కోట్నీవాల్ష్ కొత్త ఇన్నింగ్స్!
ఆంటిగ్వా:సుదీర్ఘకాలం పాటు వెస్టిండీస్ జట్టులో కీలకపాత్ర పోషించిన దిగ్గజ బౌలర్ కోట్నీ వాల్ష్ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. గత రెండు సంవత్సరాలుగా వెస్టిండీస్ జట్టు సెలక్టర్ గా ఉన్న వాల్ష్.. తాజాగా బంగ్లాదేశ్ జట్టుకు బౌలింగ్ కోచ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. త్వరలో బంగ్లాదేశ్లో ఇంగ్లండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో వాల్ష్ను స్పెషలిస్టు కోచ్గా నియమిస్తూ బీసీబీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. దీనిపై వాల్ష్ స్పందిస్తూ.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు స్పెషలిస్టు కోచ్గా ఎంపిక కావడం నిజంగా తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.
'గత కొన్ని సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ ను గమనిస్తూనే ఉన్నా. ఆ జట్టులో టాలెంట్కు కొదవలేదు. ఆ జట్టు కోచ్ చంద్రికా హతురుసింఘా తన బాధ్యతలను చాలా సమర్ధవంతంగా నిర్వహించాడు. అతనిలో ఉన్న సానుకూల థృక్పదమే బంగ్లాదేశ్ క్రికెట్ కు మేలు చేసిందని చెప్పగలను. వెస్టిండీస్ అనేది నా స్వదేశమే కానీ, బంగ్లాకు కోచ్ గా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించడం నిజంగా సంతోషంగా ఉంది. అందులోనూ అంతర్జాతీయ స్థాయిలో టాలెంట్ మెండుగా ఉన్న జట్టుకు బౌలింగ్ ను పర్యవేక్షించడం నాకు లభించిన అరుదైన అవకాశం. ఇటువంటి అవకాశాన్ని ఎవరూ వదులుకోరు'అని 53 ఏళ్ల వాల్ష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వాల్ష్ తన 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 519 టెస్టు వికెట్లను సాధించగా, 227 వన్డే వికెట్లను తీశాడు.