బంగ్లా చిత్తు చిత్తు | West Indies won by 73 runs against bangladesh team | Sakshi
Sakshi News home page

బంగ్లా చిత్తు చిత్తు

Published Wed, Mar 26 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

బంగ్లా చిత్తు చిత్తు

బంగ్లా చిత్తు చిత్తు

 టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ బోణి
 మెరిసినడ్వేన్ స్మిత్   
 సమష్టిగా రాణించిన బౌలర్లు
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 పాపం... బంగ్లాదేశ్ అభిమానులు..! సొంతగడ్డపై టి20 ప్రపంచకప్‌లో సూపర్-10 స్టేజ్‌కి చేరిన తమ జట్టు ఆటను చూద్దామని... మ్యాచ్ ప్రారంభానికి నాలుగు గంటల ముందే స్టేడియం ముందు లైన్లలో నిలబడ్డారు. రెండు గంటల ముందే వచ్చి సీట్లలో కూర్చున్నారు. కానీ అందులో సగంసేపు కూడా స్టేడియంలో ఉండలేకపోయారు.
 
 తమ జట్టు ఆడుతున్న దారుణమైన ఆట చూడలేక మధ్యలోనే వెళ్లిపోయారు. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో టి20 ప్రపంచకప్‌లో బోణీ చేసింది. షేరే బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన  గ్రూప్ ‘2’ మ్యాచ్‌లో 73 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌తో శ్రీలంక తలపడతాయి.
 
 టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ (43 బంతుల్లో 72; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు వేగంతో అర్ధసెంచరీ చేశాడు. మరో ఓపెనర్ క్రిస్ గేల్ (48 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. స్మిత్, గేల్ తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించారు.
 
 శామ్యూల్స్ (22 బంతుల్లో 18; 1 ఫోర్) కూడా నెమ్మదిగానే ఆడాడు. చాలాసేపు నెమ్మదిగా ఆడిన గేల్ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. కెప్టెన్ స్యామీ (5 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు) చివర్లో చకచకా పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ పేసర్ అల్ అమీన్ హొస్సేన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీయడం విశేషం. మహ్మదుల్లా, షకీబ్, జియావుర్ ఒక్కో వికెట్ తీశారు.
 
 బంగ్లాదేశ్ 19.1 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటయింది. పవర్‌ప్లే ఓవర్లలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (22 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్సర్) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. వెస్టిండీస్ స్పిన్నర్ బద్రీ (4/15) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పేసర్ సాంటోకీ (3/17) ఆకట్టుకున్నాడు. గతి తప్పిన బౌలింగ్... క్యాచ్‌లు వదిలేయడం... పేలవమైన షాట్ సెలక్షన్... ఇలా బంగ్లాదేశ్ అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. డ్వేన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
 స్కోరు వివరాలు
 వెస్టిండీస్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) అమిన్ (బి) మహ్మదుల్లా 72; క్రిస్ గేల్ (సి) తమీమ్ (బి) జియావుర్ 48; సిమ్మన్స్ (స్టం) ముష్ఫికర్ (బి) షకీబ్ 0; శామ్యూల్స్ (సి) సోహాగ్ (బి) అమిన్ 18; స్యామీ నాటౌట్ 14; రస్సెల్ (సి) షకీబ్ (బి) అమిన్ 0; బ్రేవో (సి) తమీమ్ (బి) అమిన్ 0; రామ్‌దిన్ రనౌట్ 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 171
 వికెట్ల పతనం: 1-97; 2-98; 3-151; 4-167; 5-167; 6-168; 7-171.
 బౌలింగ్: మొర్తజా 4-0-25-0; అమిన్ 4-0-21-3; సోహాగ్ గజీ 4-0-38-0; షబ్బీర్ 1-0-12-0; మహ్మదుల్లా 3-0-27-1; షకీబ్ 3-0-21-1; జియావుర్ 1-0-16-1.
 
 బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) బ్రేవో (బి) బద్రీ 5; అనాముల్ (స్టం) రామ్‌దిన్ (బి) సాంటోకీ 10; మోమినుల్ (సి) సాంటోకీ (బి) నరైన్ 16; షకీబ్ (బి) సాంటోకీ 0; ముష్ఫికర్ (సి) బ్రేవో (బి) బద్రీ 22; షబ్బీర్ (సి) స్యామీ (బి) బద్రీ 1; మహ్మదుల్లా (సి) సిమ్మన్స్ (బి) బద్రీ 1; జియావుర్ (బి) రస్సెల్ 9; సోహాగ్ (బి) రస్సెల్ 11; మొర్తజా (సి) బ్రేవో (బి) సాంటోకీ 19; అల్ అమీన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 98
 వికెట్ల పతనం: 1-14; 2-16; 3-16; 4-51; 5-57; 6-58; 7-59; 8-73; 9-97; 10-98.
 బౌలింగ్: బద్రీ 4-0-15-4; సాంటోకీ 4-0-17-3; శామ్యూల్స్ 1-0-9-0; స్యామీ 1-0-6-0; నరైన్ 4-0-17-1; బ్రేవో 3-0-23-0; రస్సెల్ 2.1-0-10-2.
 
 జెండాలు నిషేధం
 సాక్షి, ఢాకా: వెస్టిండీస్, బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. తమ దేశం తప్ప, మరే దేశం జెండాలు అభిమానులు స్టేడియంలోకి తీసుకురాకూడదని బంగ్లా పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం బంగ్లాదేశ్‌లో 44వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ‘ఆసియాకప్ సందర్భంగా కొంతమంది బంగ్లా దేశీయులు పాకిస్థాన్ జెండాలతో తిరిగారు. దీంతో ఈసారి ఈ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది’ అని బీసీబీ అధికారులు వివరణ ఇచ్చారు. 1971 మార్చి 25 రాత్రి బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement