న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధిస్తాననే నమ్మకముందని భారత బాక్సర్ సరితా దేవి ఆశాభావం వ్యక్తం చేసింది. గోల్డ్‌కోస్ట్‌లో జరిగే ఈ టోర్నీలో విజేతగా నిలిచేందుకు 100 శాతం కృషి చేస్తానని ఆమె చెప్పింది. పెరిగిన పోటీకి తగినట్లుగా సంసిద్ధం అవుతున్నానని ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సరితా దేవి తెలిపింది. ‘ప్రాక్టీస్ చాలా బాగా జరుగుతోంది. కామన్వెల్త్‌లో విజేతగా నిలవడమే నా లక్ష్యం. బరిలో దిగిన తర్వాత ప్రతీ ప్రత్యర్థిని ఓడించడంపైనే దృష్టి పెడతా. కానీ ఆటలో గెలుపోటములు సహజం. గతంతో పోలిస్తే మన పరిస్థితి చాలా మెరుగైంది. ఇప్పుడు నాణ్యమైన కోచ్‌లతో పాటు, అంతర్జాతీయ అనుభవం కూడా పెరిగింది. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) నుంచి లభిస్తోన్న ప్రోత్సాహం మరు వలేనిది. పురుషులతో సమానంగా మహిళల బాక్సింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు’ అని పేర్కొంది. మాజీ ప్రపంచ చాంపియన్ అయిన సరిత 60 కేజీల వెయిట్ విభాగంలో ఇటీవలే జరిగిన ఇండియన్ ఓపెన్‌లో రజతాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment