విరాట్ తో పెట్టుకుంటే అంతే సంగతులు!
పుణె: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు.. స్లెడ్జింగ్ కు మారుపేరు. ఏ దేశ పర్యటనకు వారు వెళ్లినా.. ఏ క్రికెట్ జట్టు తమ దేశ పర్యటనకు వచ్చినా ఆసీస్ ఆటగాళ్లు ముందుగా పని చెప్పేది నోటికి. ప్రత్యర్థి ఆటగాళ్లపై ముందుగా మాటల యుద్ధానికి దిగి పైచేయి సాధిచడం ఆసీస్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు.. టీమిండియా సారథి విరాట్ కోహ్లితో స్లెడ్జింగ్ అంటే వణుకుతోంది. గొప్ప ఆటగాళ్లను రెచ్చగొడితే ఫలితం తారుమారయ్యే ప్రమాదం ఉందని ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మ్యాక్స్ వెల్లు అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లితో స్లెడ్జింగ్ కు దిగితే తమకు ఎక్కువ నష్టం చేకూరే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ విరాట్ తో మాటల యుద్ధానికి దిగకుండా కేవలం ఫీల్డ్ అటాక్ కే పరిమితం కావాలని యోచిస్తున్నారు.విరాట్ ను స్లెడ్జింగ్ చేసి నష్టపోయేకంటే కామ్ గా ఉండటమే మేలని వార్నర్ పేర్కొన్నాడు. అతని అభిప్రాయాన్ని మ్యాక్స్ వెల్ కూడా సమర్ధించాడు.
‘కోహ్లిని నేను ఏమీ అనదల్చుకోలేదు. అది మాత్రం ఖాయం. ఎందుకంటే అతడితో పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. ప్రస్తుతం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి అవుట్ కావాలంటే ఏ రనౌట్‌లాంటిదో అదృష్టం మాకు కలిసి రావాల్సిందే’ అని మ్యాక్స్‌వెల్ వ్యాఖ్యానించాడు. విరాట్ పై నోరు పారేసుకోవడం అనే అంశాన్ని పక్కను పెట్టి, ఆటపై దృష్టిసారించాలని ఆసీస్ దిగ్గజ ఆటగాడు మైక్ హస్సీ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.. విరాట్ ను స్లెడ్జింగ్ చేయాలన్న ఆసీస్ ప్రణాళికలను పక్కకు పెట్టాలని స్మిత్ సేనకు హితవు పలికాడు. రేపు భారత్-ఎ-ఆసీస్ జట్ల మధ్య ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఈ నెల 23వ తేదీన ఆసీస్-భారత జట్ల మధ్య పుణెలో జరిగే తొలి టెస్టుతో నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.