న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరిద్దరి సారథ్య లక్షణాలు చాలా దూరం అంటే బాగుంటుందేమో. మైదానంలో కోహ్లి దూకుడుగా వ్యవహరిస్తే, రోహిత్ మాత్రం తన పనిని కామ్‌గానే చేసుకుపోతాడు. కాగా, కొన్ని సందర్భాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కెప్టెన్సీ లక్షణాలకు అతి దగ్గరగా రోహిత్ సారథ్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదే విషయాన్ని భారత సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఒప్పుకున్నాడు. ‘ ఫీల్డ్‌లో రోహిత్ కామ్‌గా ఉండటంతో పాటు శక్తి సామర్థ్యాల పరంగా చూస్తే ధోని కనిపిస్తాడు. ధోని కెప్టెన్సీకి రోహిత్ కెప్టెన్సీకి చాలా దగ్గర పోలికలున్నాయి. కామ్‌గానే బాధ్యతలు నిర్వర్తించడం రోహిత్ ఎంచుకున్న మార్గం. ఈ తరహా లక్షణం జట్టులోని మిగతా ఆటగాళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. బ్యాటింగ్‌కు వెళ్లిన సమయంలో పరుగులు చేయడం, కెప్టెన్‌గా ఆటగాళ్లకు సూచనలు ఇచ్చే సమయంలో కూల్‌గా వ్యవహరించడం రోహిత్ స్టైల్. గేమ్ జరుగుతున్నంసేపు బిందాస్‌గా ఉంటాడు. ఇదే నాకు రోహిత్‌లో నచ్చేది. రోహిత్ కెప్టెన్‌గా చాలా ట్రోఫీలు గెలిచాడు. ఏది ఎప్పుడు అమలు చేయాలో అప్పుడే దాన్ని ఆచరణలో పెడతాడు. రోహిత్ కచ్చితంగా మంచి సారథే’అని రైనా తెలిపాడు. (మమ్మల్ని ఆడనివ్వండి.. నిజాయితీగా ఉండండి)
ధోనిని ఏనాడు అడగలేదు
ఇక ధోని కెప్టెన్సీ విషయాలను కూడా రైనా షేర్ చేసుకున్నాడు. ధోని కెప్టెన్సీలో తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రధానంగా రైనా మాట్లాడాడు. తనను ధోని తరచు బ్యాటింగ్ ఆర్డర్‌లో మారుస్తూ పంపుతూ ఉండేవాడన్నాడు. ప్రత్యర్థి జట్టు అంచనా, పిచ్ స్వభావాన్ని బట్టి తన బ్యాటింగ్ ఆర్డర్‌ను ధోని మార్చేవాడన్నాడు. కానీ ఎందుకు పదే పదే తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుతున్నావని ఏనాడు ధోనిని అడగలేదని రైనా చెప్పుకొచ్చాడు. ‘ నా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ధోనిని ఏనాడు ప్రశ్నించలేదు. 2015 వరల్డ్‌కప్ సమయంలో ఒక మ్యాచ్‌లో నా బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత పైకి తీసుకొచ్చాడు ధోని. ఆ మ్యాచ్‌లో నేను 70 నుంచి 80 పరుగులు చేశాను.
ఆ తర్వాత సాయంత్రం సమయంలో మామూలుగా ధోని వద్ద కూర్చొన్న సమయంలో ఉండబట్టలేక ధోనిని అడిగేశా. నన్ను ఎందుకు బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి పంపంచావని అడిగా. దానికి ధోనిని నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే. ప్రత్యర్థి జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉన్నారు.. అందుచేత నిన్ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేశా అన్నాడు. లెగ్ స్పిన్ బాగా ఆడతాననే విషయం ధోనికి తెలుసు కాబట్టే అలా చేశాడు. ఏ విషయాన్నైనా మాకంటే ముందుగానే ధోని ఆలోచించేవాడు. వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తూనే మొత్తం గేమ్‌నే చదివేస్తాడు ధోని. కెమెరాలు, ప్రేక్షకులు ధోని గేమ్‌ను బాగా అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేరనే విషయాన్ని ఎప్పుడో చెప్పేశాయి.బంతి ఎంత వరకూ టర్న్ అవుతుంది. ఎంతవరకూ స్వింగ్ అవుతుంది అనేది ధోనికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అది ధోనికి దేవుడిచ్చిన వరం. అదే ధోనిని గొప్ప సారథిగా నిలిపింది’ అని రైనా పేర్కొన్నాడు. (మీరు ఇష్టపడండి.. మంచి వ్యక్తి: విరాట్ కోహ్లి)
Comments
Please login to add a commentAdd a comment