Courtney Walsh
-
టెస్ట్ క్రికెట్లో కొనసాగుతున్న నాథన్ లయోన్ హవా.. వాల్ష్ రికార్డు బద్దలు
టెస్ట్ క్రికెట్లో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లయోన్ హవా కొనసాగుతుంది. తాజాగా అతను దిగ్గజ పేసర్, విండీస్ మాజీ బౌలర్ కోట్నీ వాల్ష్ రికార్డును బద్దలు కొట్టాడు. వాల్ష్ 1984-2001 మధ్యలో 128 టెస్ట్‌లు ఆడి 519 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన లయెన్.. తన టెస్ట్ వికెట్ల కౌంట్‌ను 521కి పెంచుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లయోన్.. వాల్ష్‌ను అధిగమించి, ఏడో స్థానానికి ఎగబాకాడు. ఇటీవలే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్ట్‌ల్లో 500 వికెట్ల మార్కును తాకాడు. ప్రస్తుతం అతను 507 వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800) టాప్‌లో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (698), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసీస్-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉస్మాన్ ఖ్వాజా (5), నాథన్ లయోన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెమరూన్ గ్రీన్ (174 నాటౌట్) భారీ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 179 పరుగులకే ఆలౌటైంది. లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (71) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
అతని కోసమే నా బెంగ: వాల్ష్
డెహ్రాడూన్: ఇటీవల కాలంలో తరుచు గాయాల బారిన పడుతున్న ముస్తాఫిజుర్ రహ్మాన్ తన ఫిట్నెస్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్ కోట్నీ వాల్ష్ అభిప్రాయపడ్డాడు. యువకుడైన ముస్తాఫిజుర్ గాయాల బారిన పడటం తనను తీవ్రంగా కలచివేస్తోందన్నాడు. ‘ ముస్తాఫిజర్ కోసమే నా బెంగ. అతను గాయాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ముస్తాఫిజుర్‌ను తిరిగి శక్తిమంతంగా తీర్చడంపై దృష్టి సారించా. అతనొక యువ క్రికెటర్. అతనికి చాలా భవిష్యత్తు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ముస్తాఫిజుర్ గాయాల పాలు కాకుండా చూసుకోవాలి. అతని బౌలింగ్ ప్రమాణాలు అసాధారణం. ఈ ఆధునిక క్రికెట్లో ఒక ఫాస్ట్ బౌలర్ వివిధ రకాలైన ఫార్మాట్లలో ఆడటం కారణంగానే ఎక్కువగా గాయాల బారిన పడతాడనే విషయాన్ని అర్థం చేసుకోగలను. ముస్తాఫిజుర్ విషయంలో కూడా ఇదే జరిగిందని నేను అనుకుంటున్నా’ అని వాల్ష్ పేర్కొన్నాడు. -
'అతనే పాక్ క్రికెట్ స్వరూపాన్ని మార్చింది'
ఆంటిగ్వా: ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్‌ను సముచిత స్థానంలో నిలబెట్టింది ఎవరైనా ఉన్నారంటే అది ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అని వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ కర్ట్నీ వాల్ష్ కొనియాడాడు. 1992లో ఇమ్రాన్ నేతృత్వంలో పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలవగానే ఆ జట్టు స్వరూపం మొత్తం మారిపోయిందన్నాడు. ఒక జట్టును చరిత్రలో నిలిచిపోయేలా చేసే ఘనత మంచి కెప్టెన్‌కే సాధ్యమవుతుందన్నాడు. ఈ తరహాలో పాక్ జట్టును సానుకూల ధృక్పథంతో ముందుకు నడిపించిన సారథి ఇమ్రాన్ ఖాన్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. తాను ఇమ్రాన్‌కు ఒక వీరాభిమానిని అని వాల్ష్ తెలిపాడు. ఇమ్రాన్ హయాంలో వసీం అక్రమ్, వకార్ యూనిస్‌ల వంటి యువ క్రికెటర్లను ప్రోత్సహించింది ఇమ్రానేనని వాల్ష్ గుర్తు చేసుకున్నాడు. అలా పాక్ జట్టును ఒక చాంపియన్ టీమ్‌లా నిలబెట్టిన ఘనత ఇమ్రాన్దేనని వాల్ష్ తెలిపాడు. -
'బంగ్లాదేశ్‌లో ఆంబ్రోస్ కోసం వెతుకుతున్నా'
ఢాకా: కర్టిలీ ఆంబ్రోస్.. 1990వ దశకంలో వెస్టిండీస్‌కు వెన్నుముక. అప్పట్లో అరవీర భయంకరుడిగా పేరు తెచ్చుకున్నఆంబ్రోస్.. అటు ఫాస్ట్ బంతులను సంధించడంలోనూ, ఇటు దిమ్మతిరిగే బౌన్సర్లు వేయడంలోనూ అందివేసిన చేయి. అయితే మరో ఆంబ్రోస్‌ను తయారు చేయాలనేది తన సహచర బౌలర్ కోట్నీ వాల్ష్ కోరికట. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా ఎంపికైన వాల్ష్.. ఇప్పుడు అక్కడ ఆంబ్రోస్‌ను వెతికే పనిలో పడ్డాడు. కనీసం ఇద్దరు ఆంబ్రోస్లను బంగ్లాకు అందిస్తే తన కోరిక నెరవేరినట్లేనని వాల్ష్ అంటున్నాడు. 'నేను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక అవుతానని అనుకోలేదు. ఒక కోచ్‌గా, సలహాదారుడిగా బంగ్లాను ముందుండి నడిపించడానికి సర్వశక్తులా ఒడ్డుతా. నాకు హై ప్రొఫైల్ జాబ్‌ను అప్పగించిన బంగ్లాదేశ్ క్రికెట్‌కు కృతజ్ఞతలు. నేను అంతర్జాతీయ క్రికెట్‌ను వీడిన తరువాత నుంచి ఇప్పటివరకూ ఏదో రూపంలో ఆ క్రీడనే అంటిపెట్టుకుని ఉన్నా. ప్రపంచ క్రికెట్ కు ఫాస్ట్ బౌలర్లను అందించడానికి నావంతు ప్రయత్నం చేస్తునే ఉన్నా. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఆంబ్రోస్ లాంటి బౌలర్‌ను చూడాలనేది నా ప్రధానమైన కోరిక. అందుకోసం అన్వేషించడమే నా పని. కనీసం ఇద్దరు ఆంబ్రోస్ లాంటి బౌలర్లను బంగ్లాదేశ్ కు అందిస్తే, చాలా సంతోషం'అని ఆదివారం బాధ్యతలు స్వీకరించిన వాల్ష్ పేర్కొన్నాడు. -
కోట్నీవాల్ష్ కొత్త ఇన్నింగ్స్!
ఆంటిగ్వా:సుదీర్ఘకాలం పాటు వెస్టిండీస్ జట్టులో కీలకపాత్ర పోషించిన దిగ్గజ బౌలర్ కోట్నీ వాల్ష్ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. గత రెండు సంవత్సరాలుగా వెస్టిండీస్ జట్టు సెలక్టర్ గా ఉన్న వాల్ష్.. తాజాగా బంగ్లాదేశ్ జట్టుకు బౌలింగ్ కోచ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. త్వరలో బంగ్లాదేశ్‌లో ఇంగ్లండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో వాల్ష్‌ను స్పెషలిస్టు కోచ్‌గా నియమిస్తూ బీసీబీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. దీనిపై వాల్ష్ స్పందిస్తూ.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు స్పెషలిస్టు కోచ్‌గా ఎంపిక కావడం నిజంగా తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. 'గత కొన్ని సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ ను గమనిస్తూనే ఉన్నా. ఆ జట్టులో టాలెంట్‌కు కొదవలేదు. ఆ జట్టు కోచ్ చంద్రికా హతురుసింఘా తన బాధ్యతలను చాలా సమర్ధవంతంగా నిర్వహించాడు. అతనిలో ఉన్న సానుకూల థృక్పదమే బంగ్లాదేశ్ క్రికెట్ కు మేలు చేసిందని చెప్పగలను. వెస్టిండీస్ అనేది నా స్వదేశమే కానీ, బంగ్లాకు కోచ్ గా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించడం నిజంగా సంతోషంగా ఉంది. అందులోనూ అంతర్జాతీయ స్థాయిలో టాలెంట్ మెండుగా ఉన్న జట్టుకు బౌలింగ్ ను పర్యవేక్షించడం నాకు లభించిన అరుదైన అవకాశం. ఇటువంటి అవకాశాన్ని ఎవరూ వదులుకోరు'అని 53 ఏళ్ల వాల్ష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వాల్ష్ తన 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 519 టెస్టు వికెట్లను సాధించగా, 227 వన్డే వికెట్లను తీశాడు. -
'కుంబ్లే మనసుకు సరైన స్థానం'
సెయింట్ కిట్స్:భారత క్రికెట్ ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేయడంపై వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కర్ట్నీ వాల్ష్ హర్షం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ క్రికెట్‌కు ఏదో చేయాలని తపించే కుంబ్లేను సరైన స్థానంలోనే కూర్చొబెట్టడం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చేసిన గొప్ప ఆలోచనని వాల్ష్ పేర్కొన్నాడు. 'కుంబ్లే నియామకం భారత క్రికెట్లో మంచి మార్పుకు సూచిక. అతని అనుభవం కచ్చితంగా భారత జట్టుకు లాభిస్తుంది. భారత క్రికెట్ కు ఏదో ఇవ్వాలని తాపత్రయ పడే వ్యక్తుల్లో కుంబ్లే ఒకడు. టీమిండియా క్రికెట్ ను నంబర్ వన్ గా చేయాలన్నదే కుంబ్లే లక్ష్యం. అతను క్రికెట్ కు దూరమైనా, ఆ ఆటకు దగ్గరగానే ఉన్నాడు. కుంబ్లే కోరుకున్న మనసుకు సరైన స్థానాన్ని ఇచ్చారు. అతనొక గౌరవప్రదమైన వ్యక్తి. దాంతో పాటు క్రికెట్‌ను మరింత ఉన్నతస్థితిలోకి తీసుకెళ్లడానికి కుంబ్లే కృషి ఉంటుందని ఆశిస్తున్నా. ఐసీసీలో కూడా కుంబ్లే కీలక పదవిలో ఉన్నాడు. అటు సాంప్రదాయక టెస్టు క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో మార్పులకు కుంబ్లే నుంచి తోడ్పాటు ఉంటుంది' అని వాల్ష్ తెలిపాడు. -
ఫిట్నెస్ సమస్యలు అధిగమించాలి
భారత పేసర్లకు వాల్ష్ సూచన ముంబై: భారత పేసర్లు అత్యుత్తమ స్థాయిలో ఫిట్నెస్ కలిగి ఉండాలని వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం కర్ట్నీ వాల్ష్ సూచించాడు. ఫిట్నెస్ సమస్యలు అధిగమిస్తే వారు అత్యుత్తమ బౌలర్లుగా ఎదగగలరని ఆయన అభిప్రాయ పడ్డాడు. ‘భారత్‌లో కొందరు నాణ్యమైన పేసర్లున్నారు. అయితే కెరీర్ ఆరంభంలో వారు గాయాల పాలు కాకుండా ఎక్కువ కాలం ఆడేలా చూడాల్సిన అవసరం ఉంది. ఓ రెండేళ్ల క్రితం తెర పైకి ఇద్దరు ముగ్గురు మంచి పేసర్లు వచ్చారు. అయితే ఏడాది కాలంలోనే గాయాలకు గురై ఫామ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఉమేశ్ యాదవ్ కూడా రెండు టెస్టు సిరీస్‌లలో మెరుగ్గా రాణించాడు. ఆ తర్వాత గాయంతో వెనకబడ్డాడు. ఇలాంటివారిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే జట్టుకు మేలు’ అని 80, 90 దశకాల్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించిన వాల్ష్ చెప్పాడు. క్రికెటర్లు అదుపులో ఉండాలి... మైదానంలో క్రీడా స్ఫూర్తికి మారు పేరు వాల్ష్. అలాంటి క్రికెటర్ తాజాగా ఐపీఎల్లో జరిగిన పొలార్డ్, స్టార్క్ గొడవపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రికెటర్లు తమ దూకుడును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘యూట్యూబ్‌లో ఆ సంఘటనను చూశాను. అది ఎందుకు ఎలా జరిగిందో నేను చెప్పలేను కానీ ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూస్తే అలా జరగాల్సింది కాదు అనిపిస్తుంది. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్లు జరిగిన దానిపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే ఇది సుఖాంతమవుతుంది. యువ ఆటగాళ్లు మైదానంలో ఇలాంటి ఘటనలు చూస్తే వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం ఆలోచించుకోవాలి’ అని వాల్ష్ అన్నాడు. 1987 వరల్డ్ కప్‌లో బంతి వేయడానికి ముందే క్రీజు వదిలిన పాక్ చివరి వరుస ఆటగాడు సలీం జాఫర్‌ను అవుట్ చేయకుండా వెనక్కి పిలిచి వాల్ష్ తన క్రీడా స్ఫూర్తిని లోకానికి చాటాడు. -
వహ్... వాల్ష్
ఏ ఆటైనా, ఏ ఆటగాడైనా మొదటి లక్ష్యం విజయం. ఎలాగైనా ప్రత్యర్థిపై గెలవాలనే కసే ఉంటుంది. దీనికోసం చాలా మంది నైతికతను వదిలేస్తారు. కానీ కొంతమంది మాత్రం క్రీడాస్ఫూర్తికి ప్రాధాన్యత ఇచ్చి చరిత్రలో నిలుస్తారు. అలా చరిత్రలో నిలిచిన క్రికెటర్ కోట్నీ వాల్ష్. 1987 రిలయన్స్ వరల్డ్ కప్.. లాహోర్ వేదిక.. వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ పేసర్ ఇమ్రాన్ ఖాన్ (4/37) ధాటికి 216 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత పాక్ బరిలోకి దిగింది. 92 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా కోలుకుని 183 పరుగులకు ఐదు వికెట్లతో లక్ష్యం వైపు సాగింది. ఈ దశలో పాక్ జట్టుకు మళ్లీ కుదుపు. 20 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఇక మిగిలింది చివరి ఓవర్. ఆరు బంతుల్లో పాక్‌కు కావాల్సిన పరుగులు 14. తన పేస్‌తో బ్యాట్స్‌మెన్‌ను వణికించే బౌలర్ వాల్ష్ ఆఖరి ఓవర్ వేసేందుకు సిద్ధమయ్యాడు. క్రీజులో ఉందేమో టెయిలెండర్లు అబ్దుల్ ఖాదిర్.. సలీం జాఫర్. ఇంకేముంది.. ఆతిథ్య జట్టు ఓటమి ఖాయమే అనుకున్నారు. తొలి రెండు బంతులకు సింగిల్స్ వచ్చాయి. మూడో బంతికి రెండు పరుగులు తీసిన ఖాదిర్... నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి రెండు పరుగులు చేస్తే పాక్ గెలుస్తుంది. ఇక్కడే అసలు సిసలు క్రీడా స్ఫూర్తి అంటే ఏమిటో వాల్ష్ లోకానికి చాటి చెప్పాడు. చివరి బంతి వేసేందుకు సిద్ధమవుతున్న వాల్ష్ చేతిలో నుంచి బంతి ఇంకా వదలక ముందే నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న జాఫర్ క్రీజు నుంచి ముందుకు కదిలాడు. ఈ స్థితిలో వాల్ష్ అతడ్ని మన్కడింగ్ ద్వారా రనౌట్ చేయవచ్చు. సాంకేతికంగా కూడా అది కరెక్ట్ కూడా. రనౌట్ చేస్తే వెస్టిండీస్‌దే విజయం. కానీ వాల్ష్ మాత్రం బంతి వేయకుండా ఆగి జాఫర్‌ను వెనక్కి పిలిచి క్రీజులోకి రమ్మన్నాడు. ఆఖరి బంతికి ఖాదిర్ రెండు పరుగులు చేసి పాక్‌ను గెలిపించాడు. మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోయింది. ఈ ఓటమివల్ల వెస్టిండీస్ సెమీస్‌కు చేరలేదు. మ్యాచ్‌లో విండీస్ ఓడిపోయినా వాల్ష్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఈ పేసర్ పెద్దమనసుకు పాకిస్థాన్‌లో అభిమానులు అనేక బహుమతులూ పంపారు. ఆటలో క్రీడాస్ఫూర్తి ఎంత ముఖ్యమో చెప్పడానికి వాల్ష్ పెద్ద ఉదాహరణ.