ప్రస్తుతానికి భారత్ రేటింగ్ యథాతథం: ఫిచ్
ప్రస్తుతానికి భారత్ రేటింగ్ యథాతథం: ఫిచ్
Published Fri, Aug 23 2013 2:05 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM
న్యూఢిల్లీ: వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ.. భారత్ రేటింగ్‌ను ప్రస్తుతం తగ్గించాల్సిన అవసరమేదీ లేదని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. కానీ, రూపాయి క్షీణత వల్ల దేశీ ఎకానమీపై ఒత్తిళ్లు కొనసాగే అవకాశముందని పేర్కొంది. ఈ ఒత్తిళ్లు ఇతర వర్ధమాన ఆసియా దేశాల్లో కన్నా భారత్‌లో మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ రేటింగ్ పరమైన చర్య తీసుకునేంత బలంగా ఉన్నాయని తాము భావించడం లేదని ఒక నోట్‌లో తెలిపింది. ఈ నేపథ్యంలో భారత సావరీన్ రేటింగ్‌ను స్థిరమైన అంచనాలతో ‘బీబీబీమైనస్’గానే కొనసాగించనున్నట్లు ఫిచ్ తెలిపింది.
భారత్ వద్ద గణనీయస్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉండటం, ద్రవ్యలోటు కట్టడికి చర్యలు, వ్యవస్థాగత సంస్కరణలు చేపడుతుండటం ఇందుకు కారణాలుగా పేర్కొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీలు ఎప్పుడు ఉపసంహరిస్తుందో తెలియని అనిశ్చితి వల్ల మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోను కావడం మరి కొంత కాలం కొనసాగవచ్చని ఫిచ్ తెలిపింది. రూపాయి అంతకంతకూ క్షీణిస్తుండటమనేది.. ద్రవ్యలోటు పెరుగుతుండటాన్ని తెలియజేస్తోందని పేర్కొంది.
Advertisement