
ముంబై: వరుసగా ఆరు టెస్టుల్లో భారత జట్టుతో పాటు ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకుండానే వేటు పడిన బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ఎంపికపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇంగ్లండ్‌తో తనను ఎందుకు ఆడించలేదనే విషయం తనకు తెలీదని, ఈ విషయంపై సెలక్టర్లు తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని కరుణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెస్కే స్పందించారు. ‘వెస్టిండీస్‌తో సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసిన తర్వాత నేనే స్వయంగా కరుణ్‌తో మాట్లాడాను. జట్టులోకి ఎలా అతను తిరిగి రావచ్చో కూడా చెప్పాను. ఆటగాళ్లతో మాట్లాడే విషయంలో సెలక్షన్ కమిటీకి చాలా స్పష్టత ఉంది. క్రికెటర్లకు సమాచారం అందించడం గురించి మా కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.
ఆటగాళ్లు మాతో విభేదించినా సరే అతడిని తప్పించేందుకు సరైన కారణం చెప్పగలగాలి. రంజీ ట్రోఫీలో, భారత్ ‘ఎ’ తరఫున కరుణ్ మరిన్ని పరుగులు సాధించాలి. టెస్టుల్లో అతని పేరు పరిశీలనలోనే ఉంది. అందుకే దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు చేయమని నేను సలహా ఇచ్చా’ అని ప్రసాద్ వివరించారు. మరో వైపు ఇంగ్లండ్‌లో కూడా తుది జట్టులో స్థానం దక్కకపోవడంపై నాయర్‌తో తన సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ మాట్లాడారని కూడా ఎమ్మెస్కే చెప్పారు. ‘ఇంగ్లండ్ పర్యటనలో కూడా నాయర్‌లో స్ఫూర్తి నింపేందుకు దేవాంగ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో సుదీర్ఘంగా అతనితో మాట్లాడారు. త్వరలోనే అవకాశం దక్కుతుందని, దాని కోసం వేచి చూడాలని చెప్పారు’ అని చీఫ్ సెలక్టర్ వెల్లడించారు. వెస్టిండీస్‌తో సిరీస్ కోసం జట్టును ప్రకటించడానికి ముందు నాయర్ తాజా వ్యాఖ్యలు చేశాడు.