'టెస్టు చాంపియన్’ కోసం ప్లే ఆఫ్!
దుబాయ్: టెస్టుల్లోనూ ప్రపంచ చాంపియన్‌ను నిర్ణయించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. కానీ వరల్డ్ కప్ తరహాలో పూర్తి స్థాయిలో అన్ని జట్లనూ చాంపియన్‌షిప్‌లో భాగం చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్‌టీపీ) ప్రకారం అన్ని జట్లూ టెస్టులు ఆడతాయి. ప్రస్తుతం ఇస్తున్న ప్రకారమే ర్యాంకింగ్‌లు కూడా కొనసాగుతాయి. అయితే రెండేళ్లకు ఒక సారి టెస్టు చాంపియన్‌ను తేల్చేందుకు రెండు జట్ల మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. ర్యాంకింగ్‌సలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఈ మ్యాచ్‌లో తలపడతాయి.తటస్థ వేదికపై ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారు.
ఇటీవల ఇక్కడ ముగిసిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఐసీసీ సభ్యుల ముందు ఉంచింది. త్వరలోనే దీనికి ఆమోదముద్ర లభించవచ్చు. 2019 ఆరంభంలోనే తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. వన్డేల్లో కూడా లీగ్ తరహాలో మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తున్నారు. దీని ప్రకారం 13 జట్లు మూడేళ్ల వ్యవధిలో మిగిలిన జట్లతో కనీసం ఒక సిరీస్ అయినా ఆడతాయి. సాధించిన పాయింట్లను బట్టి 2023 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆయా జట్లు అర్హత సాధిస్తాయి. టి20ల్లో కూడా ఇదే విధంగా లీగ్‌లు నిర్వహిస్తారు. ఈ రెండు ఫార్మాట్‌లలో ఒక్కో సిరీస్ కనీసం మూడు మ్యాచ్‌లకు తగ్గకుండా ఉంటుంది. మరో వైపు రెండు దేశాల మధ్య టెస్టు సిరీస్‌ల నిర్వహణపై ఆ రెండు బోర్డులే చర్చించుకోవాలని, తాము జోక్యం చేసుకోబోమని కూడా ఐసీసీ స్పష్టం చేసింది.