భారత్ పెత్తనం ఆటకు మంచిదే
ఐసీసీ సీఈఓ రిచర్డ్‌సన్ వ్యాఖ్య
సాక్షి, ఢాకా: ఇటీవల ఐసీసీలో జరిగిన మార్పులపై రకరకాల చర్చలు జరిగినా... మొత్తం మీద బీసీసీఐ పెత్తనం ఆటకు మంచిదేనని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్‌సన్ అభిప్రాయపడ్డారు. ‘ఇంతకాలం బీసీసీఐ బయటి నుంచి ఆర్థికంగా మద్దతు ఇస్తూ ఇతర దేశాలకు బాధ్యత అప్పజెప్పింది. ఇకపై ఐసీసీ బాధ్యత బీసీసీఐ తీసుకోవడం ఆటకు మంచే చేస్తుంది’ అని రిచర్డ్‌సన్ అన్నారు. డీఆర్‌ఎస్ విషయంలో భారత్‌ను ఒప్పిస్తామని చెప్పారు.
‘ఐసీసీ క్రికెట్ కమిటీ హెడ్ కుంబ్లే ఆధ్వర్యంలో డీఆర్‌ఎస్‌ను సమీక్షిస్తోంది. తొలుత కుంబ్లే డీఆర్‌ఎస్‌కు అంగీకరిస్తే, తర్వాత బీసీసీఐని ఒప్పించే అవకాశం ఉంటుంది’ అని రిచర్డ్‌సన్ చెప్పారు. 2015 వన్డే ప్రపంచ కప్ వరకు నాన్ పవర్‌ప్లేలో సర్కిల్‌కు ఆవల నలుగురు ఫీల్డర్ల నిబంధనను మార్చే ఆలోచనేదీ తమకు లేదన్నారు.
మనసులో మాట వేరే!
ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్‌సన్ పైకి ఏం చెప్పినా... లోపల మాత్రం బీసీసీఐ పెత్తనాన్ని ఇష్టపడటం లేదు. మీడియా సమావేశం ముగిశాక తనకు సన్నిహితంగా ఉన్న కొందరు విలేకరులతో మాట్లాడుతూ... భారత్ ప్రపంచకప్ నుంచి వైదొలుగుతానని బెదిరించడం వల్లే ఐసీసీలో మార్పులు జరిగాయని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.