సాక్షి, ముంబై: తనను జట్టులోకి ఎంపిక చేయకుండా సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని టీమిండియా ఓపెనర్ అజింక్యా రహానే తెలిపారు. ఇక ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో ఉన్న రహానేకు టీ20 తుదిజట్టులో చోటు దక్కలేదు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో 7 వికెట్లతో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయానంతరం ప్రకటించిన టీ20 జట్టు 15 మంది సభ్యుల్లో రహానే పేరు ప్రకటించలేదు. శిఖర్ ధావన్ జట్టులోకి రాగా రహానేకు ఉద్వాసన పలికారు. దీనిపై రహానే ముంబైలో మీడియాతో మాట్లాడారు.
‘ టీం మేనేజ్‌మెంట్, సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తా. ఆటగాళ్ల మధ్య పోటీ మంచి ప్రదర్శనకు కారణమవుతోంది. ఈ పోటీని ప్రతిసారి ఆస్వాదిస్తాను. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓపెనర్‌గా రాణించడం చాల సంతోషాన్నిచ్చింది. వెస్టిండీస్ పర్యటన నుంచి నా ఫామ్‌ను కొనసాగించడం సంతృప్తినిచ్చింది. ఈ సిరీస్‌లో వరుసగా సాధించిన హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలిచాల్సింది. రోహిత్‌తో జట్టకు మంచి శుభారంభాన్ని అందించా. వచ్చే సిరీస్‌లలో నాకు అవకాశం లభిస్తే ఈ హాఫ్ సెంచరీలను శతకాలుగా మలుస్తా. ఇక జట్టు ప్రదర్శన గర్వించదగ్గ విషయం. మా లక్ష్యం ఒకటే 2019 వరల్డ్‌కప్. ఆ దిశగా ముందుకు సాగుతున్నామని’ రహానే పేర్కొన్నారు. టీ20 జట్టులో ధావన్‌తో పాటు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తిక్‌లకు చోటు దక్కింది.