ఫిట్‌నెస్ సమస్యలు అధిగమించాలి
భారత పేసర్లకు వాల్ష్ సూచన
ముంబై: భారత పేసర్లు అత్యుత్తమ స్థాయిలో ఫిట్‌నెస్ కలిగి ఉండాలని వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం కర్ట్‌నీ వాల్ష్ సూచించాడు. ఫిట్‌నెస్ సమస్యలు అధిగమిస్తే వారు అత్యుత్తమ బౌలర్లుగా ఎదగగలరని ఆయన అభిప్రాయ పడ్డాడు. ‘భారత్‌లో కొందరు నాణ్యమైన పేసర్లున్నారు. అయితే కెరీర్ ఆరంభంలో వారు గాయాల పాలు కాకుండా ఎక్కువ కాలం ఆడేలా చూడాల్సిన అవసరం ఉంది.
ఓ రెండేళ్ల క్రితం తెర పైకి ఇద్దరు ముగ్గురు మంచి పేసర్లు వచ్చారు. అయితే ఏడాది కాలంలోనే గాయాలకు గురై ఫామ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఉమేశ్ యాదవ్ కూడా రెండు టెస్టు సిరీస్‌లలో మెరుగ్గా రాణించాడు. ఆ తర్వాత గాయంతో వెనకబడ్డాడు. ఇలాంటివారిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే జట్టుకు మేలు’ అని 80, 90 దశకాల్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించిన వాల్ష్ చెప్పాడు.
క్రికెటర్లు అదుపులో ఉండాలి...
మైదానంలో క్రీడా స్ఫూర్తికి మారు పేరు వాల్ష్. అలాంటి క్రికెటర్ తాజాగా ఐపీఎల్‌లో జరిగిన పొలార్డ్, స్టార్క్ గొడవపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రికెటర్లు తమ దూకుడును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘యూట్యూబ్‌లో ఆ సంఘటనను చూశాను. అది ఎందుకు ఎలా జరిగిందో నేను చెప్పలేను కానీ ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూస్తే అలా జరగాల్సింది కాదు అనిపిస్తుంది. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్లు జరిగిన దానిపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే ఇది సుఖాంతమవుతుంది. యువ ఆటగాళ్లు మైదానంలో ఇలాంటి ఘటనలు చూస్తే వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం ఆలోచించుకోవాలి’ అని వాల్ష్ అన్నాడు. 1987 వరల్డ్ కప్‌లో బంతి వేయడానికి ముందే క్రీజు వదిలిన పాక్ చివరి వరుస ఆటగాడు సలీం జాఫర్‌ను అవుట్ చేయకుండా వెనక్కి పిలిచి వాల్ష్ తన క్రీడా స్ఫూర్తిని లోకానికి చాటాడు.