాహా .. ఇంగ్లండ్‌లో మోచేతికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా బెంగాల్ జట్టు తరుపున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.