టెస్టు మ్యాచ్ కోసం తొలిసారి...
భారత గడ్డపై బంగ్లాదేశ్
హైదరాబాద్ చేరుకున్న జట్టు
హైదరాబాద్: దాదాపు 18 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ జట్టు మొదటి సారి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగింది. తమకు టెస్టు హోదా దక్కడంలో కీలక పాత్ర పోషించిన భారత్‌తోనే తొలి పోరులో బంగ్లా తలపడింది. ఢాకాలో నాలుగు రోజుల్లో ముగిసిన ఈ టెస్టులో భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టు సిరీస్‌లకు కూడా బంగ్లానే వేదికగా నిలిచింది. ఇప్పుడు మొదటిసారి బంగ్లాదేశ్ భారత గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నెల 9నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ముష్ఫికర్ రహీమ్ నాయకత్వంలోని బంగ్లా బృందం ఈ టెస్టులో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ చేరుకుంది. వరల్డ్ కప్‌లాంటి ఐసీసీ టోర్నీలో తప్ప వన్డే, టి20 ఫార్మాట్‌లలో కూడా భారతగడ్డపై ద్వైపాక్షిక సిరీస్‌లలో గతంలో బంగ్లా తలపడలేదు. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 8 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 6 గెలిచింది. మరో 2 ‘డ్రా’గా ముగిశాయి. టెస్టుకు ముందు బంగ్లాదేశ్ ఈ నెల 5, 6 తేదీల్లో భారత్ ‘ఎ’ జట్టుతో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడుతుంది.
మమ్మల్ని మేం నిరూపించుకుంటాం...
భారత గడ్డపై తొలిసారి ఆడుతున్నా, తాము అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలమని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ టెస్టును చారిత్రక మ్యాచ్‌గా తాము భావించడం లేదని అతను అన్నాడు. ‘భారత్‌లో కూడా మేం బాగా ఆడగలమని ప్రపంచానికి చూపించదలిచాం. మళ్లీ ఎన్నేళ్ల తర్వాత ఇక్కడ టెస్టు ఆడతామో ఇప్పడైతే తెలీదు కానీ భారత్ మమ్మల్ని మళ్లీ మళ్లీ ఆహ్వానించేలా మెరుగైన ఆటతీరు కనబరుస్తాం’ అని ముష్ఫికర్ చెప్పాడు. బౌలర్లకు అనుభవం తక్కువగా ఉన్నా...ఇటీవలి కాలంలో తమ బ్యాటింగ్ ప్రదర్శన చాలా బాగుందని, దానినే పునరావృతం చేస్తామని అతను అన్నాడు. టెస్టులో అశ్విన్, జడేజాలను బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదని రహీమ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో వీరిద్దరిది అత్యుత్తమ జోడి. ఇక్కడి పరిస్థితుల్లో వారి బౌలింగ్‌లో ఆడటం పెద్ద సవాల్‌లాంటిది’ అని అతను విశ్లేషించాడు. అయితే తమ ప్రధాన బ్యాట్స్‌మెన్ తమీమ్, ఇమ్రుల్, మహ్ముదుల్లా, సర్కార్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న విషయాన్ని ముష్ఫికర్ గుర్తు చేశాడు.