బంగ్లాదేశ్ 70 ఆలౌట్
రెండో వన్డేలో 177 పరుగులతో విండీస్ విజయం
సెయింట్ జార్జి: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు తమ చరిత్రలోనే మూడో అత్యల్ప స్కోరును నమోదు చే సింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ జట్టు... స్పిన్నర్ నరైన్ (3/13), పేసర్ రోచ్ (3/19) ధాటికి శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 24.4 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటయ్యింది. ఫలితంగా విండీస్ 177 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాపై విండీస్‌కిదే అతి పెద్ద విజయం. మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-0తో ఆధిక్యంలో ఉంది. చివరి వన్డే రేపు (సోమవారం) జరుగుతుంది. ఐదో ఓవర్ నుంచి సాగిన బంగ్లా వికెట్ల పతనాన్ని అడ్డుకునే బ్యాట్స్‌మెన్ కరువయ్యాడు.
ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (50 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. మిగిలిన పది మంది ఆటగాళ్లు కలిసి చేసిన పరుగులు 28 మాత్రమే. వీరిలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరును సాధించలేకపోగా చివరి ఏడు వికెట్లు కేవలం 13 పరుగుల వ్యవధిలోనే కుప్పకూలాయి. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 247 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (67 బంతుల్లో 58; 3 ఫోర్లు; 5 సిక్సర్లు) చెలరేగాడు. డ్వేన్ బ్రేవో (82 బంతుల్లో 53; 2 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించాడు. మిడిలార్డర్‌లో సిమ్మన్స్ (61 బంతుల్లో 40; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మొర్తజా మూడు, అల్ అమిన్ రెండు వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నరైన్‌కు దక్కింది.