
'టీమిండియాతో సిరీస్ తరువాత చూద్దాం'
కొలంబో:టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ తరువాత తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నాడు శ్రీలంక పేసర్ లసిత్ మలింగా. తన ప్రదర్శన పెద్దగా సంతృప్తి కల్గించకపోతే కెరీర్ ను వీడ్కోలు చెప్పడం ఖాయమనే సంకేతాలిచ్చాడు.
'కాలి గాయం కారణంగా 19 నెలల విరామం తరువాత శ్రీలంక జట్టులో ఆడుతున్నా. ఇటీవల జింబాబ్వేతో జరిగిన సిరీస్ తో పాటు ప్రస్తుత భారత్ తో సిరీస్ లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఈ సిరీస్ తరువాత నేను ఎక్కడ ఉంటానో చూద్దాం. ఒకవేళ నా శరీరం సహకరిస్తే మాత్రం కొంతకాలం క్రికెట్ కెరీర్ ను కొనసాగించే అవకాశం ఉంది. ఇక్కడ అనుభవం అనేది సమస్య కాదు. నేను మ్యాచ్ ను గెలిపించే ప్రదర్శన చేయలేనప్పుడు జట్టులో ఉండి ఉపయోగం ఏమి ఉంది. ఫామ్ ను అందుపుచ్చుకునే యత్నం చేస్తా. అది కూడా నా శరీరం సాధ్యమైనన్ని ఎక్కువ గేమ్ లకు సహకరిస్తేనే. నేను సరిగా బంతిని విసరలేకపోతే సంతోషంగా వీడ్కోలు చెబుతా'అని మలింగా తెలిపాడు.