Test status
-
ఆ రెండు దేశాలకు టెస్టు హోదా
లండన్: గత కొంతకాలంగా అంచనాలు మించి రాణిస్తున్న అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్ జట్లకు టెస్టు హోదా దక్కింది. ఈ మేరకు లండన్ లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)లో ఆ రెండు జట్లకు టెస్టు హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఐసీసీలో పూర్తి సభ్యత్వం కల్గిన దేశాలుగా అఫ్ఘాన్, ఐర్లాండ్‌లు చోటు దక్కించుకున్నాయి. ఈ రెండు దేశాలకు టెస్టు హోదా దక్కడంతో టెస్టు మ్యాచ్‌లు ఆడే దేశాల సంఖ్య 12కు చేరింది. అఫ్ఘాన్, ఐర్లాండ్‌లకు టెస్టు హోదా కల్పించే విషయంలో ఏకగీవ్ర ఆమోదం లభించింది. దీనిలో భాగంగా నిర్వహించిన ఓటింగ్ లో ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆ రెండు దేశాలకు టెస్టు హోదా సులభంగానే దక్కింది. తమకు టెస్టు హోదా కల్పించాలని గతంలో అఫ్ఘాన్, ఐర్లాండ్ లు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారి విజ్ఞప్తికి ఎట్టకేలకు ఆమోద ముద్ర లభించడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులో ఆనందం వెల్లివిరిస్తోంది. ఐర్లాండ్ కు 2005లో వన్డే హోదా లభించగా, అఫ్ఘాన్ కు 2009లో వన్డే హోదా దక్కింది. -
బంగ్లాకు ‘వంద’నం
తమ 100వ టెస్టులో లంకపై చిరస్మరణీయ విజయం కొలంబో: టెస్టు హోదా పొందినప్పటి నుంచి 99 మ్యాచ్‌లాడినా... కూనలుగానే ముద్రపడిన బంగ్లాదేశ్ వందో టెస్టులో మాత్రం సమష్టి ఆటతీరుతో చారిత్రక విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. లంక తమ ముందుంచిన 191 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా 57.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (82; 7 ఫోర్లు, 1 సిక్స్) చక్కని పోరాటం చేశాడు. షబ్బీర్ (41; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. జట్టు స్కోరు 131 పరుగుల వద్ద లక్ష్యానికి ఇంకా 60 పరుగుల దూరంలో తమీమ్ మూడో వికెట్‌గా నిష్క్రమించడం, కాసేపటికే షబ్బీర్ కూడా ఔట్ కావడంతో బంగ్లా శిబిరంలో కలవరం మొదలైంది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (22 నాటౌట్), షకీబుల్ హసన్ (15) కుదురుగా ఆడటంతో బంగ్లా గట్టెక్కింది. లంక బౌలర్లు పెరీరా, హెరాత్‌లు చెరో 3 వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 268/8తో ఆదివారం చివరి రోజు ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 319 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి టెస్టులో లంక గెలవడంతో రెండు టెస్టుల ఈ సిరీస్ 1–1తో ముగిసింది. తమీమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... షకీబుల్ కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. విదేశీ గడ్డపై బంగ్లాకిది నాలుగో విజయంకాగా... శ్రీలంకపై తొలి గెలుపు. ఆస్ట్రేలియా, పాక్, విండీస్ తర్వాత తమ వందో టెస్టులో విజయాన్ని అందుకున్న నాలుగో జట్టు బంగ్లాదేశ్ కావడం విశేషం. -
టెస్టు మ్యాచ్ కోసం తొలిసారి...
భారత గడ్డపై బంగ్లాదేశ్ హైదరాబాద్ చేరుకున్న జట్టు హైదరాబాద్: దాదాపు 18 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ జట్టు మొదటి సారి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగింది. తమకు టెస్టు హోదా దక్కడంలో కీలక పాత్ర పోషించిన భారత్‌తోనే తొలి పోరులో బంగ్లా తలపడింది. ఢాకాలో నాలుగు రోజుల్లో ముగిసిన ఈ టెస్టులో భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టు సిరీస్‌లకు కూడా బంగ్లానే వేదికగా నిలిచింది. ఇప్పుడు మొదటిసారి బంగ్లాదేశ్ భారత గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నెల 9నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ముష్ఫికర్ రహీమ్ నాయకత్వంలోని బంగ్లా బృందం ఈ టెస్టులో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ చేరుకుంది. వరల్డ్ కప్‌లాంటి ఐసీసీ టోర్నీలో తప్ప వన్డే, టి20 ఫార్మాట్లలో కూడా భారతగడ్డపై ద్వైపాక్షిక సిరీస్‌లలో గతంలో బంగ్లా తలపడలేదు. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 8 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 6 గెలిచింది. మరో 2 ‘డ్రా’గా ముగిశాయి. టెస్టుకు ముందు బంగ్లాదేశ్ ఈ నెల 5, 6 తేదీల్లో భారత్ ‘ఎ’ జట్టుతో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడుతుంది. మమ్మల్ని మేం నిరూపించుకుంటాం... భారత గడ్డపై తొలిసారి ఆడుతున్నా, తాము అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలమని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ టెస్టును చారిత్రక మ్యాచ్‌గా తాము భావించడం లేదని అతను అన్నాడు. ‘భారత్‌లో కూడా మేం బాగా ఆడగలమని ప్రపంచానికి చూపించదలిచాం. మళ్లీ ఎన్నేళ్ల తర్వాత ఇక్కడ టెస్టు ఆడతామో ఇప్పడైతే తెలీదు కానీ భారత్ మమ్మల్ని మళ్లీ మళ్లీ ఆహ్వానించేలా మెరుగైన ఆటతీరు కనబరుస్తాం’ అని ముష్ఫికర్ చెప్పాడు. బౌలర్లకు అనుభవం తక్కువగా ఉన్నా...ఇటీవలి కాలంలో తమ బ్యాటింగ్ ప్రదర్శన చాలా బాగుందని, దానినే పునరావృతం చేస్తామని అతను అన్నాడు. టెస్టులో అశ్విన్, జడేజాలను బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదని రహీమ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో వీరిద్దరిది అత్యుత్తమ జోడి. ఇక్కడి పరిస్థితుల్లో వారి బౌలింగ్‌లో ఆడటం పెద్ద సవాల్లాంటిది’ అని అతను విశ్లేషించాడు. అయితే తమ ప్రధాన బ్యాట్స్‌మెన్ తమీమ్, ఇమ్రుల్, మహ్ముదుల్లా, సర్కార్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న విషయాన్ని ముష్ఫికర్ గుర్తు చేశాడు.