
అంత డబ్బు ఎందుకు కేటాయించారు?
ఐసీసీపై బీసీసీఐ గరంగరం
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ నిర్వహణ కోసం బీసీసీఐకి ఐసీసీ ఇచ్చిన మొత్తం 45 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.300 కోట్లు). అరుుతే వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్‌స ట్రోఫీ నిర్వహణ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి ఏకంగా 135 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.900 కోట్లు) బడ్జెట్‌ను కేటారుుంచడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. అంతేకాకుండా 19 రోజుల పాటు సాగే ఈ టోర్నీ సందర్భంగా లండన్‌లో ఆఫీస్ కోసం ఓ భవనాన్ని నిర్మించి పోటీలు ముగిశాక దాన్ని ఈసీబీకే అప్పగించనుంది. వాస్తవానికి టి20 ప్రపంచకప్‌లో ఇంతకంటే ఎక్కువగా 58 మ్యాచ్‌లు జరిగారుు.
‘నిజంగా ఇది శోచనీయం. టి20 ప్రపంచకప్‌ను ఇంతకన్నా తక్కువ ఖర్చులోనే మేం జరిపాం. పౌండ్లలో లెక్కేసినప్పుడు ఇంగ్లండ్‌లో నిర్వహణ ఖర్చు ఎక్కువగానే ఉండొచ్చు. మాకు కూడా ఆటగాళ్ల వసతి, ఒక చోటి నుంచి మరో చోటికి విమాన ప్రయాణ ఖర్చులుండేవి. ఇంగ్లండ్‌లో ఈ సమస్య ఉండదు. అసలు అక్కడ ఆఫీస్‌ను నిర్మించేందుకు మా అందరి సభ్య దేశాల డబ్బును ఎందుకు వెచ్చిస్తారు. ఒక సభ్య దేశంపైనే అంత ప్రేమ ఎందుకు చూపడం? ఇది సరైన పద్ధతి కాదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో తమ అసంతృప్తిని తెలుపుతూ భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది.