భారత టాప్ స్పిన్ బౌలర్‌గా అనిల్ కుంబ్లే అందించిన మరపురాని విజయాలెన్నో. 18 ఏళ్ల కెరీర్‌లో అతను పడగొట్టిన 956 అంతర్జాతీయ వికెట్లు టీమిండియా గెలుపు ప్రస్థానంలో కీలకపాత్ర పోషించాయి. అయితే ఎన్ని ఘనతలు కుంబ్లే పేరిట ఉన్నా... ‘10 వికెట్ల’ ప్రదర్శన మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అభిమానులెవరూ మరచిపోలేని మధుర జ్ఞాపకమే. ఒకే ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అందరినీ పడగొట్టిన భారత దిగ్గజం ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్‌గా తన పేరు చరిత్రలో లిఖించుకున్నాడు. పైగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఇలాంటి ఘనత నమోదు కావడం మనందరి ఆనందాన్ని రెట్టింపు చేసింది.
సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత జట్టు అప్పటికే తొలి మ్యాచ్ ఓడిపోయింది. చెన్నైలో గెలుపు అంచుల వరకు వచ్చి చివరకు అనూహ్యంగా 12 పరుగులతో పరాజయంపాలు కావడంతో జట్టు సభ్యులందరినీ షాక్‌కు గురి చేసింది. వారంతా దానినుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ సమయంలో కచ్చితంగా రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను సమం చేయాల్సిన స్థితిలో అజహరుద్దీన్ బృందం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో బరిలోకి దిగింది.
సాధారణ స్కోర్లే...
ఫిబ్రవరి 4, 1999... మన టీమ్‌లో కుంబ్లే, హర్భజన్‌లు ఉన్నా...పాక్ టీమ్‌లో కూడా సక్లాయిన్ ముస్తాక్, ముస్తాక్ అహ్మద్ రూపంలో ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లు ఉండటంతో పూర్తి స్థాయి స్పిన్ పిచ్‌ను తయారు చేసేందుకు కూడా బోర్డు వెనుకాడింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అజహరుద్దీన్ (67), సదగోపన్ రమేశ్ (60) మినహా అంతా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకే ఆలౌటైంది. అయితే మన బౌలర్లు కూడా చెలరేగడంతో పాక్ 172 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా మనకు 80 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కొంత మెరుగ్గా ఆడి భారత్ 339 పరుగులు చేసింది. రమేశ్ (96), గంగూలీ (62) రాణించారు. పాక్ ముందు 420 పరుగుల లక్ష్యాన్ని ఉంచి భారత్ సవాల్ విసిరింది.
మ్యాజిక్ మొదలు...
అసాధారణ విజయలక్ష్యమే అయినా పాక్‌కు ఓపెనర్లు సయీద్ అన్వర్ (69), షాహిద్ అఫ్రిది (41) శుభారంభం అందించి ఆశలు రేపారు. 9వ ఓవర్లోనే బౌలింగ్‌కు దిగిన కుంబ్లే తొలి స్పెల్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. తొలి వికెట్‌కు సెంచరీ (101) భాగస్వామ్యం నమోదైంది. నాలుగో రోజు లంచ్ విరామం తర్వాత ఒక్కసారిగా ఆట మలుపు తిరిగింది. కెప్టెన్ సూచనతో కుంబ్లే ఎండ్ మార్చి బౌలింగ్ ప్రారంభించాడు. ముందుగా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అఫ్రిది వెనుదిరగడంతో పాక్ పతనం మొదలుకాగా, తర్వాతి బంతికి ఇజాజ్ అహ్మద్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అలా ఒకదాని వెంట మరో వికెట్ పడుతుండటం... అన్నీ కుంబ్లే ఖాతాలోనే చేరుతుండటం జరిగిపోయాయి. కుంబ్లే బంతులను ఆడటంలో పాక్ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముస్తాక్ అహ్మద్‌ను 8వ వికెట్‌గా అవుట్ చేసి కుంబ్లే తన గత అత్యుత్తమ బౌలింగ్ రికార్డు (7/59)ను సవరించాడు. అప్పటికే విరామం లేకుండా బౌలింగ్ చేస్తున్న కుంబ్లే బాగా అలసిపోయాడు. అదృష్టవశాత్తూ టీ బ్రేక్ వచ్చేసింది.
రసవత్తర డ్రామా...
చివరి సెషన్‌లో వచ్చీ రాగానే సక్లాయిన్‌ను కూడా పడగొట్టడంతో 9వ వికెట్ అనిల్ ఖాతాలో చేరింది. అప్పుడు జట్టంతా కలిసి కుంబ్లే రికార్డుకు సహకరించాలని సమష్టి నిర్ణయం తీసుకుంది. మరో ఎండ్‌లో బౌలింగ్ చేస్తున్న శ్రీనాథ్‌ను వికెట్‌కు దూరంగా బంతులు వేయాలని కెప్టెన్ సూచించాడు. ఆ సమయంలో మరో బౌలర్‌కు వికెట్ దక్కరాదని జట్టు మొత్తం కోరుకుంది. అటు క్రీజ్‌లో ఉన్న అక్రమ్, వకార్ కూడా కుంబ్లేకు రికార్డు దక్కరాదని ప్రయత్నించారు. శ్రీనాథ్ బౌలింగ్‌లో గుడ్డిగా షాట్లు ఆడి వకార్ అవుటయ్యేందుకు ప్రయత్నించాడు. ఒకదశలో గాల్లో లేచిన బంతిని రమేశ్ దాదాపుగా పట్టేయడంలో అందరి గుండె ఆగినంత పనైంది. రమేశ్‌కు ఆ క్యాచ్ చిక్కకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చివరకు తమలో ఒకరు రనౌటైనా కావాలని కూడా అనుకున్నట్లు అక్రమ్ తర్వాతి రోజుల్లో వెల్లడించాడు. అయితే ఇది ఎక్కువసేపు సాగలేదు. కుంబ్లే వేసిన లెగ్‌బ్రేక్‌ను షార్ట్‌లెగ్‌లోకి అక్రమ్ ఆడగా... వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ పట్టేయడంతో చరిత్ర ఆవిష్కృతమైంది. భారత జట్టు శిబిరంలో సంబరాలు అంబరాన్నంటగా... కుంబ్లేను భుజాలపై మోస్తూ సహచరులంతా తమ ఆనందాన్ని పంచుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 207 పరుగులకే ఆలౌట్ కావడంతో 212 పరుగులతో గెలిచిన భారత్ 1–1తో సిరీస్‌ను సమంగా ముగించింది. గతంలో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ మాత్రమే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు దానిని కుంబ్లే సాధించి చూపించాడు. ఈ 10 వికెట్ల ప్రదర్శనను ఎప్పటికీ గుర్తుకు తెచ్చే విధంగా రిటైర్మెంట్ అనంతరం తన స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీకి ‘టెన్‌విక్’ అని కుంబ్లే పేరు పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment