Bangladesh team
-
‘ఐదు రోజులకు తీసుకెళ్లాలి’
చెన్నై: భారత్‌తో రెండు టెస్టులు, ఆపై మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత గడ్డపై ఆదివారం అడుగు పెట్టింది. ఢాకా నుంచి ఆటగాళ్ల బృందం తొలి టెస్టు వేదిక అయిన చెన్నైకి నేరుగా చేరుకుంది. తమ దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ జట్టుకు సెక్యూరిటీ కల్పించే విషయంలో బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. టీమ్ బస చేస్తున్న హోటల్లో బోర్డు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి బంగ్లాదేశ్ జట్టు ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. 19 నుంచి ఇరు జట్ల మధ్య ఎంఎ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు జరుగుతుంది. సీనియర్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ మినహా బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా వచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతున్న షకీబ్ టెస్టు సమయానికి నేరుగా చెన్నైకి చేరుకుంటాడు. భారత్‌కు బయల్దేరడానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్నజు్మల్ హసన్ షంటో మీడియాతో మాట్లాడాడు. ‘పాకిస్తాన్‌పై సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత్‌తో సిరీస్‌లో గట్టి పోటీ ఇవ్వగలం. టెస్టు మ్యాచ్‌లలో కుప్పకూలిపోకుండా ఆటను ఐదు రోజుల వరకు తీసుకెళ్లడం మా తొలి లక్ష్యం. భారత్‌తో సిరీస్ మాకు సవాల్. అందరిలాగే మేమూ అన్ని మ్యాచ్‌లు గెలవాలనే కోరుకుంటాం. మా బలానికి తగినట్లుగా ఆడటం ముఖ్యం. మా అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇవ్వాలి’ అని నజ్ముల్ చెప్పాడు. -
బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ పునరాగమనం
రాజకీయ నాయకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాక బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. శ్రీలంక జట్టుతో చట్టోగ్రామ్‌లో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో షకీబ్ ఆడనున్నాడు. గత ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్ మధ్యలో షకీబ్ గాయంతో వైదొలిగాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 37 ఏళ్ల షకీబ్ అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా నియోజకవర్గం నుంచి పోటీచేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. -
‘థ్యాంక్యూ’...
న్యూఢిల్లీ: తీవ్ర కాలుష్యం నగరాన్ని కమ్మేసిన సమయంలో కూడా ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టి20 మ్యాచ్ మాత్రం ఆగలేదు. ఇరు జట్లు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఆటను కొనసాగించాయి. ఒక దశలో రద్దు అవుతుందేమో అనిపించినా... అవాంతరం లేకుండా నిర్ణీత సమయం ప్రకారమే మ్యాచ్ జరిగింది. దాంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఊపిరి పీల్చుకున్నాడు. రెండు జట్లకు కూడా అతను కృతజ్ఞతలు చెప్పాడు. ‘కఠిన పరిస్థితుల మధ్య మ్యాచ్ ఆడినందుకు ఇరు జట్లకు కృతజ్ఞతలు. బాగా ఆడిన బంగ్లా జట్టుకు అభినందనలు’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. మరోవైపు ఢిల్లీ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదని బయటకు చెప్పినా... సౌమ్య సర్కార్‌తో పాటు మరో బంగ్లా క్రికెటర్ కాలుష్యం దెబ్బకు తట్టుకోలేక మైదానంలో వాంతి చేసుకున్నట్లు సమాచారం. ‘మహా’ ఆపుతుందా! భారత్, బంగ్లా మధ్య గురువారం రెండో టి20 మ్యాచ్ జరగడంపై సందేహాలు రేగుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన రాజ్‌కోట్ తీవ్రమైన తుఫాన్ ‘మహా’ బారిన పడే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం గుజరాత్ తీరానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాజ్‌కోట్‌పై తుఫాన్ ప్రభావం ఉండవచ్చు. ‘మహా’ కారణంగా 6, 7 (మ్యాచ్ జరిగే రోజు) తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జైదేవ్ షా అన్నారు. -
‘పంత్‌ను తప్పు పట్టలేం’
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో టి20 మ్యాచ్‌లో కీలక సమయంలో భారత్ డీఆర్ఎస్ను సమర్థంగా ఉపయోగించుకోవడంలో విఫలమైంది. చహల్ వేసిన ఒకే ఓవర్లో రెండు సార్లు ఇలా జరగడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది. ఒకసారి ఎల్బీకి అవకాశం ఉన్నా అప్పీల్ చేయకపోగా, మరోసారి అనవసరపు అప్పీల్‌తో రివ్యూ కోల్పోయింది. ఇందులో రోహిత్ శర్మ తన కీపర్ రిషభ్ పంత్‌ను నమ్మగా, అతను మాత్రం సరైన విధంగా అంచనా వేయలేకపోయాడు. అయితే ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్న పంత్‌ను తప్పు పట్టరాదంటూ రోహిత్ సమర్థించాడు. ‘రిషభ్ ఇంకా కుర్రాడే. డీఆర్ఎస్ను అర్థం చేసుకోవడానికి అతనికి కొంత సమయం పడుతుంది. అతని నిర్ణయాలపై అప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. ఇందులో బౌలర్ల పాత్ర కూడా ఉంటుంది. ఫీల్డర్ నిలబడిన స్థానంనుంచి ఎల్బీ విషయంలో సరైన విధంగా అంచనా వేయలేం కాబట్టి కీపర్, బౌలర్‌ను ఎవరైనా నమ్మాల్సి ఉంటుంది’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. చివర్లో ఖలీల్‌తో బౌలింగ్ చేయించడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం లేదని, ఆఖరి ఓవర్లలో తమ స్పిన్నర్లు బౌలింగ్ చేయాలని తాను కోరుకోనని రోహిత్ స్పష్టం చేశాడు. -
బంగ్లాదేశ్ సాధన షురూ
ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లు హైదరాబాద్: భారత్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు శుక్రవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో సుదీర్ఘ సమయం పాటు ఆటగాళ్లు సాధన చేశారు. కెప్టెన్ ముష్ఫికర్, తమీమ్, షకీబ్ ఎక్కువ సేపు నెట్స్‌లో శ్రమించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్టేడియానికి వచ్చిన క్రికెటర్లు ముందుగా సమీపంలోని మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం దాదాపు మూడు గంటల పాటు ప్రాక్టీస్ కొనసాగింది. టెస్టు మ్యాచ్ నిర్వహణకు అవకాశం ఉన్న రెండు పిచ్‌లను బంగ్లాదేశ్ టీమ్ మేనేజ్మెంట్ పరిశీలించింది. టెస్టుకు ముందు ఆది, సోమవారాల్లో బంగ్లాదేశ్ జట్టు జింఖానా మైదానంలో భారత్ ‘ఎ’తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. గత సిరీస్ ప్రభావం ఉండదు... ప్రాక్టీస్ అనంతరం బంగ్లా ఆటగాడు మోమినుల్ హక్ మీడియాతో మాట్లాడాడు. పటిష్టమైన భారత్‌ను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని అతను చెప్పాడు. ‘భారత్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. స్పిన్ గురించి చెప్పనవసరం లేదు. నంబర్‌వన్ టీమ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలని మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. భిన్నంగా ప్రయత్నించే సాహసం చేయకుండా మూలాలకు కట్టుబడి ఆడి ఫలితం సాధిస్తాం. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓడినా ఆ ప్రభావం ఇక్కడ ఉండదు. నాకు వ్యక్తిగత లక్ష్యాలు ఏమీ లేకపోయినా, సుదీర్ఘ సమయం క్రీజ్‌లో నిలబడాలని పట్టుదలగా ఉన్నా’ అని హక్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లితో సంభాషించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు అతను చెప్పాడు. మరోవైపు బంగ్లాదేశ్ యువ ఆఫ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ కూడా భారత్‌తో టెస్టు ఆడుతుండటంపై ఉద్వేగానికి లోనవుతున్నాడు. ‘పిచ్ నుంచి సహకారం లభిస్తే మా స్పిన్నర్లు కూడా మంచి ప్రభావం చూపగలరు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలమని నమ్ముతున్నా. అశ్విన్‌లాంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్ బౌలింగ్‌ను దగ్గరి నుంచి పరిశీలించే అవకాశం నాకు దక్కుతోంది. ఈ అనుభవం నాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. వీలుంటే అశ్విన్ నుంచి కొన్ని ఆఫ్ స్పిన్ కిటుకులు కూడా నేర్చుకుంటా’ అని హసన్ పేర్కొన్నాడు. -
టెస్టు మ్యాచ్ కోసం తొలిసారి...
భారత గడ్డపై బంగ్లాదేశ్ హైదరాబాద్ చేరుకున్న జట్టు హైదరాబాద్: దాదాపు 18 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ జట్టు మొదటి సారి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగింది. తమకు టెస్టు హోదా దక్కడంలో కీలక పాత్ర పోషించిన భారత్‌తోనే తొలి పోరులో బంగ్లా తలపడింది. ఢాకాలో నాలుగు రోజుల్లో ముగిసిన ఈ టెస్టులో భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టు సిరీస్‌లకు కూడా బంగ్లానే వేదికగా నిలిచింది. ఇప్పుడు మొదటిసారి బంగ్లాదేశ్ భారత గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నెల 9నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ముష్ఫికర్ రహీమ్ నాయకత్వంలోని బంగ్లా బృందం ఈ టెస్టులో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ చేరుకుంది. వరల్డ్ కప్‌లాంటి ఐసీసీ టోర్నీలో తప్ప వన్డే, టి20 ఫార్మాట్లలో కూడా భారతగడ్డపై ద్వైపాక్షిక సిరీస్‌లలో గతంలో బంగ్లా తలపడలేదు. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 8 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 6 గెలిచింది. మరో 2 ‘డ్రా’గా ముగిశాయి. టెస్టుకు ముందు బంగ్లాదేశ్ ఈ నెల 5, 6 తేదీల్లో భారత్ ‘ఎ’ జట్టుతో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడుతుంది. మమ్మల్ని మేం నిరూపించుకుంటాం... భారత గడ్డపై తొలిసారి ఆడుతున్నా, తాము అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలమని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ టెస్టును చారిత్రక మ్యాచ్‌గా తాము భావించడం లేదని అతను అన్నాడు. ‘భారత్‌లో కూడా మేం బాగా ఆడగలమని ప్రపంచానికి చూపించదలిచాం. మళ్లీ ఎన్నేళ్ల తర్వాత ఇక్కడ టెస్టు ఆడతామో ఇప్పడైతే తెలీదు కానీ భారత్ మమ్మల్ని మళ్లీ మళ్లీ ఆహ్వానించేలా మెరుగైన ఆటతీరు కనబరుస్తాం’ అని ముష్ఫికర్ చెప్పాడు. బౌలర్లకు అనుభవం తక్కువగా ఉన్నా...ఇటీవలి కాలంలో తమ బ్యాటింగ్ ప్రదర్శన చాలా బాగుందని, దానినే పునరావృతం చేస్తామని అతను అన్నాడు. టెస్టులో అశ్విన్, జడేజాలను బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదని రహీమ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో వీరిద్దరిది అత్యుత్తమ జోడి. ఇక్కడి పరిస్థితుల్లో వారి బౌలింగ్‌లో ఆడటం పెద్ద సవాల్లాంటిది’ అని అతను విశ్లేషించాడు. అయితే తమ ప్రధాన బ్యాట్స్‌మెన్ తమీమ్, ఇమ్రుల్, మహ్ముదుల్లా, సర్కార్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న విషయాన్ని ముష్ఫికర్ గుర్తు చేశాడు. -
బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా వాల్ష్
బంగ్లాదేశ్ జట్టు నూతన బౌలింగ్ కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం కౌట్నీ వాల్ష్‌ను నియమించారు. 2019 ప్రపంచకప్ వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మేలో ఒప్పందం ముగిసిన హీత్ స్ట్రీక్ స్థానంలో వాల్ష్‌ను నియమించినట్టు బంగ్లా క్రికెట్ బోర్డు పేర్కొంది. 2001లో కెరీర్‌కు ముగింపు పలికిన అనంతరం 53 ఏళ్ల వాల్ష్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. -
బంగ్లాతో మ్యాచ్: ఒమన్ విజయలక్ష్యం: 181
ధర్మశాల: టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా గ్రూపు-ఏలో బంగ్లాదేశ్, ఒమన్ జట్ల మధ్య ఆదివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ఒమన్ జట్టు తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దాంతో ఒమన్ జట్లుకు బంగ్లాదేశ్181 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు సౌమ్య సర్కార్ 22 బంతుల్లో (రెండు ఫోర్లు)తో 12 పరుగులకే చేతులెత్తేశాడు. షబ్బీర్ రహమాన్ 26 బంతుల్లో 44 పరుగులు చేసి పెవిలీయన్ బాట పట్టాడు. తమీమ్ ఇక్బాల్ సెంచరీ పూర్తి చేసి103 పరుగులతో అద్భుతంగా రాణించి నాటౌట్‌గా నిలిచాడు. షకీబ్ అల్ హసన్ 17 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఒమన్ బౌలర్లు లాల్చేతా, ఖావర్ అలీ తలో వికెట్ తీసుకున్నారు. -
తొలి టి20లో బంగ్లాదేశ్ విజయం
ఢాకా: జింబాబ్వేతో శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 38 పరుగులకే నాలుగు వికెట్లు పడిన దశలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాలర్ (31 బంతుల్లో 68; 4 ఫోర్లు; 6 సిక్సర్లు) వేగంగా ఆడి స్కోరును ఉరకలెత్తించాడు. 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన తను జింబాబ్వే తరఫున టి20ల్లో వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన ఆటగాడయ్యాడు. మొర్తజా, అమిన్, ముస్తఫిజుర్, జుబేర్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (28 బంతుల్లో 31; 3 ఫోర్లు), మహ్ముదుల్లా (31 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. క్రెమెర్‌కు మూడు, కిసోరోకు రెండు వికెట్లు దక్కాయి. -
ఇక కూనలు కాదు
పాక్‌పై బంగ్లా క్లీన్‌స్వీప్ అద్భుతం ప్రపంచకప్ ద్వారా పెరిగిన విశ్వాసం సాక్షి క్రీడావిభాగం మనం ఐపీఎల్ సంబరంలో ఉండి సరిగా పట్టించుకోలేదు కానీ... బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై సాధించింది సామాన్యమైన ఘనత కాదు. పాకిస్తాన్‌ను మూడు వన్డేల సిరీస్‌లో 3-0తో ఓడించడం చాలా పెద్ద విజయం. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ సాధికారికంగా గెలిచారు. ఏదో అదృష్టవశాత్తూనో లేక ఒక్క ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనతో కాదు. మొత్తం అందరూ సమష్టిగా రాణించి మూడు ఘన విజయాలు సాధించారు. సిరీస్ ఆరంభానికి ముందు క్రికెట్ ప్రపంచం ఈ ఫలితాన్ని ఊహించలేదు. పెరిగిన ఆత్మవిశ్వాసం ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరడం, భారత్‌తో అంపైరింగ్ నిర్ణయాలు వ్యతిరేకంగా రాకపోతే సెమీస్‌కు చేరేవాళ్లమనే భావన బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచాయి. దీనికి తోడు స్వదేశం చేరుకున్న తర్వాత జరిగిన సన్మానాలు బంగ్లా క్రికెటర్లకు కొత్త ‘కిక్’ ఇచ్చాయి. దేశం మొత్తం స్టార్స్‌గా ఆరాధించడం మొదలుపెట్టింది. దీంతో పాక్‌తో సిరీస్‌కు కొత్త ఉత్సాహంతో సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల్లోనూ కలిసి టాప్-6 బ్యాట్స్‌మెన్ మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. గుల్, రియాజ్, అజ్మల్ లాంటి స్టార్స్ ఉన్న బౌలింగ్ లైనప్‌పై ఇంత బాగా ఆడటం అభినందనీయం. ముఖ్యంగా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో అద్భుతమైన నిలకడ చూపించాడు. ముష్ఫికర్, సౌమ్య సర్కార్ చెరో సెంచరీ చేశారు. ఇక షకీబ్ తన ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని కొనసాగిస్తే... బౌలింగ్‌లో అరాఫత్ సన్నీ, రూబెల్ హొస్సేన్ ఆకట్టుకున్నారు. మొత్తం మీద అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన బంగ్లా... పాక్‌ను చిత్తు చేసింది. ఇకపై జాగ్రత్తగా... ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌లో సిరీస్ ఆడాల్సి ఉంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, కొత్త క్రికెటర్లను బీసీసీఐ గనక పంపితే... ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో బంగ్లా మనకూ షాక్ ఇస్తుంది. కాబట్టి ఇకపై భారత్‌తో పాటు ఏ జట్టయినా సరే బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అంటే చాలా జాగ్రత్తగా ఆడి తీరాల్సిందే. పాక్‌లో ఆగ్రహజ్వాలలు మరోవైపు పాకిస్తాన్లో తమ జట్టు ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ దేశ క్రికెట్ చరిత్రలో ఇది దారుణమైన ఓటమి అని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. కోచ్‌తో పాటు టీమ్ మేనేజ్మెంట్ మొత్తాన్ని మార్చాలని, బోర్డును, సెలక్షన్ కమిటీని కూడా ప్రక్షాళన చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇక పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్ సరిగా లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పాక్ బోర్డు చైర్మన్ షహర్యార్‌ఖాన్ మాత్రం దీనిని తేలికగానే తీసుకున్నారు. ‘సిరీస్ ఓటమి బాధాకరమే అయినా ఈ ఓటమి గురించి అంతగా ఆందోళన అనవసరం. అయితే జట్టు తిరిగి వచ్చాక మాత్రం దీనిపై విచారణ చేస్తాం’ అని ఖాన్ వ్యాఖ్యానించారు. -
బంగ్లాదేశ్ భారీ స్కోరు
తొలి ఇన్నింగ్స్ 503 జింబాబ్వేతో మూడో టెస్టు చిట్టగాంగ్: జింబాబ్వేతో జరుగుతున్న మూడో టెస్టులో బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోరు సాధించింది. రెండో రోజు గురువారం షకీబ్ అల్ హసన్ (110 బంతుల్లో 71; 7 ఫోర్లు), రూబెల్ హొస్సేన్ (44 బంతుల్లో 45; 2 ఫోర్లు; 4 సిక్సర్లు) రాణించడంతో బంగ్లాదేశ్ 153.4 ఓవర్లలో 503 పరుగులకు ఆలౌటయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 303/2తో ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టును జింబాబ్వే బౌలర్లు కట్టడి చేశారు. సికందర్ రజాకు మూడు వికెట్లు, షింగి మసకద్జా, హామిల్టన్ మసకద్జా, పన్యాంగరాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. -
బంగ్లాదేశ్ 70 ఆలౌట్
రెండో వన్డేలో 177 పరుగులతో విండీస్ విజయం సెయింట్ జార్జి: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు తమ చరిత్రలోనే మూడో అత్యల్ప స్కోరును నమోదు చే సింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ జట్టు... స్పిన్నర్ నరైన్ (3/13), పేసర్ రోచ్ (3/19) ధాటికి శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 24.4 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటయ్యింది. ఫలితంగా విండీస్ 177 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాపై విండీస్కిదే అతి పెద్ద విజయం. మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-0తో ఆధిక్యంలో ఉంది. చివరి వన్డే రేపు (సోమవారం) జరుగుతుంది. ఐదో ఓవర్ నుంచి సాగిన బంగ్లా వికెట్ల పతనాన్ని అడ్డుకునే బ్యాట్స్‌మెన్ కరువయ్యాడు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (50 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. మిగిలిన పది మంది ఆటగాళ్లు కలిసి చేసిన పరుగులు 28 మాత్రమే. వీరిలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరును సాధించలేకపోగా చివరి ఏడు వికెట్లు కేవలం 13 పరుగుల వ్యవధిలోనే కుప్పకూలాయి. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 247 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (67 బంతుల్లో 58; 3 ఫోర్లు; 5 సిక్సర్లు) చెలరేగాడు. డ్వేన్ బ్రేవో (82 బంతుల్లో 53; 2 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించాడు. మిడిలార్డర్లో సిమ్మన్స్ (61 బంతుల్లో 40; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మొర్తజా మూడు, అల్ అమిన్ రెండు వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నరైన్‌కు దక్కింది. -
బంగ్లా చిత్తు చిత్తు
టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ బోణి మెరిసినడ్వేన్ స్మిత్ సమష్టిగా రాణించిన బౌలర్లు ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి పాపం... బంగ్లాదేశ్ అభిమానులు..! సొంతగడ్డపై టి20 ప్రపంచకప్‌లో సూపర్-10 స్టేజ్‌కి చేరిన తమ జట్టు ఆటను చూద్దామని... మ్యాచ్ ప్రారంభానికి నాలుగు గంటల ముందే స్టేడియం ముందు లైన్లలో నిలబడ్డారు. రెండు గంటల ముందే వచ్చి సీట్లలో కూర్చున్నారు. కానీ అందులో సగంసేపు కూడా స్టేడియంలో ఉండలేకపోయారు. తమ జట్టు ఆడుతున్న దారుణమైన ఆట చూడలేక మధ్యలోనే వెళ్లిపోయారు. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో టి20 ప్రపంచకప్‌లో బోణీ చేసింది. షేరే బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్ ‘2’ మ్యాచ్‌లో 73 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌తో శ్రీలంక తలపడతాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ (43 బంతుల్లో 72; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు వేగంతో అర్ధసెంచరీ చేశాడు. మరో ఓపెనర్ క్రిస్ గేల్ (48 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. స్మిత్, గేల్ తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించారు. శామ్యూల్స్ (22 బంతుల్లో 18; 1 ఫోర్) కూడా నెమ్మదిగానే ఆడాడు. చాలాసేపు నెమ్మదిగా ఆడిన గేల్ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. కెప్టెన్ స్యామీ (5 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు) చివర్లో చకచకా పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ పేసర్ అల్ అమీన్ హొస్సేన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీయడం విశేషం. మహ్మదుల్లా, షకీబ్, జియావుర్ ఒక్కో వికెట్ తీశారు. బంగ్లాదేశ్ 19.1 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటయింది. పవర్‌ప్లే ఓవర్లలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (22 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్సర్) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. వెస్టిండీస్ స్పిన్నర్ బద్రీ (4/15) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పేసర్ సాంటోకీ (3/17) ఆకట్టుకున్నాడు. గతి తప్పిన బౌలింగ్... క్యాచ్‌లు వదిలేయడం... పేలవమైన షాట్ సెలక్షన్... ఇలా బంగ్లాదేశ్ అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. డ్వేన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) అమిన్ (బి) మహ్మదుల్లా 72; క్రిస్ గేల్ (సి) తమీమ్ (బి) జియావుర్ 48; సిమ్మన్స్ (స్టం) ముష్ఫికర్ (బి) షకీబ్ 0; శామ్యూల్స్ (సి) సోహాగ్ (బి) అమిన్ 18; స్యామీ నాటౌట్ 14; రస్సెల్ (సి) షకీబ్ (బి) అమిన్ 0; బ్రేవో (సి) తమీమ్ (బి) అమిన్ 0; రామ్‌దిన్ రనౌట్ 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 171 వికెట్ల పతనం: 1-97; 2-98; 3-151; 4-167; 5-167; 6-168; 7-171. బౌలింగ్: మొర్తజా 4-0-25-0; అమిన్ 4-0-21-3; సోహాగ్ గజీ 4-0-38-0; షబ్బీర్ 1-0-12-0; మహ్మదుల్లా 3-0-27-1; షకీబ్ 3-0-21-1; జియావుర్ 1-0-16-1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) బ్రేవో (బి) బద్రీ 5; అనాముల్ (స్టం) రామ్‌దిన్ (బి) సాంటోకీ 10; మోమినుల్ (సి) సాంటోకీ (బి) నరైన్ 16; షకీబ్ (బి) సాంటోకీ 0; ముష్ఫికర్ (సి) బ్రేవో (బి) బద్రీ 22; షబ్బీర్ (సి) స్యామీ (బి) బద్రీ 1; మహ్మదుల్లా (సి) సిమ్మన్స్ (బి) బద్రీ 1; జియావుర్ (బి) రస్సెల్ 9; సోహాగ్ (బి) రస్సెల్ 11; మొర్తజా (సి) బ్రేవో (బి) సాంటోకీ 19; అల్ అమీన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 98 వికెట్ల పతనం: 1-14; 2-16; 3-16; 4-51; 5-57; 6-58; 7-59; 8-73; 9-97; 10-98. బౌలింగ్: బద్రీ 4-0-15-4; సాంటోకీ 4-0-17-3; శామ్యూల్స్ 1-0-9-0; స్యామీ 1-0-6-0; నరైన్ 4-0-17-1; బ్రేవో 3-0-23-0; రస్సెల్ 2.1-0-10-2. జెండాలు నిషేధం సాక్షి, ఢాకా: వెస్టిండీస్, బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. తమ దేశం తప్ప, మరే దేశం జెండాలు అభిమానులు స్టేడియంలోకి తీసుకురాకూడదని బంగ్లా పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం బంగ్లాదేశ్‌లో 44వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ‘ఆసియాకప్ సందర్భంగా కొంతమంది బంగ్లా దేశీయులు పాకిస్థాన్ జెండాలతో తిరిగారు. దీంతో ఈసారి ఈ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది’ అని బీసీబీ అధికారులు వివరణ ఇచ్చారు. 1971 మార్చి 25 రాత్రి బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం వచ్చింది. -
పసికూనల పోరు
