పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): ఎవరైనా రనౌట్‌ను తప్పించుకునేందుకు పరుగులు తీస్తూ ఉంటారు. మరి పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఏమిటి రనౌట్ కోసమే అన్నట్లు పరుగులు తీశారు. అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇదే పొరపాటు చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు. భారత్ - పాక్ మ్యాచ్ అంటేనే హై టెన్షన్. అందులోనూ అది వరల్డ్‌కప్. కానీ పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. అయితే 31వ ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన ఆ ఓవర్ మూడో బంతికి ఇద్దరు పాక్ బ్యాట్స్‌మెన్ అయోమయంలో ఒకేవైపు పరుగు తీశారు. స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న ఖాసిమ్ అక్రమ్‌కు రవి బౌల్ చేశాడు. ఆఫ్ సైడ్ ఆడిన ఖాసిమ్ పరుగు కోసం ప్రయత్నించాడు. ఇక నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ నజీర్.. తొలుత రన్ కోసం ముందుకు కదిలాడు. కానీ భారత ఫీల్డర్ అంకోలేకర్ చురుకుగా బంతిని అందుకుని కీపర్ జూరల్‌కు అందించాడు. (ఇక్కడ చదవండి: పది వికెట్లతో పని పట్టారు)
అయితే ఫీల్డర్ అంకోలేకర్ వేగాన్ని గమనించిన పాక్ కెప్టెన్ నజీర్ మళ్లీ నాన్ స్ట్రయికర్ వైపు వెనక్కి మళ్లాడు. ఇక టెన్షన్‌లో పరుగు కోసం వచ్చిన ఖాసిమ్ కూడా నాన్ స్ట్రయికర్ వైపే పరుగు తీశాడు. ఇద్దరూ ఒకేవైపు రన్నింగ్ చేయడం.. ఫీల్డర్ తన చేతిలో ఉన్న బంతిని కీపర్ వైపు విసరడం అంతా మెరుపు వేగంగా జరిగిపోయాయి. అయితే ముందుగా క్రీజ్‌లో బ్యాట్ పెట్టిన నజీర్ బ్రతికిపోయాడు. పరుగు తీసిన ఖాసిమ్ మాత్రం దురదృష్టకరరీతిలో ఔటయ్యాడు. దాంతో పాక్ ప్లేయర్లు మైదానంలోనే ఒకరిపై ఒకరు అసహనం వ్యక్తం చేసుకున్నారు. గతంలో సీనియర్ పాక్ క్రికెట్‌లోనూ ఇలాంటి ఘటనలు చాలా సందర్భాల్లో చోటు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment