న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌కు భారత అథ్లెట్ల సన్నాహకాలు బాగాలేవని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై ‘సాయ్’ అధికారులతో సోమవారం మంత్రి సమీక్ష జరిపారు. పతకాలు సాధించే క్రీడాకారుల శిక్షణకు సంబంధించిన పూర్తి అంశాలను కొన్ని సమాఖ్యలు మాత్రమే ఈ సమావేశంలో అందజేశాయి. దీనిపై నిరాశను వ్యక్తం చేసిన మంత్రి... క్రీడా కార్యదర్శి పీకే దేవ్ నేతృత్వంలో ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి క్రీడకు చీఫ్ కోచ్‌తో పాటు సహాయక సిబ్బందిని నియమించి పూర్తి బాధ్యతలను వాళ్లకు అప్పగించాలని సూచించారు. రొటేషన్ పద్ధతిలో ప్రతి క్రీడలో అథ్లెట్ల పురోగతిపై స్టీరింగ్ కమిటీ ప్రతివారం సమీక్ష జరిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు కామన్వెల్త్ గేమ్స్ వరకు ఇది కొనసాగించాలని చెప్పారు. అత్యున్నత స్థాయి శిక్షణ అవసరమయ్యే క్రీడాకారులను గుర్తించి వారికి ఎన్‌ఎస్‌డీఎఫ్ ద్వారా నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. అలాగే అథ్లెట్ల శిక్షణకు కావాల్సిన పూర్తి వ్యయాన్ని అంచనా వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఇవేం సన్నాహకాలు?
Published Wed, Aug 7 2013 2:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement