'కుంబ్లే మనసుకు సరైన స్థానం'
సెయింట్ కిట్స్:భారత క్రికెట్ ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేయడంపై వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కర్ట్నీ వాల్ష్ హర్షం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ క్రికెట్కు ఏదో చేయాలని తపించే కుంబ్లేను సరైన స్థానంలోనే కూర్చొబెట్టడం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చేసిన గొప్ప ఆలోచనని వాల్ష్ పేర్కొన్నాడు.
'కుంబ్లే నియామకం భారత క్రికెట్లో మంచి మార్పుకు సూచిక. అతని అనుభవం కచ్చితంగా భారత జట్టుకు లాభిస్తుంది. భారత క్రికెట్ కు ఏదో ఇవ్వాలని తాపత్రయ పడే వ్యక్తుల్లో కుంబ్లే ఒకడు. టీమిండియా క్రికెట్ ను నంబర్ వన్ గా చేయాలన్నదే కుంబ్లే లక్ష్యం. అతను క్రికెట్ కు దూరమైనా, ఆ ఆటకు దగ్గరగానే ఉన్నాడు. కుంబ్లే కోరుకున్న మనసుకు సరైన స్థానాన్ని ఇచ్చారు. అతనొక గౌరవప్రదమైన వ్యక్తి. దాంతో పాటు క్రికెట్ను మరింత ఉన్నతస్థితిలోకి తీసుకెళ్లడానికి కుంబ్లే కృషి ఉంటుందని ఆశిస్తున్నా. ఐసీసీలో కూడా కుంబ్లే కీలక పదవిలో ఉన్నాడు. అటు సాంప్రదాయక టెస్టు క్రికెట్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో మార్పులకు కుంబ్లే నుంచి తోడ్పాటు ఉంటుంది' అని వాల్ష్ తెలిపాడు.