నేటి నుంచి టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో మొదలు తొలిసారిగా బరిలోకి నేపాల్, హాంకాంగ్, యూఏఈ నిరీక్షణ ముగిసింది. పొట్టి ఫార్మాట్ క్రికెట్ పండుగకు నేటితో తెరలేవనుంది. తొలుత ఎనిమిది పసికూన జట్ల మధ్య క్వాలిఫయింగ్ పోరు జరగనుంది. గతానికి భిన్నంగా తొలిసారి టి20 ప్రపంచకప్‌లో అర్హత రౌండ్ ద్వారా రెండు జట్లు అగ్రశ్రేణి జట్లున్న ప్రధాన రౌండ్లోకి అడుగుపెడతాయి. నేపాల్, హాంకాంగ్, యూఏఈ తొలిసారి టి20 ప్రపంచకప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు ప్రధాన రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. - సాక్షి క్రీడా విభాగం ఆసియా కప్‌లో ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌కు చేదు ఫలి తాలు ఎదురయ్యాయి. ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ గెలువలేకపోయింది. పొట్టి ఫార్మాట్లోనైనా సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో బంగ్లాదేశ్ టి20 మెగా ఈవెంట్లో బరిలోకి దిగనుంది. ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో గెలిచిన బంగ్లాదేశ్ శనివారం మొదలయ్యే క్వాలిఫయింగ్ రౌండ్ తొలి మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌తో తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో బం గ్లాదేశ్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే అప్ఘానిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో క్వాలిఫయింగ్‌లో ఆడనున్న జట్ల బలాబలాలు, బలహీనతలను పరిశీలిద్దాం. బంగ్లాదేశ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సభ్యదేశమైనప్పటికీ ఫార్మాట్‌ను మార్చడంతో బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో అర్హత మ్యాచ్‌లు ఆడాల్సి వస్తోంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న వాటిలో ఈ జట్టే ఫేవరెట్. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. ముష్ఫి కర్ రహీమ్ సారథ్యంలోని ఈ జట్టులో తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్, మొమినుల్ హక్, మహ్మదుల్లా, మొర్తజా, అబ్దుర్ రజాక్ లాంటి సత్తా ఉన్న ఆటగాళ్లకు కొదువ లేదు. దీనికి తోడు సొంతగడ్డపై టోర్నీ జరగనుండటం బంగ్లా టైగర్లకు కలిసి రానుంది. అయితే ఇటీవల స్వదేశంలో ముగిసిన ఆసియాకప్‌లో చెత్త ఆటతో విమర్శల పాలైంది. కీలక ఆటగాళ్లు గాయాల పాలవడంతో అనామక జట్టయిన అఫ్ఘానిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అర్హత మ్యాచ్‌ల్లో ఈ జట్టుపై ఒత్తిడి ఉంటుంది. అఫ్ఘానిస్థాన్: ఈ పసికూన జట్టుకు ఇది మూడో టి20 ప్రపంచకప్. 2010, 2012 ప్రపంచకప్‌లో పాల్గొన్నా తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. అలాగని ఈ జట్టును తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో అప్ఘానిస్థాన్ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌ను ఓడించి తమలో సత్తా ఉందని నిరూపించింది. వన్డేల్లోనే తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ క్రికెట్ బేబీలు టి20ల్లోనూ రాణిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ జట్టులో కెప్టెన్ మహమ్మద్ నబీతో పాటు అస్ఘర్, ఆల్‌రౌండర్ సమీయుల్లా షెన్వారి, మీర్వాయిస్ అష్రాఫ్, షెహజాద్ లాంటి లాంటి ఆటగాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు. హాంకాంగ్: తొలిసారిగా టి20 ప్రపంచకప్ ఆడుతున్న ఈ జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు. ఐసీసీ టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆరో స్థానంలో నిలిచిన హాంకాంగ్‌కు ఫార్మాట్ మార్చడం కలిసొచ్చింది. జేమీ అట్కిన్సన్ సారథ్యంలోని ఈ జట్టులో సీనియర్లు, కుర్రాళ్లు ఉన్నారు. జట్టులో ఉన్నవారిలో ఎక్కువమంది ఆల్‌రౌండర్లే. నలభై ఏళ్లు పైబడిన నజీబ్ అమర్ (42), మునీర్ దార్ (41) అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించగలరు. నేపాల్: భారత్‌కు పొరుగు దేశమైన నేపాల్‌లో క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులు లక్షల్లో ఉన్నారు. అయితే నేపాల్ జట్టు మాత్రం క్రికెట్ ఆటలో మాత్రం వెనకబడే ఉంది. ఈ జట్టు ఆడబోతున్న అతిపెద్ద టోర్నీ టి20 ప్రపంచకపే కావడం విశేషం. అర్హత గ్రూప్‌లో ఈ జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు. కెప్టెన్ పారస్ ఖద్కా, శరద్ వెసావ్కర్, బసంత్ రెగ్మి నుంచి మంచి ప్రదర్శన ఆశించొచ్చు. జింబాబ్వే: గ్రూప్ ‘బి’లో టెస్టు హోదా ఉన్న జట్టు జింబాబ్వే ఒక్కటే. అయితే జింబాబ్వే ప్రధాన గ్రూప్‌కు అర్హత సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ టి20ల్లో జింబాబ్వే పెద్దగా విజయాలు సాధించకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటిదాకా టి20ల్లో 28 మ్యాచ్‌లు ఆడిన జింబాబ్వే 23 మ్యాచ్‌ల్లో ఓడి, 4 మ్యాచ్‌ల్లో నెగ్గి, మరో మ్యాచ్‌ను టై చేసుకొని ‘సూపర్ ఓవర్’లో గెలిచింది. ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో జింబాబ్వే ఆరు మ్యాచ్‌ల్లో ఆడి కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో నెగ్గి, ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఐర్లాండ్: ఈ గ్రూప్‌లో ఐర్లాండ్ ఫేవరెట్‌గా చెప్పుకోవచ్చు. టి20 ప్రపంచకప్‌లో ఈ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉంది. ఇప్పటిదాకా మూడు టి20 ప్రపంచకప్‌ల్లో పాల్గొన్న అనుభవం ఈ జట్టుకు ఉంది. ఇక 2009 ప్రపంచకప్‌లో ఈ ఐరిష్ జట్టు బంగ్లాదేశ్‌కు షాకిచ్చి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు కూడా సంచలనాలు సృష్టించేందుకు ఈ జట్టు సిద్ధమవుతోంది. ఇక ఐర్లాండ్‌లో కెప్టెన్ పోర్టర్‌ఫీల్డ్, ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రియాన్, వికెట్ కీపర్ నీల్ ఒబ్రియాన్తో పాటు సత్తా చాటే ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ జట్టులోని ఆటగాళ్లు తరుచుగా కౌంటీల్లో పాల్గొంటారు. నెదర్లాండ్స్: ఈ జట్టు తానాడిన తొలి టి20 ప్రపంచకప్‌లోనే సంచలనం సృష్టించింది. 2009లో ఇంగ్లండ్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టునే ఓడించి సత్తా చాటింది. ఈ గ్రూప్‌లో తన ప్రత్యర్థులకు గట్టిపోటీనిచ్చే అవకాశాలున్నాయి. కెప్టెన్ పీటర్ బోరెన్, వెస్లీ బరెసీ, ముదస్సర్ బుఖారి జట్టులో కీలక ఆటగాళ్లుగా చెప్పవచ్చు. యూఏఈ: తొలిసారిగా టి20 ప్రపంచకప్ ఆడనున్న యూఏఈపై పెద్దగా అంచనాలేమీ లేవు. అంతర్జాతీయ క్రికెట్లో యూఏఈ అప్పుడప్పుడు కనిపించినా... ప్రదర్శన అంతంత మాత్రమే. గ్రూప్ ‘ఎ’: బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్, నేపాల్. గ్రూప్ ‘బి’: జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్స్, యూఏఈ. టి20 ప్రపంచకప్‌లో నేడు బంగ్లాదేశ్ x అఫ్ఘానిస్థాన్ మధ్యాహ్నం గం. 3.00 నుంచి నేపాల్ x హాంకాంగ్ రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ మార్చి 16 బంగ్లాదేశ్ x అఫ్ఘానిస్థాన్ మార్చి 16 హాంకాంగ్ xనేపాల్ మార్చి 17 ఐర్లాండ్ x జింబాబ్వే మార్చి 17 నెదర్లాండ్స్ x యూఏఈ మార్చి 18 అఫ్ఘానిస్థాన్ xహాంకాంగ్ మార్చి 18 బంగ్లాదేశ్ xనేపాల్ మార్చి 19 నెదర్లాండ్స్ x జింబాబ్వే మార్చి 19 ఐర్లాండ్ x యూఏఈ మార్చి 20 అఫ్ఘానిస్థాన్ x నేపాల్ మార్చి 20 బంగ్లాదేశ్ x హాంకాంగ్ మార్చి 21 జింబాబ్వే x యూఏఈ మార్చి 21 ఐర్లాండ్ x నెదర్లాండ్స్ -
మోమినుల్ హక్ సెంచరీ
చిట్టగాంగ్: యువ బ్యాట్స్‌మన్ మోమినుల్ హక్ (274 బంతుల్లో 181; 27 ఫోర్లు) సెంచరీ సాధించడంతో బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్‌కు దీటైన జవాబిచ్చింది. ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆటముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు కేవలం 89 పరుగుల దూరంలోనే నిలిచింది. మూడో రోజు శుక్రవారం 103/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను మోమినుల్ నడిపించాడు. 77 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట కొనసాగించిన 22 ఏళ్ల హక్ 98 బంతుల్లోనే 18 ఫోర్లతో కెరీర్ తొలి సెంచరీ నమోదు చేశాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ శైలిని పోలినట్లు ఉండటంతో సహచరులంతా అతన్ని ‘సౌరవ్’గా పిలుచుకుంటారు. కెప్టెన్ ముష్ఫీకర్ రహీం (67) అర్ధసెంచరీ చేయగా, నాసిర్ హొస్సేన్ 46 పరుగులు చేశాడు. ఆట ముగిసే సమయానికి సొహాగ్ గజి (28), అబ్దుర్ రజాక్ (1) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్, కొరే అండర్సన్ చెరో 2 వికెట్లు తీశారు.