'ఈసారి దక్షిణాఫ్రికాదే వరల్డ్ కప్'
ముంబై: ప్రపంచకప్ కు ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టులో సీనియర్లకు చోటు కల్పించకపోవడాన్ని బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ షెట్టి తప్పుబట్టాడు. సీనియర్లను పక్కన పెట్ట డం తనకెంతో అసంతృప్తి, ఆగ్రహం కలిగించిందన్నాడు. జట్టుకు సీనియర్ ఆటగాళ్లు ఎన్నో సేవలు అందించారని, వారికిప్పుడు టీమ్ లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
2011 ప్రపంచకప్ లో కీలక భూమిక పోషించిన యువరాజ్ సింగ్ ను తప్పించడం దారుణమన్నాడు. సెలక్షన్ కమిటీ సభ్యుల లాజిక్ తనకు అర్థం కాలేదన్నారు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడాన్ని తాను తప్పుబట్టడం లేదని, మరింత అనుభవం వచ్చిన తర్వాత వారిని ప్రపంచకప్ పోరుకు పంపితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లికి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నాడు. టీమిండియా ప్రపంచకప్ ఫైనల్ కు చేరకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈసారి దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశముందని సునీల్ షెట్టి అంచనా వేశాడు.