common wealth
-
చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న అంధుల వన్డే క్రికెట్ సిరీస్‌లో ఆసీస్ ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో భాగంగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బ్యాటర్ స్టెఫన్ నీరో ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. టీ20ల ప్రభావం కారణంగా వన్డేల్లో డబుల్ హండ్రెడ్ చేయడమే గగనమైన ఈ రోజుల్లో ఓ అంధ క్రికెటర్ ట్రిపుల్ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. కామన్వెల్త్ బ్యాంక్ అంధుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బ్యాటర్ స్టెఫన్ నీరో కేవలం 140 బంతుల్లో 49 ఫోర్లు, సిక్సర్ సాయంతో 309 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 542 పరుగుల భారీ స్కో్ర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన కివీస్ కేవలం 272 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా 270 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. A TRIPLE century! Steffan Nero finishes 309* (140) in the Australian Blind Cricket Team's first ODI against New Zealand 🇦🇺That's his third consecutive century at the #ICIS22 after scores of 113 (46) and 101* (47) earlier this week 👏 https://t.co/MDTiUnAC1S | #ASportForAll pic.twitter.com/cqv9vBEPW3— Cricket Australia (@CricketAus) June 14, 2022 ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన నీరో.. అంధుల వన్డే క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించడం ద్వారా స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 1998లో పాక్ బ్యాటర్ మసూద్ జాన్ చేసిన 262 పరుగులే అంధుల వన్డే క్రికెట్లో టాప్ స్కోర్‌గా ఉండింది. తాజాగా నీరో విధ్వంసంతో మసూద్ జాన్ రికార్డు బద్దలైంది. 5 టీ20లు, 3 వన్డేల ఈ సిరీస్‌లో నీరో ఇప్పటికే రెండు సెంచరీలు (113, 101) సాధించడం విశేషం. ఎనిమిదో ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు.. కివీస్‌పై వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయడంతో నీరో మరో రికార్డును కూడా తర ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా నీరో రికార్డుల్లోకెక్కాడు. గతంలో మాథ్యూ హేడెన్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో ట్రిపుల్ సెంచరీలు సాధించారు. చదవండి: ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్ప అన్న వారు ఈ లెక్కలు చూస్తే ఖంగుతినాల్సిందే..! -
ఆంధ్ర భీముడు...రాజగోపాలుడు
ఆటల పోటీల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కొద్దిమంది భారతీయుల్లో దండమూడి రాజగోపాలరావు ఒకరు. మనదేశం స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లయిన 1948లోనే మిస్టర్ ఆసియాగా గెలిచి భారతజాతికి వన్నెతెచ్చిన ఘనుడాయన. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. పెదపారుపూడి(పామర్రు): శరీర సౌష్టవ పోటీలో మిస్టర్ ఆసియా బిరుదును పొందిన తొలి ఆంధ్రుడే కాక తొలి భారతీయుడు దండమూడి రాజగోపాలరావు. ఆయన తొలి అంకంలో కొల్లి రామదాసు, సోమయాజులు తదితరుల వద్ద తర్ఫీదు పొంది 1938లో తొలిసారిగా పోటీల్లో పాల్గొని జిల్లా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ కావడం ద్వారా శరీర సౌష్టవంపై దృష్టి పెంచారు. ఫలితంగా 1940లో మొదటిసారిగా రాష్ట్రస్థాయిలో చాంపియన్‌గా గెలుపొందారు. 1945లో జాతీయస్థాయిలో 320 పౌండ్ల బరువు ఎత్తి విజేతగా నిలిచారు. 1948లో జరిగిన ఆసియా శరీరసౌష్టవ పోటీల్లో గెలుపొంది మిస్టర్ ఆసియా బిరుదును సొంతం చేసుకున్నారు. 1945 నుంచి 1958 వరకు 13 ఏళ్లపాటు జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌గా గెలుపొందుతూ ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకాన్ని దశదిశలా ఇనుమడింపజేశారు. 1948లో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో పాల్గొన్న తొలి ఆంధ్రుడు దండమూడి. రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌కు అనేక సంవత్సరాలపాటు ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. వెయిట్ లిఫ్టింగ్లోనే కాక బలప్రదర్శనలో విశేష ప్రతిభ కనబర్చారు. చాతికి గొలుసులు చుట్టి గాలిపీల్చడం ద్వారా చాతిని పెంచి వాటిని తెంపడం లాంటి సాహసకృత్యాలను దండమూడి అనేకం చేశారు. వెయిట్ లిఫ్టింగ్‌లో అర్జున అవార్డు గ్రహీత కామినేని ఈశ్వరరావు దండమూడి శిష్యుడిగానే శరరీ సౌష్టవంపై ఆసక్తి పెంచుకున్నారు. ఇదిలా ఉండగా వీరాభిమన్యు, నర్తనశాల తదితర చిత్రాల్లో భీముడి పాత్రను పోషించిన దండమూడి ప్రజల మన్ననలను చూరగొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు వ్యాయామశాలల ఏర్పాటుకు కృషిచేశారు. ఒలింపిక్ పోటీల అనంతరం విజయవాడలో ఉచిత వ్యాయామశాల నెలకొల్పారు. ప్రభుత్వం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ఆయనకు ఇచ్చిన స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్‌కు విరాళంగా ఇచ్చారు. దాంతో ఆయన పేరుతో కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం నిర్మించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో ఆయన ‘ఆంధ్రభీమ, ఇండియన్ టార్జాన్’, ఇండియన్ హెర్క్యులస్, జాయింట్ ఆఫ్ ఇండియన్ బిరుదులను పొందారు. అంతటి ఘనకీర్తిని కూడగట్టుకున్న ఆయన ఉయ్యూరు మండలంలో గండిగుంటలో 1916 అక్టోబర్ 14న జన్మించారు. ఉయ్యూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి తర్వాత పెదపారుపూడి మండలం వానపాములలో తన సోదరి రంగమ్మ ఇంట ఉండి జాస్తి బాపయ్య, శిష్ట్లా సోమయాజులు ప్రభతుల ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్ సాధన ప్రారంభించారు. 1981 ఆగస్టు 6న విజయవాడ లబ్బీపేటలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కుటుంబ నేపధ్యం.. ఆయనకు ఐదుగురు సంతానం. వారిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమారుడు అమెరికాలో, పెద్ద చిన్న కుమారులు విజయవాడలో స్థిరపడ్డారు. కుమార్తె అట్లూరి ఝాన్సీరాణి వానపాముల లో ఉంటూ కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది. ప్రస్తుతం ఆయన కూతురు మనుమడు రాజాజీ ఉంటున్నారు. మరో కుమార్తె ఆయన స్వగ్రామమైన గండిగుంటలో నివాసముంటున్నారు. -
లిఫ్టర్ గురురాజ్‌కు భారీ నజరానా
యశవంతపుర : అస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత కీర్తిని చాటి వెండి పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ గురురాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ. 25 లక్షల నగదుతో పాటు ఉద్యోగం ఇస్తామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ప్రమోద్ మద్వరాజ్ తెలిపారు. గురువారం ఆయన ఉడిపిలో విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే గురురాజ్‌కు ఏకలవ్యం ప్రశస్తితో సన్మానించినట్లు చెప్పారు. దేశ కీర్తిని విదేశాలలో రెపరెపలాడించిన గురురాజ్ వెండి పతకం సాధించడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. -
‘కామన్వెల్త్’ స్వర్ణం సాధిస్తా: సరిత
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధిస్తాననే నమ్మకముందని భారత బాక్సర్ సరితా దేవి ఆశాభావం వ్యక్తం చేసింది. గోల్డ్‌కోస్ట్‌లో జరిగే ఈ టోర్నీలో విజేతగా నిలిచేందుకు 100 శాతం కృషి చేస్తానని ఆమె చెప్పింది. పెరిగిన పోటీకి తగినట్లుగా సంసిద్ధం అవుతున్నానని ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సరితా దేవి తెలిపింది. ‘ప్రాక్టీస్ చాలా బాగా జరుగుతోంది. కామన్వెల్త్లో విజేతగా నిలవడమే నా లక్ష్యం. బరిలో దిగిన తర్వాత ప్రతీ ప్రత్యర్థిని ఓడించడంపైనే దృష్టి పెడతా. కానీ ఆటలో గెలుపోటములు సహజం. గతంతో పోలిస్తే మన పరిస్థితి చాలా మెరుగైంది. ఇప్పుడు నాణ్యమైన కోచ్‌లతో పాటు, అంతర్జాతీయ అనుభవం కూడా పెరిగింది. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నుంచి లభిస్తోన్న ప్రోత్సాహం మరు వలేనిది. పురుషులతో సమానంగా మహిళల బాక్సింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు’ అని పేర్కొంది. మాజీ ప్రపంచ చాంపియన్ అయిన సరిత 60 కేజీల వెయిట్ విభాగంలో ఇటీవలే జరిగిన ఇండియన్ ఓపెన్‌లో రజతాన్ని సాధించింది. -
జ్వాలను ‘టాప్’లో చేర్చండి!
ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: టార్గెట్ ఒలింపిక్ పోడి యం (టాప్) పథకంలో గుత్తా జ్వాలకు చోటు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదికి ప్రత్యేక లేఖ రాశారు. జ్వాలతో పాటు ఆమె డబుల్స్ భాగస్వామి అశ్విని పొన్నప్పలకు ‘టాప్’ ద్వారా ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరారు. ఇటీవల కెనడా ఓపెన్ టైటిల్ నెగ్గిన జ్వాల, శుక్రవారం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి తమకు అండగా నిలవాలని అభ్యర్థించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం మొదలు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు, ఇతర ఘనతల గురించి ప్రధానికి రాసిన లేఖలో సీఎం ప్రస్తావించారు. సంబంధిత అధికారులకు తగు సూచనలివ్వాలని విజ్ఞప్తి చేసిన కేసీఆర్, భారత్ తరఫున ఒలింపిక్ పతకం సాధించే సామర్థ్యం జ్వాల-అశ్విని జోడీకి ఉన్నట్లు తాను విశ్వసిస్తున్నానన్నారు. అంతకు ముందు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావు కూడా జ్వాలను అభినందించారు. -
ఇవేం సన్నాహకాలు?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌కు భారత అథ్లెట్ల సన్నాహకాలు బాగాలేవని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై ‘సాయ్’ అధికారులతో సోమవారం మంత్రి సమీక్ష జరిపారు. పతకాలు సాధించే క్రీడాకారుల శిక్షణకు సంబంధించిన పూర్తి అంశాలను కొన్ని సమాఖ్యలు మాత్రమే ఈ సమావేశంలో అందజేశాయి. దీనిపై నిరాశను వ్యక్తం చేసిన మంత్రి... క్రీడా కార్యదర్శి పీకే దేవ్ నేతృత్వంలో ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి క్రీడకు చీఫ్ కోచ్‌తో పాటు సహాయక సిబ్బందిని నియమించి పూర్తి బాధ్యతలను వాళ్లకు అప్పగించాలని సూచించారు. రొటేషన్ పద్ధతిలో ప్రతి క్రీడలో అథ్లెట్ల పురోగతిపై స్టీరింగ్ కమిటీ ప్రతివారం సమీక్ష జరిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు కామన్వెల్త్ గేమ్స్ వరకు ఇది కొనసాగించాలని చెప్పారు. అత్యున్నత స్థాయి శిక్షణ అవసరమయ్యే క్రీడాకారులను గుర్తించి వారికి ఎన్ఎస్డీఎఫ్ ద్వారా నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. అలాగే అథ్లెట్ల శిక్షణకు కావాల్సిన పూర్తి వ్యయాన్ని అంచనా వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.