పెర్త్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో తొమ్మిది నెలలపాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్ కామెరాన్ బెన్‌క్రాఫ్ట్.. తాను తప్పు చేసినట్టు అంగీకరించాడు. బాల్ ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించిన మాట వాస్తవమేనని, కానీ భయపడి.. ఆ విషయంలో అబద్ధం చెప్పానని తెలిపాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాదని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతుందని అతను కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు.
కెప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో మూడోటెస్టు సందర్భంగా సాండ్ పేపర్‌తో బాల్ ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించి.. బెన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తోపాటు బెన్‌క్రాఫ్ట్‌పైనా క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది. బెన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలపాటు దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశం తిరిగొచ్చిన బెన్‌క్రాఫ్ట్ పెర్త్‌లో మీడియాతో మాట్లాడాడు.
బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు దేశ ప్రజలకు, క్రికెట్ అభిమానులకు బెన్‌క్రాఫ్ట్ క్షమాపణలు చెప్పాడు. జరిగిన తప్పు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని, దేశం తరఫున, తన రాష్ట్రం తరఫున ఆడటం కన్నా గొప్ప గౌరవం తనకు మరోటి లేదని చెప్పాడు. గత ఐదురోజులుగా జరిగిన పరిణామాలు వివరిస్తూ.. బెన్‌క్రాఫ్ట్ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను చేసిన తప్పు దేశ ప్రజలను, క్రికెట్ కమ్యూనిటీ తలదించుకునేలా చేసిందని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment