
న్యూఢిల్లీ: భారతదేశ ప్రాచీన వ్యాయామ పద్ధతి ‘యోగాసన’కు ఆసియా క్రీడల్లో చోటు దక్కింది. 2026లో జపాన్‌లోని ఐచీ–నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో యోగాసనను ప్రదర్శన ఈవెంట్‌గా చేర్చుతున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ప్రకటించింది. ఆదివారం జరిగిన 44వ ఓసీఏ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఓసీఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రణ్‌దీర్ సింగ్ మాట్లాడుతూ... ‘2026 ఆసియా క్రీడల్లో యోగా భాగం కానుంది. దీనికి అందరి ఆమోదం లభించింది. అన్ని సభ్య దేశాలను ఒప్పించేందుకు పది రోజుల సమయం పట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఆ దిశగా ఇది మరో ముందడుగు వంటింది. 2030 ఆసియా క్రీడల వరకు యోగాను పతక క్రీడల్లో భాగం చేసేలా చూస్తాం’ అని అన్నారు.