‘పంజరంలో పావురం’ కాదల్చుకోలేదు.. | I Don't Want To Just Segregate Myself, Jason Holder | Sakshi
Sakshi News home page

‘పంజరంలో పావురం’ కాదల్చుకోలేదు..

Published Thu, May 7 2020 3:51 PM | Last Updated on Thu, May 7 2020 3:55 PM

I Don't Want To Just Segregate Myself, Jason Holder - Sakshi

ఆంటిగ్వా: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జాసన్‌ హోల్టర్‌..తనకు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ ఆడాలనే కోరిక ఉందనే విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల కీరోన్‌ పొలార్డ్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపిక చేసి హోల్డర్‌ను టెస్టు సారథిగా మాత్రమే  పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన స్థానం ఉండదేమోనని ఆందోళనలో ఉన్న హోల్డర్‌.. తనను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు పరిగణలోకి తీసుకోవాలని బోర్డుకు విన్నవించాడు. గత కొన్ని ఏళ్లుగా విండీస్‌ తరపున అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ ఆడుతున్నానని, ఇకపై కూడా ఆడాలనే కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. (17 ఏళ్లకు ‘వరల్డ్‌కప్’‌ ఆరోపణలా?)

తాను విండీస్‌ జట్టుకు టెస్టు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ మూడు ఫార్మాట్లలో ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు.  తన దృష్టి ఎప్పుడూ విండీస్‌ క్రికెట్‌పైనే ఉంటుందని, అది కేవలం టెస్టు క్రికెట్‌ మాత్రమే కాదన్నాడు. తాను పంజరంలో పావురంలా ఏ ఒక్క దానికో పరిమితం కాదల్చుకోలేదన్నాడు. విండీస్‌ క్రికెట్‌ అనేది వేర్వేరు సందర్భాల్లో పలు రకాలుగా రూపాంతరం చెందుతూ  ఉంటుందన్నాడు. ఈ పజిల్‌లో ఆటగాళ్లంతా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడమే తమ కర్తవ్యమన్నాడు. అంతర్జాతీయ టెస్టు ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న హోల్డర్‌.. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం తమ క్రికెట్‌ జట్టులో బ్యాటింగ్‌ లోతు అసాధారణమని వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో పేర్కొన్న సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల తమ బ్యాటింగ్‌లో పూర్తి స్థాయి సామర్థ్యం బయటకు రావడం లేదని తెలిపిన బ్రేవో.. ఓవరాల్‌గా చూస్తే తమకున్న బ్యాటింగ్‌ వనరులు అమోఘమన్నాడు. 2016  టీ20  వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టు కంటే కూడా ప్రస్తుతం ఉన్న జట్టే సూపర్‌ అని బ్రేవో తెలిపాడు. ఇక పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికైన పొలార్డ్‌ నిజాయితీ పరుడంటూ బ్రేవో ప్రశంసించాడు. గతంలోని కెప్టెన్‌ల వలే సెలక్టర్లు చెప్పిన దానికి తల ఊపే నైజం  పొలార్డ్‌ది కాదని, కచ్చితమైన అభిప్రాయం చెప్పే వ్యక్తిత్వం అతని సొంతమన్నాడు.(పొలార్డ్‌లో నిజాయితీ ఉంది: బ్రేవో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement