పసికూనల పోరు
నేటి నుంచి టి20 ప్రపంచకప్
క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో మొదలు
తొలిసారిగా బరిలోకి నేపాల్, హాంకాంగ్, యూఏఈ
నిరీక్షణ ముగిసింది. పొట్టి ఫార్మాట్ క్రికెట్ పండుగకు నేటితో తెరలేవనుంది. తొలుత ఎనిమిది పసికూన జట్ల మధ్య క్వాలిఫయింగ్ పోరు జరగనుంది. గతానికి భిన్నంగా తొలిసారి టి20 ప్రపంచకప్‌లో అర్హత రౌండ్ ద్వారా రెండు జట్లు అగ్రశ్రేణి జట్లున్న ప్రధాన రౌండ్‌లోకి అడుగుపెడతాయి. నేపాల్, హాంకాంగ్, యూఏఈ తొలిసారి టి20 ప్రపంచకప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు ప్రధాన రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.
- సాక్షి క్రీడా విభాగం
ఆసియా కప్‌లో ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌కు చేదు ఫలి తాలు ఎదురయ్యాయి. ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ గెలువలేకపోయింది. పొట్టి ఫార్మాట్‌లోనైనా సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో బంగ్లాదేశ్ టి20 మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగనుంది. ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో గెలిచిన బంగ్లాదేశ్ శనివారం మొదలయ్యే క్వాలిఫయింగ్ రౌండ్ తొలి మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌తో తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో బం గ్లాదేశ్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే అప్ఘానిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో క్వాలిఫయింగ్‌లో ఆడనున్న జట్ల బలాబలాలు, బలహీనతలను పరిశీలిద్దాం.
బంగ్లాదేశ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సభ్యదేశమైనప్పటికీ ఫార్మాట్‌ను మార్చడంతో బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో అర్హత మ్యాచ్‌లు ఆడాల్సి వస్తోంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న వాటిలో ఈ జట్టే ఫేవరెట్. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. ముష్ఫి కర్ రహీమ్ సారథ్యంలోని ఈ జట్టులో తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్, మొమినుల్ హక్, మహ్మదుల్లా, మొర్తజా, అబ్దుర్ రజాక్ లాంటి సత్తా ఉన్న ఆటగాళ్లకు కొదువ లేదు. దీనికి తోడు సొంతగడ్డపై టోర్నీ జరగనుండటం బంగ్లా టైగర్లకు కలిసి రానుంది. అయితే ఇటీవల స్వదేశంలో ముగిసిన ఆసియాకప్‌లో చెత్త ఆటతో విమర్శల పాలైంది. కీలక ఆటగాళ్లు గాయాల పాలవడంతో అనామక జట్టయిన అఫ్ఘానిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అర్హత మ్యాచ్‌ల్లో ఈ జట్టుపై ఒత్తిడి ఉంటుంది.
అఫ్ఘానిస్థాన్: ఈ పసికూన జట్టుకు ఇది మూడో టి20 ప్రపంచకప్. 2010, 2012 ప్రపంచకప్‌లో పాల్గొన్నా తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. అలాగని ఈ జట్టును తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో అప్ఘానిస్థాన్ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌ను ఓడించి తమలో సత్తా ఉందని నిరూపించింది. వన్డేల్లోనే తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ క్రికెట్ బేబీలు టి20ల్లోనూ రాణిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ జట్టులో కెప్టెన్ మహమ్మద్ నబీతో పాటు అస్ఘర్, ఆల్‌రౌండర్ సమీయుల్లా షెన్వారి, మీర్వాయిస్ అష్రాఫ్, షెహజాద్ లాంటి లాంటి ఆటగాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు.
హాంకాంగ్: తొలిసారిగా టి20 ప్రపంచకప్ ఆడుతున్న ఈ జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు. ఐసీసీ టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆరో స్థానంలో నిలిచిన హాంకాంగ్‌కు ఫార్మాట్ మార్చడం కలిసొచ్చింది. జేమీ అట్కిన్సన్ సారథ్యంలోని ఈ జట్టులో సీనియర్లు, కుర్రాళ్లు ఉన్నారు. జట్టులో ఉన్నవారిలో ఎక్కువమంది ఆల్‌రౌండర్లే. నలభై ఏళ్లు పైబడిన నజీబ్ అమర్ (42), మునీర్ దార్ (41) అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించగలరు.
నేపాల్: భారత్‌కు పొరుగు దేశమైన నేపాల్‌లో క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులు లక్షల్లో ఉన్నారు. అయితే నేపాల్ జట్టు మాత్రం క్రికెట్ ఆటలో మాత్రం వెనకబడే ఉంది. ఈ జట్టు ఆడబోతున్న అతిపెద్ద టోర్నీ టి20 ప్రపంచకపే కావడం విశేషం. అర్హత గ్రూప్‌లో ఈ జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు. కెప్టెన్ పారస్ ఖద్కా, శరద్ వెసావ్కర్, బసంత్ రెగ్మి నుంచి మంచి ప్రదర్శన ఆశించొచ్చు.
జింబాబ్వే: గ్రూప్ ‘బి’లో టెస్టు హోదా ఉన్న జట్టు జింబాబ్వే ఒక్కటే. అయితే జింబాబ్వే ప్రధాన గ్రూప్‌కు అర్హత సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ టి20ల్లో జింబాబ్వే పెద్దగా విజయాలు సాధించకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటిదాకా టి20ల్లో 28 మ్యాచ్‌లు ఆడిన జింబాబ్వే 23 మ్యాచ్‌ల్లో ఓడి, 4 మ్యాచ్‌ల్లో నెగ్గి, మరో మ్యాచ్‌ను టై చేసుకొని ‘సూపర్ ఓవర్’లో గెలిచింది. ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో జింబాబ్వే ఆరు మ్యాచ్‌ల్లో ఆడి కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో నెగ్గి, ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ఐర్లాండ్: ఈ గ్రూప్‌లో ఐర్లాండ్ ఫేవరెట్‌గా చెప్పుకోవచ్చు. టి20 ప్రపంచకప్‌లో ఈ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉంది. ఇప్పటిదాకా మూడు టి20 ప్రపంచకప్‌ల్లో పాల్గొన్న అనుభవం ఈ జట్టుకు ఉంది. ఇక 2009 ప్రపంచకప్‌లో ఈ ఐరిష్ జట్టు బంగ్లాదేశ్‌కు షాకిచ్చి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు కూడా సంచలనాలు సృష్టించేందుకు ఈ జట్టు సిద్ధమవుతోంది. ఇక ఐర్లాండ్‌లో కెప్టెన్ పోర్టర్‌ఫీల్డ్, ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రియాన్, వికెట్ కీపర్ నీల్ ఒబ్రియాన్‌తో పాటు సత్తా చాటే ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ జట్టులోని ఆటగాళ్లు తరుచుగా కౌంటీల్లో పాల్గొంటారు.
నెదర్లాండ్స్: ఈ జట్టు తానాడిన తొలి టి20 ప్రపంచకప్‌లోనే సంచలనం సృష్టించింది. 2009లో ఇంగ్లండ్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టునే ఓడించి సత్తా చాటింది. ఈ గ్రూప్‌లో తన ప్రత్యర్థులకు గట్టిపోటీనిచ్చే అవకాశాలున్నాయి. కెప్టెన్ పీటర్ బోరెన్, వెస్లీ బరెసీ, ముదస్సర్ బుఖారి జట్టులో కీలక ఆటగాళ్లుగా చెప్పవచ్చు.
యూఏఈ: తొలిసారిగా టి20 ప్రపంచకప్ ఆడనున్న యూఏఈపై పెద్దగా అంచనాలేమీ లేవు. అంతర్జాతీయ క్రికెట్‌లో యూఏఈ అప్పుడప్పుడు కనిపించినా... ప్రదర్శన అంతంత మాత్రమే.
గ్రూప్ ‘ఎ’: బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్, నేపాల్.
గ్రూప్ ‘బి’: జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్స్, యూఏఈ.
టి20 ప్రపంచకప్‌లో నేడు
బంగ్లాదేశ్ x అఫ్ఘానిస్థాన్
మధ్యాహ్నం గం. 3.00 నుంచి
నేపాల్ x హాంకాంగ్
రాత్రి గం. 7.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల షెడ్యూల్
మార్చి 16 బంగ్లాదేశ్ x అఫ్ఘానిస్థాన్
మార్చి 16 హాంకాంగ్ xనేపాల్
మార్చి 17 ఐర్లాండ్ x జింబాబ్వే
మార్చి 17 నెదర్లాండ్స్ x యూఏఈ
మార్చి 18 అఫ్ఘానిస్థాన్ xహాంకాంగ్
మార్చి 18 బంగ్లాదేశ్ xనేపాల్
మార్చి 19 నెదర్లాండ్స్ x జింబాబ్వే
మార్చి 19 ఐర్లాండ్ x యూఏఈ
మార్చి 20 అఫ్ఘానిస్థాన్ x నేపాల్
మార్చి 20 బంగ్లాదేశ్ x హాంకాంగ్
మార్చి 21 జింబాబ్వే x యూఏఈ
మార్చి 21 ఐర్లాండ్ x నెదర్లాండ్స్