'బంగ్లాదేశ్లో ఆంబ్రోస్ కోసం వెతుకుతున్నా'
ఢాకా: కర్టిలీ ఆంబ్రోస్.. 1990వ దశకంలో వెస్టిండీస్కు వెన్నుముక. అప్పట్లో అరవీర భయంకరుడిగా పేరు తెచ్చుకున్నఆంబ్రోస్.. అటు ఫాస్ట్ బంతులను సంధించడంలోనూ, ఇటు దిమ్మతిరిగే బౌన్సర్లు వేయడంలోనూ అందివేసిన చేయి. అయితే మరో ఆంబ్రోస్ను తయారు చేయాలనేది తన సహచర బౌలర్ కోట్నీ వాల్ష్ కోరికట. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా ఎంపికైన వాల్ష్.. ఇప్పుడు అక్కడ ఆంబ్రోస్ను వెతికే పనిలో పడ్డాడు. కనీసం ఇద్దరు ఆంబ్రోస్లను బంగ్లాకు అందిస్తే తన కోరిక నెరవేరినట్లేనని వాల్ష్ అంటున్నాడు.
'నేను బౌలింగ్ కోచ్గా ఎంపిక అవుతానని అనుకోలేదు. ఒక కోచ్గా, సలహాదారుడిగా బంగ్లాను ముందుండి నడిపించడానికి సర్వశక్తులా ఒడ్డుతా. నాకు హై ప్రొఫైల్ జాబ్ను అప్పగించిన బంగ్లాదేశ్ క్రికెట్కు కృతజ్ఞతలు. నేను అంతర్జాతీయ క్రికెట్ను వీడిన తరువాత నుంచి ఇప్పటివరకూ ఏదో రూపంలో ఆ క్రీడనే అంటిపెట్టుకుని ఉన్నా. ప్రపంచ క్రికెట్ కు ఫాస్ట్ బౌలర్లను అందించడానికి నావంతు ప్రయత్నం చేస్తునే ఉన్నా. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆంబ్రోస్ లాంటి బౌలర్ను చూడాలనేది నా ప్రధానమైన కోరిక. అందుకోసం అన్వేషించడమే నా పని. కనీసం ఇద్దరు ఆంబ్రోస్ లాంటి బౌలర్లను బంగ్లాదేశ్ కు అందిస్తే, చాలా సంతోషం'అని ఆదివారం బాధ్యతలు స్వీకరించిన వాల్ష్ పేర్కొన్నాడు.