సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రతి అడుగు ప్రణాళికాబద్ధంగా వేస్తున్నారు. మామూలు సమయంలో కంటే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, మంత్రుల పర్యటనలు రెట్టింపవుతాయి. అటువంటి పరిస్థితుల్లో శారీరక దృఢత్వం (ఫిట్నెస్) అత్యంత అవసరం. ఆవిధంగా ఉన్నట్టయితే ఎన్ని సభల్లో పాల్గొన్నా, ఎన్ని పర్యటనలు చేసినా అంత ఇబ్బంది అనిపించదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆలోచనలు కూడా ఇదే రీతిలో ఉన్నట్టుంది. అందుకేనేమో తన శారీరక బరువును ఐదు కిలోలమేర తగ్గించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ మరాఠీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక పలువురు మంత్రులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. కాగా రాబోయే లోక్‌సభ ఎన్నికలు పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో జరుగుతాయని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు సత్ఫలితాలను సాధించేందుకు తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది.
మరోవైపు రాష్ట్రంలో తమ బలం పెరిగిందని, అందువల్ల తమకు మరిన్ని స్థానాలు కావాలని మిత్రపక్షమైన ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీని కోరుతోంది. కాగా బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ గతంలో బాగా లావుగా ఉండేవారు. అయితే పర్యటనలు తదితర అవసరాలను దృష్టిలో పెట్టుకుని బరువును తగ్గించుకున్నారు. బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు యత్నించారు. ఈ విషయాన్ని పలుసార్లు గడ్కరీ బహిరంగంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సైతం అదే బాటలో కొనసాగుతున్నారు.
బరువు తగ్గిన సీఎం
Published Sat, Nov 9 2013 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement