
ఈసారి ప్రపంచ కప్ గెలిచే జట్లేవంటే? వచ్చే సమాధానం ‘ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా’. కప్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు జరగ్గా... టోర్నీని రక్తి కట్టించే ఆటతీరుకు పేరుగాంచిన ఈ మూడు ఫేవరెట్ జట్లు ఇంకా పరస్పరం తలపడాల్సి ఉంది. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ రసవత్తర అంకానికి ఆదివారంతో తెరలేవనుంది. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్–ఆస్ట్రేలియా నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అఫ్గానిస్తాన్‌ను అలవోకగా ఓడించి, విండీస్‌కు ఎదురొడ్డి గెలిచిన కంగారూలు... దక్షిణాఫ్రికాపై విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియాలలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.
లండన్: పన్నెండో ప్రపంచ కప్‌లో ఫేవరెట్ జట్ల మధ్య ‘తొలి’ పోరుకు భారత్, ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఈ రెండింటి మధ్య పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టోర్నీలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుంది. కీలకమైన సమరం కావడంతో ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఆడిన తుది 11 మందితోనే బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. పరుగులకు లోటుండని ఓవల్ పిచ్‌పై చెలరేగేది రోహిత్, కోహ్లినా...? స్మిత్, వార్నరా...? చూడాలి.
అతడూ జోరందుకుంటే...
కప్ ప్రారంభానికి ముందు భారత్‌కు ఓపెనర్ల ఫామ్‌పై ఆందోళన నెలకొంది. దక్షిణాఫ్రికాపై ఏకంగా సెంచరీ బాది రోహిత్ శర్మ టచ్‌లోకి వచ్చాడు. మిగిలింది శిఖర్ ధావన్. ఐసీసీ ఈవెంట్లలో మెరుగ్గా రాణించే అతడు జోరందుకోవాల్సిన సమయం వచ్చింది. కెప్టెన్ కోహ్లి తన స్థాయి ఇన్నింగ్స్ ఆడితే ప్రత్యర్థి తేలిపోవడం ఖాయం. తర్వాతి బాధ్యత కేఎల్ రాహుల్, ధోని, కేదార్ జాదవ్‌లది. ఆఖర్లో చెలరేగేందుకు హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. రెండో పేసర్‌గా భువనేశ్వర్, షమీ మధ్య మ్యూజికల్ చైర్ నడుస్తోంది.
ఆసీస్‌కు కళ్లెం వేయడంలో బుమ్రా–షమీ ద్వయమే మేలనే భావన ఉంది. కానీ, జట్టు భువీ వైపే మొగ్గుతోంది. తొలి మ్యాచ్‌లో అతడు రెండో స్పెల్‌లో అవసరమైన సమయంలో వికెట్లు తీశాడు. ఓవల్ పిచ్‌పై జాదవ్ స్పిన్‌తో పెద్దగా ప్రయోజనం ఉండదనుకుంటే విజయ్ శంకర్‌కు అవకాశం రావొచ్చు. సఫారీలపై నాలుగు వికెట్లు తీసిన యజువేంద్ర చహల్... తనకు మెరుగైన రికార్డు లేని కంగారూలను ఎలా కట్టడి చేస్తాడో చూడాలి. కుల్దీప్ యాదవ్‌ను ఎదుర్కొనడంలో ఆస్ట్రేలియా గతంలో తడబడింది. అతడిని ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టే ఆలోచన చేయాలి.
ఆసీస్... ఆత్మవిశ్వాసంతో
సరిగ్గా ప్రతిష్టాత్మక కప్ ముందు గాడిలో పడ్డ ఆస్ట్రేలియాకు తమ శక్తిసామర్థ్యాలను మరింత పరీక్షించుకునే అవకాశం భారత్‌తో మ్యాచ్ ద్వారా లభించనుంది. ప్రధాన బ్యాట్స్‌మెన్ వార్నర్, స్మిత్ అర్ధసెంచరీలతో ఫామ్ చాటుకోగా... కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఖాజా ఇంకా గాడిలో పడలేదు. మ్యాక్స్‌వెల్ కూడా రాణించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో వికెట్ కీపర్ క్యారీ, కూల్టర్ నైల్ జట్టు బ్యాటింగ్ లోతేమిటో చాటారు. స్టొయినిస్ ఆల్ రౌండ్ పాటవం, పేసర్లు స్టార్క్, కమిన్స్ ఫామ్ ఆసీస్‌కు పెద్ద బలం. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు తోడుగా నాథన్ లయన్‌ను దింపాలనుకుంటే కూల్టర్ నైల్‌ను తప్పించాలి. గత మ్యాచ్ గెలుపులో కీలకంగా నిలిచిన అతడిని పక్కన పెడతారా? అన్నది ప్రశ్న. పేసర్లు రాణిస్తే భారత్‌ను నియంత్రించడం కష్టం కాదని కంగారూలు లెక్కలేస్తున్నారు.
షార్ట్ బంతులతో పడగొట్టాలి
షార్ట్ బంతులను ఆడటంలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు. వార్నర్, ఫించ్, ఖాజాలు కరీబియన్ పేసర్ల ధాటికి నిలవలేకపోయారు. ఓ బంతి ఖాజా హెల్మెట్‌ను బలంగా తాకింది. ఈ బలహీనతను ఆసీస్ సహాయ కోచ్ పాంటింగ్ అంగీకరించాడు కూడా. టీమిండియా పేసర్లు దీనిని సొమ్ము చేసుకుంటే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు.
తేల్చేది బుమ్రానే!
ఈ మ్యాచ్‌లో బుమ్రానే భారత్ తురుపుముక్క. బ్యాట్స్‌మెన్ ఏమాత్రం ఆడలేని విధంగా అతడు సంధిస్తున్న బంతులే దీనికి కారణం. బుమ్రా మొదట్లోనే చెలరేగి ఆసీస్ టాపార్డర్ పని పడితే చహల్, కుల్దీప్ స్థిరంగా వికెట్లు తీయగలరు. మొదట బౌలింగ్‌కు దిగితే గాలులు వీస్తున్న పరిస్థితుల్లో స్వింగ్‌తో భువనేశ్వర్ ప్రభావం చూపగలడు.
మన మీదే పుంజుకుని...
రెండేళ్లలో 33 వన్డేలు ఆడితే ఎనిమిదింట్లోనే గెలుపు...! మూడు నెలల క్రితం ఆస్ట్రేలియా పరిస్థితిది. కానీ, మార్చిలో భారత్‌తో వన్డే సిరీస్ ద్వారా ఆ జట్టు తీరే మారిపోయింది. పరుగుల లేమితో కొట్టుమిట్టాడుతున్న కెప్టెన్ ఫించ్ సెంచరీల మీద సెంచరీలతో పూర్తి ఫామ్‌లోకి వచ్చాడు. ఖాజా ఏకంగా ప్రపంచ కప్ బెర్తే కొట్టేశాడు. టీమిండియాపై 0–2తో వెనుకబడి మరీ 3–2తో సిరీస్ నెగ్గిన ఊపులో పాకిస్తాన్‌ను వైట్‌వాష్ చేసింది ఆసీస్. వార్నర్, స్మిత్ చేరికతో ఇప్పుడు దుర్బేధ్యంగా మారింది. అటు పేస్ బౌలింగ్‌లో కమిన్స్ అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. స్టార్క్ విండీస్‌పై 5 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌ను చూసినవారికి... ఎలాంటి పరిస్థితుల్లోనూ విజయంపై ఆశలు వదులుకోని, ఎంతటి ఒత్తిడిలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వని ఒకప్పటి అచ్చమైన ప్రొఫెషనలిస్ట్ ఆస్ట్రేలియా గుర్తొచ్చి ఉంటే ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో కంగారూలను ఓడించాలంటే భారత్ పూర్తి శక్తి మేర ఆడాల్సి ఉంటుంది.
ముఖాముఖి రికార్డు
రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 136 వన్డేలు జరగ్గా భారత్ 49 గెలిచింది. ఆస్ట్రేలియా 77 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పదింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో పదకొండు మ్యాచ్‌లకు గాను భారత్ మూడింట్లో, ఆసీస్ ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గాయి.
పిచ్, వాతావరణం
మ్యాచ్‌కు ఫ్లాట్ పిచ్ ఎదురుకానుంది. గత నాలుగేళ్లుగా ఇంగ్లండ్‌లో భారీ స్కోర్లకు ఓవల్ మైదానం వేదికగా నిలుస్తోంది. ఈసారీ దీనినే ఊహించవచ్చు. గాలులు వీస్తున్నప్పటికీ మొత్తమ్మీద వాతావరణం పొడిగా ఉండనుంది. వర్షానికి అవకాశం లేదు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), రాహుల్, ధోని, కేదార్ జాదవ్, హార్దిక్, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా.
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, ఉస్మాన్ ఖాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, క్యారీ, కూల్టర్ నైల్, కమిన్స్, స్టార్క్, ఆడమ్ జంపా.
Comments
Please login to add a commentAdd a comment