అసలే చిరకాల ప్రత్యర్థి. పైగా ఈ టోర్నీలో భారత్‌తో పాటు సమఉజ్జీ ప్రదర్శన ఇచ్చింది. కానీ భారత్‌తో ఆడేటప్పుడు మాత్రం అత్తెసరు జట్టుగా మారిపోయింది. పాక్ బ్యాట్స్‌మెన్‌ను మన బౌలర్లు వెంటాడితే... బౌలర్లనేమో భారత ఓపెనర్లిద్దరే గెలిచేదాకా వేటాడారు. ఫలితం... పాకిస్తాన్‌ను కసిదీరా ఓడించారు. యువ భారత్‌ను సమష్టిగా అంతిమ సమరానికి చేర్చారు.
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): న్యూజిలాండ్‌లో భారత సీనియర్ జట్టు కివీస్‌పై అన్నీ గెలిచింది. దక్షిణాఫ్రికాలో యువ భారత జట్టు అందరినీ ఓడిస్తోంది. ఇక ఒక్క ఫైనల్ పోరు మాత్రమే బాకీ ఉంది. అద్వితీయ ఆటతో అదరగొట్టిన యువ భారత జట్టు అండర్–19 ప్రపంచకప్‌లో ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట పాకిస్తాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది.
కెప్టెన్ రొహైల్ నజీర్ (102 బంతుల్లో 62; 6 ఫోర్లు), ఓపెనర్ హైదర్ అలీ (77 బంతుల్లో 56; 9 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా 3 వికెట్లు తీయగా... కార్తీక్ త్యాగి, రవి బిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. తర్వాత భారత్ 35.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 176 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (113 బంతుల్లో 105 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ‘శత’క్కొట్టాడు. దివ్యాంశ్ సక్సేనా (99 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు.
వెంటాడిన బౌలర్లు...
భారత బౌలర్లు పాక్ బ్యాట్స్‌మెన్ పాలిట కొదమ సింహాల్లా రెచ్చిపోయారు. దీంతో ముగ్గురు మినహా మిగతా వారు అంకెతోనే సరిపెట్టుకున్నారు. హురైరా (4), ఫహాద్ (0), ఖాసీమ్ (9), ఇర్ఫాన్ (3), అబ్బాస్ (2), తాహిర్ (2), ఆమిర్ అలీ (1) ఇలా ‘టాప్ నుంచి టెయిలెండర్ల’ దాకా అందరూ భారత బౌలింగ్ చెరలో చిక్కి శల్యమయ్యారు. ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ నజీర్ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించడమే పాక్ ఇన్నింగ్స్‌లో గొప్ప భాగస్వామ్యం. ఇద్దరు అర్ధసెంచరీలతో జట్టును ఆదుకోగా... హ్యారిస్ 21 పరుగులు చేశాడు. ఇక 31వ ఓవర్ నుంచి భారత బౌలింగ్ మరింత పదునెక్కింది. దీంతో 13 ఓవర్ల వ్యవధి లో పాక్ చివరి 7 వికెట్లను కోల్పోయింది.
చితగ్గొట్టిన ఓపెనింగ్ జోడీ...
యశస్వి, దివ్యాంశ్ ఆట మొదలు పెట్టాక పరుగులు, అవి రాలేదంటే డాట్ బాల్స్, కుదిరితే ఫోర్లు, బాదితే సిక్సర్లు ఇలా అన్నీ వచ్చిపోయాయి. కానీ ఒక్క వికెట్ రాలితే ఒట్టు. ఈ యువ మెగా టోర్నీలో భారత్‌కు దీటుగా ఉన్న పాక్ బౌలింగ్... భారత్ ఎదురు పడితే మాత్రం బెదిరిపోయింది. ఓపెనర్లు యశస్వి, దివ్యాంశ్ మరొకరికి అవకాశం ఇవ్వకుండా లక్ష్యాన్ని ఛేదించేదాకా క్రీజు వదల్లేదు. అబేధ్యమైన తొలి వికెట్‌కు 176 పరుగులు జోడించి భారత్‌ను దర్జాగా ఫైనల్‌కు చేర్చారు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఈనెల 9న జరిగే ఫైనల్లో భారత్ ఆడుతుంది.
►7 అండర్–19 ప్రపంచకప్‌లో భారత్ ఏడోసారి ఫైనల్ చేరింది. నాలుగుసార్లు (2000, 2008, 2012, 2018) విజేతగా, రెండుసార్లు (2006, 2016) రన్నరప్‌గా నిలి చింది.
►10 అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో ఛేజింగ్ చేస్తూ భారత్ వరుసగా సాధించిన పదో విజయమిది. 2010 నుంచి భారత్ ఈ టోర్నీలో ఛేజింగ్ చేస్తూ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.
►11 ఈ టోర్నీ చరిత్రలో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం భారత్ కిది వరుసగా 11వసారి.
►1 ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టు నాకౌట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో నెగ్గడం ఇదే తొలిసారి.
►5 గత ఐదు అండర్–19 ప్రపంచకప్‌లలో సెమీఫైనల్ లేదా ఫైనల్స్‌లో ఐదు సెంచరీలు నమోదు కాగా... ఐదూ భారత ఆటగాళ్లే (2006 సెమీస్– పుజారా (129 నాటౌట్); 2012 ఫైనల్–ఉన్ముక్త్ చంద్ (111 నాటౌట్); 2018 సెమీస్–శుబ్‌మన్ గిల్ (102 నాటౌట్); 2018 ఫైనల్–మన్‌జ్యోత్ (101 నాటౌట్); 2020 సెమీస్–యశస్వి (105 నాటౌట్) చేశారు.
స్కోరు వివరాలు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: హైదర్ అలీ (సి) రవి బిష్ణోయ్ (బి) యశస్వి 56; హురైరా (సి) సక్సేనా (బి) సుశాంత్ 4; ఫహాద్ (సి) అథర్వ (బి) రవి బిష్ణోయ్ 0; నజీర్ (సి) తిలక్ వర్మ (బి) సుశాంత్ 62; ఖాసీమ్ (రనౌట్) 9; హ్యారిస్ (సి) సక్సేనా (బి) అథర్వ 21; ఇర్ఫాన్ (బి) కార్తీక్ 3; అబ్బాస్ ఎల్బీడబ్ల్యూ (బి) రవి 2; తాహిర్ (సి) జురేల్ (బి) కార్తీక్ త్యాగి 2; ఆమిర్ అలీ (సి) సిద్ధేశ్ వీర్ (బి) సుశాంత్ 1; అమిర్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (43.1 ఓవర్లలో ఆలౌట్) 172. వికెట్ల పతనం: 1–9, 2–34, 3–96, 4–118, 5–146, 6–156, 7–163, 8–169, 9–172, 10–172.
బౌలింగ్: కార్తీక్ త్యాగి 8–0– 32–2, సుశాంత్ 8.1–0– 28–3, రవి బిష్ణోయ్ 10–0– 46–2, ఆకాశ్ సింగ్ 7–0–25–0, అథర్వ 7–0–29–1, యశస్వి జైస్వాల్ 3–0–11–1.
భారత్ ఇన్నింగ్స్: యశస్వి (నాటౌట్) 105, దివ్యాంశ్ (నాటౌట్) 59; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (35.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 176.
బౌలింగ్: తాహిర్ 6–1–17–0, ఖాసీమ్ 8–0–37–0, అమిర్ 5–1– 20–0, అబ్బాస్ 7–0–50–0, ఆమిర్ అలీ 5.2–0–38–0, ఫహాద్ 4–0–12–0.
Comments
Please login to add a commentAdd a comment