కోల్‌కతా: శ్రీలంకతో మొహాలీలో జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. అదొక అసాధారణమైన ఇన్నింగ్స్ అంటూ గంగూలీ కొనియాడాడు. ప్రధానంగా శతకాన్ని ద్విశతకంగా మార్చుకున‍్న క్రమంలో రోహిత్ చెలరేగిన విధానంగా నిజంగా అద్బుతమన్నాడు. కేవలం సెంచరీ నుంచి డబుల్ సెంచరీకి చేరడానికి 36 బంతులే తీసుకోవడం రోహిత్ అద్వితీయమైన ఆటకు నిదర్శనమన్నాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ ఊచకోతతో శ్రీలంక బౌలర్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైందన్నాడు. రోహిత్ దెబ్బకు లంక ఫీల్డర్లు బౌండరీ లైన్‌కే పరిమితమయ్యారన్నాడు.
'శ్రీలంక క్రికెట్ జట్టును చూస్తే జాలేస్తుంది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న శ్రీలంకకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల దెబ్బకు ఇలానే శ్రీలంక బెంబేలెత్తిపోయేది. ఇప్పుడు కోహ్లి-రోహిత్‌లు లంకను ఆడేసుకుంటున్నారు. రోహిత్ శర్మ చాలా సీరియస్ ప్లేయర్. ఈ ఏడాది అతని వన్డే రికార్డే అమోఘం. టీ 20 ఫార్మాట్‌తో రోహిత్ ఆట తీరే మారిపోయింది. డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లిలతో పోల్చదగ్గ ఆటగాడు రోహిత్. ఇదే ఊపును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా'అని గంగూలీ తెలిపాడు. మరొకవైపు డే అండ్ నైట్ టెస్టులపై కూడా గంగూలీ తన అభిప్రాయాన్ని సుస్పష్టంగా వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌కు మరింత ఆదరణ పెరగాలంటే ఎక్కువగా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉందన్నాడు. టెస్టులకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే డే అండ్ నైట్ టెస్టులే మార్గమన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment