లండన్: బాల్ ట్యాంపరింగ్, స్లెడ్జింగ్ తదితర పరిణామాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. తప్పులు చేసే క్రీడాకారులకు జరిమానా, చిన్న చిన్న శిక్షలతో సరిపెట్టకూడదని నిర్ణయించింది. ఈ మేరకు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే నేపథ్యంలో ఓ కమిటీని నియమించింది. ఐదు రోజులపాటు జరిగిన కీలక సమావేశాల వివరాలను గురువారం ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ మీడియాకు వెల్లడించారు.
‘బాల్ ట్యాంపరింగ్, ఇతర తప్పిదాలకు చిన్న చిన్న శిక్షలు విధించటం వల్లే క్రీడాకారులకు భయం లేకుండా పోతుంది. అవే తప్పులు పునరావృతం అవుతున్నాయి. ప్రత్యర్థులంటే ఆటగాళ్లకి గౌరవం లేకుండా పోతోంది. స్లెడ్జింగ్ పేరుతో మైదానంలో దురుసు చేష్టలకు దిగుతున్నారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. వాటిని శిక్షలు విధించినా ప్రయోజం కనిపించటం లేదు. అందుకే ఇక మీద ఉపేక్షించే ప్రసక్తే లేదు. అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఓ కమిటీని నియమించాం. ప్రస్తుతం ఉన్న నియమావళిని, పెనాల్టీ..శిక్షల తీరును ఇది స్థూలంగా అధ్యయనం చేసి కొత్త ప్రతిపాదనలను సమర్పిస్తుంది. జూన్ 27, జూలై 3వ తేదీల్లో డబ్లిన్‌లో నిర్వహించబోయే సమావేశాల్లో వాటిని సమీక్షించి అమలులోకి తెస్తాం’ అని రిచర్డ్ సన్ తెలిపారు.
ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం.. బంగ్లాదేశ్-శ్రీలంక నిదాహాస్ ట్రోఫీ సందర్భంగా నెలకొన్న పరిణామాలపై ఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment